Saturday, April 1, 2023
More
  HomelatestRevanth Reddy: మీరు అనుభవిస్తున్న వైభవం.. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షే: రేవంత్‌రెడ్డి

  Revanth Reddy: మీరు అనుభవిస్తున్న వైభవం.. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షే: రేవంత్‌రెడ్డి

  • ఆరోజు తెలంగాణ ఇచ్చాం కాబట్టే మీకు ఇన్ని పదవులు
  • కేసీఆర్‌, మోడీ కులాలు, మతాల పేరుతో విభజించి పాలిస్తున్నారు
  • కేసీఆర్‌కు తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేదన్న తోట చంద్రశేఖర్‌ మాటలకు ఆయన మద్దతు ఉన్నదా?
  • మైనారిటీల గురించి షకీల్‌ అసెంబ్లీలో ఎన్నడైనా మాట్లాడారా?
  • రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలో కట్టినవే
  • బోధన్‌లో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడిన రేవంత్‌

  “తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరోజు మేము తెలంగాణ ఇవ్వకుంటే ఈరోజు మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. మీ అయ్య సీఎం, నువ్వు, నీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయింది. ఈరోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్ పార్టీనే” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న జుక్కల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

  విధాత‌: యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా ఆయన గురువారం బోధన్ నియోజకవర్గం పరిధిలోని ఎడపల్లి మండల కేంద్రం నుంచి బోధన్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జనసభలో ఆయన మాట్లాడుతూ.. గత నెల 6న తేదీన మేడారం సమ్మక్క-సారలమ్మ అశీర్వాదంతో మొదలుపెట్టిన యాత్ర మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో పూర్తి చేసుకున్నది.

  నేడు నిజామాబాద్ పార్లమెంటు స్థానంలోని బోధన్ నియోజకవర్గానికి యాత్ర చేరుకున్నది. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి నఫ్రత్ చోడో భారత్ జోడో అనే సందేశంతో రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్ర చేశారని తెలిపారు.

  అధికారంలోకి రాగానే ప్రాణహిత- చెవేళ్ల ప్రాజెక్టు పూర్తి

  నిజామాబాద్ అంటే నిజాం సాగర్ గుర్తుకొస్తుంది. బోధన్ అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొస్తుంది. నిజామాబాద్ అంటే పెద్దలు ఎం.నారాయణ రెడ్డి, అర్గుల రాజారాం, బాలగౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి వారు గుర్తుకొస్తారు. డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి ప్రాణహిత- చెవేళ్ల ప్రాజెక్టును మంజూరు చేశారు. కానీ నేడు కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. మేము అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

  అందుకే కోశాధికారిగా సుదర్శన్ రెడ్డి..

  నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి, షకీల్, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి భూ కబ్జాదారులు, ఇసుక దొంగలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇటువంటి సన్నాసులతో నేను పోటీ చేయలేను అని సుదర్శన్ రెడ్డి అన్నారు. అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మీ లాంటి వారు రాజకీయాల్లో ఉండాల‌ని కోరారు. దాంతో సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన లాంటి వారి సేవలు పార్టీకి అవసరం. కాబట్టి పార్టీ కోశాధికారిగా సుదర్శన్ రెడ్డిగారిని నియమించారని పేర్కొన్నారు.

  షకీల్ కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించ లేదు?

  ఇక్కడి ఎమ్మెల్యే షకీల్ బుద్ధిమంతుడు అని కనీసం టీఆర్ఎస్ నాయకులైనా చెప్పగలరా? మైనార్టీల కోసం షకీల్ ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా? అని ప్రశ్నించారు. మైనార్టీ సోదరులారా ఆలోచించండని రేవంత్‌ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షబ్బీర్ అలీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇప్పించారు.

  కానీ కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని మోసం చేస్తున్నాడు. దీనిపై షకీల్ కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆయన ఇసుక దొంగ, బియ్యం దొంగ, భూకబ్జాదారుడని రేవంత్‌ ఆరోపించాడు. తన దొంగతనాలు బయటపడతాయి కాబట్టి.. కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదన్నారు.

  ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టిందే..

  నిన్న జుక్కల్లో మీటింగ్ పెట్టి డ్రామారావు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది అడుగుతుండు. అరే సన్నాసి దేశంలో రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టిందే. నాగార్జునసాగర్, నెట్టంపాడు, జూరాల.. ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టినవే. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్ట్, ఐటీ, ఫార్మసీ కంపెనీలు, శిల్పారామం కట్టింది కాంగ్రెస్ పార్టీనే.

  తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే..

  దేశానికి స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఆ రోజు మేము తెలంగాణ ఇయ్యకుంటే ఈ రోజు మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. మీ అయ్యా సీఎం, నువ్వు, నీ బావా మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయింది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

  పార్లమెంటులో తలుపులు మూసినం, లైట్‌లు కట్ చేసి బరాబర్ తెలంగాణ ఇచ్చినం. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఏర్పడటం కేసీఆర్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ చేసిన ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ మద్దతు ఉన్నదా? అని ప్రశ్నించాడు.

  2024లో కాంగ్రెస్‌దే అధికారం..

  తెలంగాణ తెచ్చిన అన్న కేసీర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. కరీంనగర్‌లో మాట ఇచ్చిన మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మునిగిపోతారు అని ఆంధ్రా నాయకులు అనాడు అన్నారు. అయినా సోనియా గాంధీ రాజకీయాల గురించి ఆలోచించకుండా తెలంగాణ ఇచ్చారని తెలిపారు.

  ఆంధ్రా వాళ్లు అన్నట్లు మనం చేస్తే మనకు విలువ ఉంటుందా. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్, మైనార్టీ రిజర్వేషన్లు, రైతు రుణ మాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. కొత్త సంవత్సరంలో 2024 జనవరి 1న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతీ పేదవాడు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. సోనియమ్మ ఆశ్వీరాదంతో ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.

  ఇందిరమ్మ రైతు భరోసా…

  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న‌ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. చెక్కర ఫ్యాక్టరీలను ఆరు నెలల్లోగా తిరిగి తెరుస్తాం. చెరుకు, పసుపు, మొక్కజొన్న, వడ్లు, ఎర్ర జొన్నలను గిట్టు బాటు ధరకు కొంటాం.

  ఇందిరమ్మ రైతు భరోసా” పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తాం. ఇన్నిపనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యం తేవాలని ప్రజలకు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular