విధాత: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), కానీ మరే అధీకృత సంస్థ అయినా ఒక సమాచారాన్ని నకిలీదని తేలిస్తే.. అట్టి దాన్ని అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ ప్రతిపాదించటంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్నది.
కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయం పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటానా స్వేచ్ఛకు భంగకరమని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) తీవ్రంగా ఖండించింది.
పీఐబీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ.. ప్రభుత్వ పరమైన సమాచారాన్నీ, అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు అధికారికంగా విడుదల చేసే సంస్థ. ఇలాంటి సంస్థ ఒక విషయాన్ని నకిలీదని తేల్చటంలోని పారదర్శకత, విచక్షణ ఏపాటిదని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
తమకు నచ్చని, లేదా విమర్శనాత్మకంగా ఉన్న వాటిని ఫేక్ న్యూస్ అని ముద్ర వేసి నియంత్రించాలను కోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటున్నారు. ఈ పేరుతో.. అన్ని మాద్యమాల నుంచి వార్తను తొలగించాలనుకోవటం విమర్శను ఆహ్వానించక పోవటమేనని విమర్శిస్తున్నారు.
గత కొంత కాలంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛపై కన్నెర చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బుద్ధిజీవులు, మేధావులను అనేక మందిని జైళ్లలో నిర్బంధించింది. అలాగే పత్రికా విలేకరులు వెలుబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా కేసులు నమోదు చేసి జైల్లో నిర్బంధించింది.
నిజనిర్ధారణకు పోయిన విలేకరులను సైతం అరెస్టు చేసి జైలు పాలు చేసింది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం తీవ్ర ఆక్షేపణీయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.