విధాత: ఎప్పుడెప్పుడా అని గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేసింది. అగ్నికీలలపై ఆదిపురుష్ ఆగమనం అద్భుతమనే రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ఈ టీజర్ 3D ఫార్మెట్‌లో చూస్తే మాత్రం.. ఒక చరిత్రను చాలా దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 12 జనవరి 2023లో సినిమాని విడుదల చేయనున్నారు. తాజాగా […]

విధాత: ఎప్పుడెప్పుడా అని గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేసింది. అగ్నికీలలపై ఆదిపురుష్ ఆగమనం అద్భుతమనే రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ఈ టీజర్ 3D ఫార్మెట్‌లో చూస్తే మాత్రం.. ఒక చరిత్రను చాలా దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 12 జనవరి 2023లో సినిమాని విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజర్‌ని.. దసరా పండుగను పురస్కరించుకుని రామ జన్మభూమి అయోధ్యలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్నా.. ఫస్ట్ లుక్ విడుదల విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ని బాగా డిజప్పాయింట్ చేశారు.

అయితే ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని ఇప్పుడు టీజర్‌ రూపంలో ఫ్యాన్స్‌కి ఇచ్చారు మేకర్స్. రెండు రోజుల క్రితం.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటికీ.. ఆ పోస్టర్ సేమ్ టు సేమ్ ‘RRR’లో రామ్‌చరణ్‌ రామ్ లుక్‌ని కాపీ చేసినట్లుగా ఉందంటూ ట్రోలింగ్ జరిగింది. కానీ టీజర్ మాత్రం ఆదిపురుష్ అదుర్స్ అనేలా ప్రతి ఒక్కరి చేత అనిపించేలా చేసింది.

టీజర్ విషయానికి వస్తే.. ‘భూమి క్రుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వ నాశనం..’ అంటూ నీటి లోపల తపస్సు చేస్తున్న రాముడిని పరిచయం చేశారు. ఈ పరిచయ సీన్‌కి సంబంధించిన విజువల్ నిజంగా వండర్ అనేలా ఉంది. ఆ తర్వాత లంకేశ్ (రావణ) పాత్రలో సైఫ్ అలీఖాన్‌ని చూపించిన తీరు, ఆయనలోని క్రూరత్వం, 10 తలల అవతారం.. అద్భుతంగా కుదిరాయి.

ఆ తర్వాత‘వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోటి.. పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి.. ఆగమనం’ అంటూ.. ప్రభాస్ పలికిన తీరు, ఆ డైలాగ్‌తో వచ్చే సన్నివేశాలు అబ్బుర పరిచేలా ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ‘అధర్మ విధ్వంసం’ అంటూ రామ బాణాన్ని ప్రభాస్ ఎక్కు పెట్టిన తీరు.. రేపు థియేటర్లలో చూసేటప్పుడు ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించడం ఖాయం. ఆ తర్వాత సీతగా నటించిన కృతిసనన్ లుక్‌ని పరిచయం చేశారు.

లంకేశ్‌ సామ్రాజ్యాన్ని రాముడి సైన్యం కమ్మేయడం.. రామసేతుపై రాముడు నడిచి వస్తున్న తీరు, సముద్రంలో హనుమంతుడిపై రాముడి ప్రయాణం.. చివరిలో త్రిమూర్తుల మాదిరిగా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు నడిచివస్తున్న సన్నివేశాలన్నీ విజువల్ వండర్ అనేలా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. ఓవరాల్‌గా.. ఇప్పటి వరకు ఈ సినిమాపై వినిపించిన రూమర్స్ అన్నింటికి.. ఈ టీజర్ చెక్ పెట్టేసిందని చెప్పుకోవచ్చు.

ఇక టీజర్ విడుదల సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చాం. మొదట ఈ పాత్రలో నటించేందుకు చాలా భయపడ్డాను. ప్రాజెక్ట్ అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓం రౌత్‌కు ఫోన్ చేశా. ఎలా నటించాలని అప్పుడు మాట్లాడుకున్నాం. ప్రేమ, భయభక్తులతో ఈ సినిమాని చేయడం జరిగింది.

అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులమయ్యాం.. శ్రీరాముడు దేవుడయ్యారు. ఆ శ్రీరాముడి కృప మాపై, ఈ సినిమాపై ఉంటుందని నమ్ముతున్నాం..’’ అని అన్నారు.

Updated On 2 Oct 2022 5:48 PM GMT
krs

krs

Next Story