White Canvas | చిత్రకారులు వేసే కొన్ని రకాల పెయింటింగ్‌లను చూసి.. ఇవేంటి ఇలా ఉన్నాయి అని చాలా సార్లు అనుకునే ఉంటాం. కానీ ఆయా చిత్రకారుల ట్రాక్ రికార్డు వల్ల, లేదంటే మనకు ఆ కళ తెలియకపోవడం వల్ల ఇది మనకు అర్థం కాలేదేమోలే అని సరిపెట్టుకుంటాం. తాజాగా జరిగిన ఒక వింత ఘటనలో ఒక పెయింటర్ ఖాళీ తెల్ల బోర్డు (Empty White Canvas) ను మ్యూజియంలో పెట్టాడు. ఇది పొరపాటునో గ్రహపాటునో జరిగింది […]

White Canvas |
చిత్రకారులు వేసే కొన్ని రకాల పెయింటింగ్‌లను చూసి.. ఇవేంటి ఇలా ఉన్నాయి అని చాలా సార్లు అనుకునే ఉంటాం. కానీ ఆయా చిత్రకారుల ట్రాక్ రికార్డు వల్ల, లేదంటే మనకు ఆ కళ తెలియకపోవడం వల్ల ఇది మనకు అర్థం కాలేదేమోలే అని సరిపెట్టుకుంటాం. తాజాగా జరిగిన ఒక వింత ఘటనలో ఒక పెయింటర్ ఖాళీ తెల్ల బోర్డు (Empty White Canvas) ను మ్యూజియంలో పెట్టాడు. ఇది పొరపాటునో గ్రహపాటునో జరిగింది కాదు.
ఒక గొప్ప పెయింటింగ్ అని భావిస్తూనే దానిని అక్కడ ప్రదర్శనకు ఉంచాడు. డెన్మార్క్ (Denmark) లో ఈ ఘటన జరగగా ఆ మ్యూజియం నిర్వాహకులు కోర్టుకెక్కారు. తాము ఒక పెయింటింగ్‌ను ప్రదర్శనకు ఇవ్వాలని ఆ ఆర్టిస్టుకు భారీ సొమ్ము ముట్టజెప్పామని.. అతడు ఇలా తెల్లబోర్డునే ఒక గొప్ప పెయింటింగ్ గా ప్రదర్శనకు పెట్టాడని నివేదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ మ్యూజియం చెల్లించిన సొమ్మును తిరిగిచ్చేయాలని ఆదేశిస్తూ జెన్స్ హానింగ్ అనే సదరు ఆర్టిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
2021లో ఒక ఆర్థిక పరమైన అంశంపై అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక పెయింట్‌ను వేసి ఇవ్వాలని.. అప్పటికే సమానత్వం, ఆశయం అని పోరాడుతూ పేరు గాంచిన జెన్స్ హానింగ్‌ను మ్యూజియం సంప్రదించింది. కాంట్రాక్టు నిమిత్తం అతడికి అక్షరాలా 49,527 డాలర్లను చెల్లించింది. పైగా అతడు గతంలో వేసిన చిత్రాలనే ఇవ్వాలని కోరింది. డానిష్ కరెన్సీ నోట్లను అందంగా కాన్వాస్‌పై చిత్రించి 2007లో , ఆస్ట్రియన్ యూరోలను చిత్రించి 2011లో అతడు మంచి మార్కులు కొట్టేశాడు.
ఆ కోవలోనే తమకూ ఒక పెయింటింగ్ కావాలని మ్యూజియం నిర్వాహకులు హానింగ్‌ను అడిగారు. ఆఖరికి ప్రదర్శన రోజు వచ్చేసరికి తన పెయింటింగ్ స్థానంలో ఖాళీ తెల్లటి కాన్వాస్‌ను పెట్టిన హానింగ్.. డబ్బు తీసుకుని పారిపోండి అని ట్యాగ్‌లైన్‌ను రాశాడు. అయితే ఈ ఐడియాను మ్యూజియం డైరెక్టర్ లాసే అండర్స్‌న్‌కు చూపించినప్పటికీ.. అతడి కాన్సెప్ట్ అర్థవంతంగానూ., ఆలోచింపచేసేది గానూ ఉందని భావించి ప్రదర్శనకు అనుమతించాడు.
అయితే మ్యూజియం యాజమాన్యం మాత్రం ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు మొత్తం డబ్బులు తిరిగివ్వాల్సిందేనని లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించింది. హానింగ్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో మ్యూజియం కోర్టుకు వెళ్లింది. తాజాగా సోమవారం కోపెన్‌హెగన్‌లోని కోర్టు 45,605 డాలర్లు వెనక్కి చెల్లించాల్సిందేనని నిందితుడికి స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది.
