HomelatestThe Kerala Story | ప్రశాంత కొలనులోకి.. విసురుతున్న రాయి ‘ది కేరళ స్టోరీ’!

The Kerala Story | ప్రశాంత కొలనులోకి.. విసురుతున్న రాయి ‘ది కేరళ స్టోరీ’!

The Kerala Story

  • 32వేల మంది అదృశ్యమయ్యారంటూ కట్టుకథ
  • ఎక్కడా రికార్డుల్లో లేని ‘వేల కొద్దీ మతమార్పిడులు’
  • సినిమాను నిషేధించాలంటూ ఆందోళనలు

The Kerala Story । వేలమంది యువతులను మభ్యపెట్టి, మతమార్పిడి చేయించి, సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌ వంటి దేశాలకు పంపించి అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేర్పిస్తున్నారనే అంశంతో రూపొందించిన ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా సంచలనం రేపుతున్నది. దాదాపు 32వేల మంది యువతులను తరలించారని ఈ సినిమాలో చెబుతున్నా.. అధికారిక రికార్డుల్లో ఎక్కడా అలాంటి వివరాలు లేకపోవడం గమనార్హం. అధికార లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌), ప్రతిపక్ష యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, దాని అనుబంధ సంఘాలు ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నది. ఈ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలనే డిమాండ్లు ఉన్నాయి.

విధాత: అసత్యాలను ప్రచారం చేసేందుకే సంఘ్‌పరివార్‌ శక్తులు ఈ సినిమాను రూపొందించాయని ఏప్రిల్‌ 30న ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ప్రకటనలో కేరళ సీఎం పినరయి విజయన్‌ దుయ్యబట్టారు. కేరళకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం చేసేందుకు, రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు, మతపరమైన చీలికలు తెచ్చేందుకు ఈ సినిమాను ఉద్దేశించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతున్నదని విజయన్‌ విమర్శించారు.

లౌకకవాదానికి పేరెన్నికగన్న కేరళను మత ఉగ్రవాద కేంద్రంగా చూపించడం ద్వారా సంఘపరివార్‌ భావజాలాన్ని చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకు సంఘ్‌పరివార్‌ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇటువంటి ప్రాపగాండా సినిమాలని ఆయన అన్నారు. కేరళ సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చరియన్‌ సైతం ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘మత సామరస్యం పరిఢవిల్లే రాష్ట్రం కేరళ’ అని పేర్కొన్నారు.

రాష్ట్ర లౌకిక స్వభావాన్ని దెబ్బతీసేందుకు సంఘ్‌పరివార్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని స్పష్టం చేశారు. కేరళ సమాజాన్ని చీల్చి, కల్లోలం సృష్టించే కుట్ర అని ఆరోపించారు. ది కేరళ స్టోరీ సినిమాకు రచయిత, దర్శకుడు సుదీప్తో సేన్‌. ప్రధాన పాత్రలో అదా శర్మ నటించారు.

కేరళపై సంఘ్‌ కన్ను!

ఇటీవల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ కేరళ ప్రజల నమ్రత, కష్టించి పనిచేసే తత్వాన్ని ప్రశంసించారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని, విద్యావంతులని పొగిడారు. కానీ.. సంఘపరివార్‌ శక్తులు మాత్రం చైతన్యపూరితమైన, మతసామరస్యంతో జీవించే కేరళ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కేరళలో అప్పుడప్పుడు స్వల్ప మత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా.. మత ఘర్షణలకు ఏనాడూ అక్కడి ప్రజలు తావివ్వలేదు. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ కేరళ ప్రజలు జీవిస్తున్నారు. ఈ ప్రశాంత కొలనులో రాళ్లు విసరాలని సంఘపర్‌వార్‌ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి అనేందుకు ది కేరళ స్టోరీ సినిమా నిదర్శనంగా నిలుస్తున్నది.

విస్తరణ కోసం విద్వేష భాష

కేరళలోని మతసామరస్య వాతావరణాన్ని దెబ్బతీయడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు సంఘపరివార్‌, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2009, 2014, 2019, 2021లో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ.. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాదం మోపాలని బీజేపీ ఆశతో ఉన్నది. తాను విస్తరించాలనుకున్న ప్రతి చోటా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇది మితిమీరి జరుగుతుందనేందుకు గతంలో కర్ణాటకలో రేగిన హిజబ్‌ వివాదం నిదర్శనం.

మెజారిటీ మతానికి, మైనారిటీ మతానికి మధ్య చిచ్చుపెడితే.. అది తమకు రాజకీయంగా లాభిస్తుందనే దురుద్దేశం ఆ పార్టీ చర్యల్లో కనిపిస్తుంటుంది. అందుకు తగిన భూమికను సంఘ్‌పరివార్‌ శక్తులు ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం సాధించే పనిలో బీజేపీ పడింది. ఎలాంటి ఆధారాలు లేని అంశంతో కట్టుకథ ఒకటి అల్లి, దానిని సినిమాగా తెరకెక్కించడం ఈ నేపథ్యంలోనే చూడాలి.

వాస్తవానికి కేరళలో ఇప్పటి వరకూ 32వేల మంది యువతులను మభ్యపెట్టి, మతమార్పడి చేసి, సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి దేశాలకు పంపించారని, అక్కడ ఐఎస్‌ వంటి సంస్థల్లో చేర్పించారనేది కథాంశం. కానీ.. దీనికి ఒక్క ఆధారం కూడా లేదు. ఏ దర్యాప్తు సంస్థ కానీ, కోర్టులు కానీ ధృవీకరించలేదు. ఆఖరుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం పార్లమెంటులో సమాధానం ఇస్తూ అలాంటివేమీ జరుగలేదని తేల్చి చెప్పారు. అయినా.. ఈ కథతో సినిమా తీయడం ఎందుకో చాలా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. నిస్సందేహంగా ఇది ప్రజల మధ్య మతోన్మాద బీజాలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నమే.

పైగా భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారనే ఆరోపణ! భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది సమాజంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి లైసెన్స్‌ ఇచ్చినట్టు కాదన్న విషయాన్ని గుర్తించాలి.
అయితే.. వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సినీ నటి, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అదా శర్మ.. సంఖ్యను పక్కనపెట్టి.. సినిమా చూడండని కోరింది.

దర్శకుడు సైతం కేరళలో అదృశ్యమైన యువతుల సంఖ్య గురించి ఆర్‌టీఐని సంప్రదించానని, తనకు ఇంకా జవాబు రాలేదని చెప్పాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంఖ్య? ఏ ఆధారమూ లేకుండా ఇంత బాధ్యతారాహిత్యంతో సినిమా తీసే సాహసం ఎందుకు చేశారు? ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అర్థం చేసుకోవడం చాలా సులభం.

ముఖానికి రంగులేసుకునే సినీ నటులు దర్శకుడు ఏది చెబితే అది చేయడం తప్ప మరో దారి లేనివారు. వాళ్లు కిరాయి మనుషులు. కిరాయిగా కొంత పారితోషికం తీసుకుని సినిమాలో ‘నటిస్తారు’. అలాగే ఈ సినిమాలో నటించినవారికి సైతం మంచి పారితోషికాలే అంది ఉంటాయి. కానీ.. తమకు అందిన పారితోషికం.. ఒక సమాజాన్ని చీల్చేందుకు ఉద్దేశించిన ప్రయత్నంలో భాగమని సదరు నటులు గ్రహించలేరని అనుకోలేం.

ఏది ఏమైనా.. కేరళపై విష ప్రచారం చేసేందుకు, లేనిపోని అభాండాలు మోపి, కేరళను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఒక కుట్ర సాగుతున్నదనేది మాత్రం వాస్తవం. చైతన్యవంతులు, విద్యావంతులు అని ప్రధాని మోదీ ప్రశంసించిన కేరళ ప్రజలు ఇలాంటి ఎన్ని విద్వేష పూరిత సినిమాలు వచ్చినా పట్టించుకోకుండా.. తమ సామరస్య జీవనాన్ని అంతే సుహృద్భావంతో కొనసాగిస్తారని ఆశిద్దాం.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular