Parliament ఐదు రోజులపాటు సమావేశాలు బిల్లులపై జోరుగా ఊహాగానాలు న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. అజెండాపై ఇంకా సస్పెన్స్ తొలగడం లేదు. పార్లమెంటు 75 సంవత్సరాల ప్రస్థానంపై చర్చతోపాటు.. ఎన్నికల కమిషనర్ల నియామకం సహా నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెడతారన్న ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. పార్లమెంటు నూతన భవనం వద్ద రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో ప్రత్యేక సమావేశాలు కొత్త భవంతిలోనే జరుగుతాయనే […]

Parliament
- ఐదు రోజులపాటు సమావేశాలు
- బిల్లులపై జోరుగా ఊహాగానాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. అజెండాపై ఇంకా సస్పెన్స్ తొలగడం లేదు. పార్లమెంటు 75 సంవత్సరాల ప్రస్థానంపై చర్చతోపాటు.. ఎన్నికల కమిషనర్ల నియామకం సహా నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెడతారన్న ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. పార్లమెంటు నూతన భవనం వద్ద రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో ప్రత్యేక సమావేశాలు కొత్త భవంతిలోనే జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనూహ్యంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జమిలి ఎన్నికలు, ఇండియా పేర్పుతోపాటు మహిళా బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకం వంటి అంశాలపై ఊహాగానాలు ఉన్నా.. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చ ఉంటుందన్నది తప్ప మరే అంశం బయటకు రావడం లేదు. లిస్టెడ్ అజెండాలో లేకపోయినా కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు లేదా వేరే అంశాలు అజెండాలో చేర్చేందుకు ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉన్నది.
దీనిపై ఇటీవల కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ‘లెజిస్లేటివ్ గ్రెనేడ్స్’ ఉన్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏమీ లేని దానికి రాద్ధాంతం చేయడమేనని, ఆ రాద్ధాంతం కోసమే అయితే కేంద్రం నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల వరకూ వేచి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
అయితే.. మహిళా కోటా బిల్లు మాత్రం తప్పనిసరిగే ఉండే అవకాశం కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవలి జీ20 సమావేశాల్లో కూడా మహిళా సాధికారతను గురించి, వివిధ రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతున్న విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
కొత్త భవనంలోనే సమావేశాలు?
ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్వహించే అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ డిపార్లమెంట్ల సిబ్బందికి ప్రత్యేక యూనిఫారాలు కూడా ఎంపిక చేసిన నేపథ్యాన్ని కూడా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ డ్రెస్ కోడ్ కూడా ఇప్పటికే వివాదం సృష్టించింది. బీజేపీ తన ఎన్నికల గుర్తును కనిపించే విధంగా డ్రెస్ కోడ్ రూపొందించడం హీనమైన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు విమర్శించాయి.
- తొలి రెండు రోజుల ఎజెండానే చెప్పారు: ఎంపీ నామా
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సమావేశాల ఎజెండాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనివ్వకుండా గోప్యత పాటిస్తుందని బిఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు తప్పు బట్టారు. అఖిలపక్ష భేటీలో తొలి రెండు రోజుల ఎజెండా ఇచ్చారని, మిగతా మూడు రోజుల ఎజెండా ఏముంటుందో కేంద్రం చెప్పలేదన్నారు. ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో చూడాలని ఎంపీ నామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- సనాతనం పేరుతో విభజన రాజకీయం : ఎంపీ కేకే
మరో వైపు సనాతన ధర్మం పేరుతో బిజెపి విభజన రాజకీయాలు చేస్తుందని ఎంపీ కేశవరావు విమర్శించారు. సనాతనం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సనాతన, నాన్ సనాతన పేరుతో ప్రజలను విభజన చేస్తున్నారా అని నిలదీశారు. పురుష సూక్తం లో వర్ణవ్యవస్థ గురించి ఉందని, అది సమాజంలో అసమానతలను సూచిస్తుందన్నారు. నేను ఈ అంశంపై పీహెచ్ డి చేశానని, దీనిపై ఎంత లోతుగానైనా మాట్లాడతానన్నారు.
