HomelatestBRS | ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా లేదు! BRSలో అంతర్మథనం

BRS | ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా లేదు! BRSలో అంతర్మథనం

  • ప్రజా వ్యతిరేకతను అధిగమించడం ఎలా?
  • అధికార BRSలో అంతర్మథనం
  • కర్ణాటక ఫలితాలతో ఉత్సాహంలో కాంగ్రెస్‌
  • ముందుకు వెళ్లడంపై కసరత్తుకు రెడీ
  • ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా ఎలా మలుచుకుందాం?
  • ఏపీలోని విపక్ష పార్టీల సమాలోచనలు
  • బీజేపీతో ఆచితూచి వ్యవహరించనున్నటీడీపీ
  • కర్ణాటక ఫలితంపై ఏపీ, తెలంగాణ పార్టీల్లో చర్చలు

విధాత: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదని లేదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పక్షం బలం అంతా కూడా విపక్షాల అనైక్యతనే అన్నది స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు ఐక్యం కాకుండా విడిగా ఉండడం వల్లనే పాలక పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు పోల్‌ కావడంతో రెండవ సారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది.

అయితే ప్రజలు ఈ సారి కాస్త విజ్ఞతనే ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అభిప్రాయం సాధారణ ఓటర్లలో కూడ వ్యక్తమవుతుందని కర్ణాటక ఓటర్ల తీరును పరిశీలిస్తే అర్థమవుతున్నది. గత ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రజాస్వామ్యయతంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి వేసింది. ఈ అక్రమ పద్ధతిని కళ్లారా చూసిన కన్నడ ప్రజలు ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఓటు వేశారు.

ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓట్లు కాంగ్రెస్‌కే పోల్‌ కావడంతో కర్ణాటకలో సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. కన్నడ ప్రజలు అనుసరించిన తీరు చాలా తెలివైందని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు దారి చూపేలా ఉంది. ఇక కర్ణాటక పరాభవంతో బీజేపీ శ్రేణులు సైతం కాస్త దూకుడు తగ్గించి వెనకడుగు వేసే అవకాశం ఉంది. కర్ణాటక ఓటమి ఎటు దారితీస్తుందోనన్న భయాన్ని మోదీకి సైతం ఈ ఫలితం కలిగించిందన్న చర్చ జరుగుతున్నది.

కన్నడ తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ

కన్నడ ఓటర్లు అనుసరించిన తీరు తమ రాష్ట్రాలపై స్పష్టంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఇక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అవి ఏ ప్రత్యేకంగా విశ్లేషించుకుంటున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌.. తాను చేయించుకున్న అంతర్గత సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని తెలుసుకుంది. దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థులను మారిస్తే కానీ ఒడ్డునపడే పరిస్థితి లేదన్న అభిప్రాయంతో ఉన్నది. దీనికి తోడు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత భారీగా మూట కట్టుకున్నది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు బలపడితే మనకు అంత మేలు జరుగుతుందన్న అభిప్రాయంతో బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం ఉన్నదని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒక్కటే కాదు.. బీజేపీ, బీఎస్‌పీ, ఇతర పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తాము సులభంగా బయటపడతామనే ధీమాతో బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకూ ఉన్నది. కానీ కర్ణాటక ఫలితాలను గమనిస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం ఒక్క పార్టీకే లాభించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్‌కే పోల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన వ్యూహాన్ని మార్చుకోక తప్పదని అంటున్నారు.

సమరోత్సాహంలో తెలంగాణ కాంగ్రెస్‌

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో సమరోత్సాహం నెలకొన్నది. కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పనిచేస్తే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీ, BRS.. రెండూ ఒక్కటే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలని, వారి ఆచరణను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కే పోల్‌ అవుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్‌నేతలున్నారు. కమ్యూనిస్టు నాయకులు బీఆర్‌ఎస్‌ వెంట ఉన్నా తమకు జరిగే నష్టం ఏమిలేదని, క్షేత్ర స్థాయిలో వామపక్షాల క్యాడర్‌ తమతోనే కలిసి వస్తుందని ఒక నాయకుడు ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీలో కన్నడ కలకలం

ఏపీలోని అధికార వైసీపీని కర్ణాటక ఫలితం కలవరానికి గురి చేస్తున్నది. కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ప్రభుత్వ వ్యతిరేకత గుండుగుత్తగా ఒకే పార్టీకి మళ్లుతుందా? అనే చర్చ మొదలైంది. ఓట్లు చీలకుండా చూసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదిస్తున్నారు.

అయితే.. కర్ణాటక ఫలితాల అనంతరం టీడీపీ వ్యూహంలో మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో మోదీ ఇమేజి పని చేయలేదు.. పైడా డ్యామేజీ అయింది. దీని ప్రభావం ఏపీపై ఉంటుంది. మరో వైపు బీజేపీతోనే జగన్ అంట కాగుతున్నారు. జగన్‌కు కావాల్సిన వన్నీ బీజేపీ అగ్ర నాయతక్వం చేసి పెడుతున్నది. ఆయన కేసుల జోలికి వెళ్లడం లేదు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌పై చర్యలకు బీజేపీ అగ్రనాయత్వం అంగీకరించడం లేదు. కర్ణాటకలో ఓటమి కచ్చితంగా చంద్రబాబుకు సంతోషం కలిగించే విషయమే.

ఇలాంటి సమయంలో బీజేపీ కంటే.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిస్ట్‌లతో జత కడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్ట్‌లకు నిర్ణీత ఓటు బ్యాంకు ఉన్నది. పైగా సీట్ల విషయంలో డిమాండ్‌ కూడా చేయరు. ఇలాంటి అనుకూల అంశాలున్నప్పుడు కామ్రేడ్లే బెటర్‌అన్న అభిప్రాయాన్ని తెలుగు తమ్ముళ్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఇప్పటికిప్పుడే అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా ఆచి తూచి వ్యవహరించాలని టీడీపీ నేతలున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular