విధాత: తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. హైదరాబాద్లో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడిగా ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శిగా రమేష్ పాకని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పాత కమిటీ గడువు ముగియడంతో కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీఆర్ మల్లేష్కుమార్కి సెక్రటరీ జనరల్ పదోన్నతి కల్పించడం జరిగింది. సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.శ్రీనివాస్శంకర్, కోశాధికారిగా దోవ శ్రీనివాస్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సెంట్రల్ కమిటీలో 5గురు ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, 15 మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు. దీంతో పాటు అన్ని జిల్లా కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది. త్వరలోనే నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ చేయనున్నట్టుగా నూతన కమిటీ తెలిపింది.
ముఖ్య తీర్మానాలు
- రెవెన్యూ శాఖలో పదోన్నతులను చేపట్టాలి.
- నాయబ్ తహశీల్దార్లను తహశీల్దార్లుగా, తహశీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులను కల్పించాలి.
- కొత్తగా ఏర్పాటు చేసిన మండలలో మౌళిక వసతులను కల్పించాలి.
- ధరణీని సరళీకృతం చేసి రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను ఆర్డీఓ లేదా తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారం చేసే విధంగా అవకాశం కల్పించాలి.
- జనాభా ప్రాతిపదికన క్యాడర్ స్టెంత్ను పెంచి రెవెన్యూ శాఖను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలి.