Saturday, April 1, 2023
More
  HomelatestOscars | ద ఎలీఫాంట్ విస్పరర్స్.. కథేంటో తెలుసా? !

  Oscars | ద ఎలీఫాంట్ విస్పరర్స్.. కథేంటో తెలుసా? !

  Oscars | ప్రేమ లేదా అభిమానం అనండి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉదయిస్తుందో, వికసిస్తుందో చెప్పడం ఎవరికీ అంతు పట్టని విషయం. ఇది కేవలం మానవాళికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సమస్త ప్రాణి కోటికి సంబంధించిన విషయం. ఒక మనిషికీ, ఒక ఏనుగు పిల్లకీ మధ్య పెనవేసుకున్న భూత దయ ని మించిన ఒక ప్రేమానురాగమే ఈ చిత్రం.
  ఏ లైఫ్ అండ్ లవ్ స్టొరీ బిట్వీన్ లివింగ్ బీయింగ్స్!!

  డాల్బీ థియేటర్, లాస్ ఏంజిల్స్,
  95 వ అకాడెమీ అవార్డుల వేదిక
  ఇన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఫ్రొమ్ ఇండియా!

  అండ్ ఆస్కార్ గోస్ టు
  ద ఎలిఫాంట్ విస్పరర్స్ !

  కార్తీకి గొన్సాల్వేస్ అండ్ గునీత్ మొంగా !!
  షార్ట్ ఫిలిం కేటగిరీలో ఇండియన్ సినిమాకి బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మొదటి ఆస్కార్ ని గెలుచుకున్న దర్శక, నిర్మాతలు. ఇద్దరు కూడా మహిళలు కావడం ఒక విశేషం.

  తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్. ప్రభంజనంలో పడి 95వ అకాడెమీ అవార్డులు వొక పెద్ద ప్రహసనంగా మారుతున్నాయా అని ఒక అనుమాన బీజం మొలకెత్తే టైమ్ లో ద ఎలీఫాంట్ విస్పరర్స్ కి ఆస్కార్ ప్రకటించడం మనసుకి ఒక మంచి ఊరట. భారతీయ సినిమాకి ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీ ) ఆస్కార్ రావడం ఇదే ప్రధమం.

  ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి గొన్సాల్వేస్ కి కెమెరా మూడో కన్ను. వృత్తి రీత్యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. కొన్ని టి.వి. ఛానెల్స్ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పని చేసిన అనుభవం కూడా ఈ సినిమా కి ఒక ప్లస్ పాయింట్. సినిమా మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక గొప్ప సీనరీలా ఉంటుంది.

  కార్తీకి గొన్సాల్వేస్ స్వతహాగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడంతో ఈ చిత్రంలో నీలగిరి అడవుల అందాన్ని, పిల్ల ఏనుగుల ఎమోషన్స్ నీ చాలా సహజంగా, ప్రేక్షకుల మనసుకి దగ్గరయ్యేలా చాలా హ్రద్యంగా పిక్చరైస్ చేసింది. నీలగిరి అడవుల సోయగం, పరవళ్లు తొక్కే ఎత్తైన జలపాతాలు, పచ్చని అడవులు, మధుమలై నేషనల్ పార్క్ నేపధ్యం, నటన తెలీని ఇద్దరు ఆదివాసీలు-బొమ్మన్ అండ్ బెల్లీ, రెండు ఏనుగు పిల్లలు-రఘు అండ్ అమ్ము. వీరి మధ్య పెనవేసుకుకున్న ప్రేమే ఈ చిత్రం.

  ఇక కధ విషయానికి వస్తే, ఎప్పుడో, ఎక్కడో ఒకసారి అకస్మాత్తుగానో, యాదృచ్చికంగానో మనం చూసిన చిన్న సంఘటనే కావచ్చు. అక్కడే ఒక కథ మొదలవుతుంది. కానీ అది ఒక్కోసారి జీవితానికే ఒక గొప్ప మలుపు కావచ్చు.అలా మొదలయ్యిందే ఈ కధ.

  కార్తీకి గొన్సాల్వేస్ ఒక రోజు ఇంటికి వెళ్లే సమయంలో నీలగిరి అడవుల్లో ఏనుగు పిల్లని సొంత బిడ్డలా చూసుకుంటున్న బొమ్మన్ ని కలుస్తుంది. ఏనుగు పిల్లకీ , బొమ్మన్ కీ మధ్య పెనవేసుకున్న ప్రేమ వ్యాకరణం, ప్రేమ భాష, ఆ ఎమోషనల్ బాండింగ్ చూచి అదే తన కథగా సెలెక్ట్ చేసుకుంది. ఇది తనకి తొలి చిత్రం.

  బొమ్మన్ నీలగిరి అడవుల్లో నివసించే ఒక ఆదివాసీ. ఏనుగుల సంరక్షణ చూసే మావటి వాడు. మధుమలై కన్సర్వేషన్ పార్క్ నుంచి ఒక గాయపడిన ఏనుగు పిల్లని ఇంటికి తీసుకు వచ్చి రఘు అని పేరు పెట్టి ఆ ఏనుగు పిల్లని సొంత బిడ్డలా చూసుకుంటూ వుంటాడు. ఈ క్రమంలో బొమ్మన్ కి బెల్లీ తోడవుతుంది. మధ్యలో అమ్ము అనే మరొక ఏనుగు పిల్ల కూడా వచ్చి చేరుతుంది.

  ఇక బొమ్మన్, బెల్లీ, రఘు, అమ్ము అనే ఈ నలుగురి మధ్య పచ్చని తీగలా పెనవేసుకున్న ప్రేమానురాగాల పందిరి ఈ కధ. ఈ సినిమాలో ఎక్కడా ఏనుగు ఒక జంతువు అన్న భావన రాదు. వారి జీవితాల్లో రఘు, అమ్ము అలా ఒక భాగమై పోతారు. ఇక వారి మాటలన్నీ వాటి తోనే. మనం పిల్లలతో ఎలా మాట్లాడుతామో వారు రఘు, అమ్ము తో అలాగే మాట్లాడుతారు. బొమ్మన్, బెల్లీ మాట వాటికి అర్ధం అవుతుంది. అలాగే రఘు, అమ్ము మనసు వీరికి అర్ధం అవుతుంది.

  అయితే ఏనుగులని మళ్లీ మధుమలై కన్సర్వేషన్ వారు వెనక్కి తీసుకునే సన్నివేశంలో మూగ జీవాల ప్రేమ భాషని మాటల్లో చెప్పలేం. ఆ సన్నివేశం మాటలు లేని ఒక కంటి భాష. ఆ అనుభూతి మన వొళ్ళంతా చల్లని మంచులా చుట్టుకుంటుంది. అసలు జీవితంలో ఎన్నడూ ప్రేమని నమ్మని కఠినాత్ముడి కళ్ళు కూడా చెమ్మ గిల్లేలా అనిపిస్తుంది.అయితే బొమ్మన్, బెల్లీ రఘుని చూడాలనుకున్నప్పుడు కన్సర్వేషన్ పార్క్ కి వెళితే రఘు మమ్మల్ని గుర్తు పడతాడు. వాడి మాట అర్ధం అవుతుంది అని చెప్తారు. ఈ ఏనుగు పిల్లల సంరక్షణలో దగ్గర అయిన బొమ్మన్, బెల్లీ నిజంగానే పెళ్లి చేసుకోవడం మరొక శుభ సందర్భం.

  ఇంకో చెప్పుకో తగ్గ విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మొంగా కి ఇది రెండవ ఆస్కార్. 2019 లో పీరియడ్ – ఎండ్ ఆఫ్ సెంటన్స్ అనే షార్ట్ ఫిల్మ్ కి కూడా బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మొదటి ఆస్కార్ అందుకుంది. అలాగే కార్తీకి గొన్సాల్వేస్ తన మొదటి చిత్రంతోనే ఆస్కార్ అందుకుంది.

  ఇక ఈ డాక్యుమెంటరీ మేకింగ్ విషయానికి వస్తే, కార్తీకి గొన్సాల్వేస్ కి ఇదొక ఆరేళ్ళ తపస్సు. కేవలం నలభై ఒక్క నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ రూపొందించడానికి నాలుగు వందల ఏభై గంటల ఫుటేజీని రెడీ చేసుకుంది అంటే ఈ డాక్యుమెంటరీ పట్ల కార్తీకి గొన్సాల్వేస్ కి ఉన్న ప్రేమ, పర్ఫెక్షన్ ఏంటో మనకి అర్థమై పోతుంది. కాస్ట్యూమ్స్ లేవు. వేరే ఇతర నటీనటులు లేరు.

  అంతా కేవలం ఒక యదార్థ జీవితం. బొమ్మన్ అండ్ బెల్లీ నిజంగా ఏనుగులని పెంచుతున్న వారే. ఇండియన్ సినిమాలో ఈ డాక్యుమెంటరీ చడీ చప్పుడు లేని ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రేమ భాషని రచించిన ఒక దృశ్య కావ్యం. ఏ విధమైన ప్రచారం లేదు. ప్రమోషన్లు లేవు. హడావుడి, హంగామా లేనే లేదు. ప్రెస్ మీట్లు, ఆర్భాటాలు లేవు. అసలు ఈ సినిమా ఒకటుందని చిత్రం విడుదలయ్యి ఆస్కార్ గెలిచే వరకు ఎవరికీ తెలియదు కూడా.

  ఇదంతా ఒక ఎత్తయితే ఆస్కార్ వచ్చిన తరువాత కూడా ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా
  తెలుగు మీడియా ఈ చిత్రానికి ఇవ్వవలసిన కవరేజీని ఇవ్వక పోవడం చాలా విచారకరం. ఈ విషయంలో తెలుగు మీడియా గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

  అండ్ ఫైనల్లీ!
  లెట్ అస్ కాంగ్రాట్యులేట్ అండ్ గీవ్ బిగ్ అప్లాస్ టు
  కార్తీకి గొన్సాల్వేస్ అండ్ గునీత్ మొంగా !!

  జి.ఎస్.శ్రీకాంతు
  9963053217.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular