- కొడుకు పెట్టే బాధ భరించలేక హత్య
- విచారణలో తేల్చిన పోలీసులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్(Mahbubabad) జిల్లా ఈదుల పూసల పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో కన్న తల్లి నిందితురాలుగా తేలింది. గత రెండు మూడు సంవత్సరాలుగా తాగి వచ్చి కొడుకు పెట్టే బాధలు భరించలేక తల్లి ఈ హత్యకు ఒడిగట్టిందని కేసు విచారించిన పోలీసులు ఈ విషయాన్ని తేల్చారు. కన్న కొడుకును హత్య చేసిన తల్లిని అరెస్టు చేసి మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాలు..
మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లిలో ఆదివారం ఎండి ఉమర్ అనే యువకుడిని హత్య జరిగిన విషయం తెలిసిందే. ఉమర్ (20)అనే యువకుడిని హత్య చేసి దుండగులు మృతదేహాన్ని ఇంటి ముందు తెచ్చిపడేశారని తల్లి ఎం.డి.ఆశ మానుకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు తల్లి స్వయంగా హత్యకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు.
రెండు సంవత్సరాలుగా ఉమర్ మద్యానికి బానిసై తరచూ ఇంటికి వచ్చి తల్లి, చెల్లిని కొట్టేవాడని, బాధ భరించలేక తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పారు. ఆరోజు కూడా ఉమర్ బాగా తాగి రావడంతో రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. మృతి చెందిన విషయం గ్రహించి ఎవరో ఈ దాడి చేసినట్లు సృష్టించేందుకు ఉమర్ స్నేహితుడు తశ్రీబ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్ లో చేర్పించారు.
అప్పటికే ఉమర్ మృతి చెందాడు. ఈ కేసు విచారణ సందర్భంగా అనుమానం వచ్చిన పోలీసులు తల్లిని విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు నమోదు చేసి ఆశాను రిమాండ్ కు తరలించగా విషయం దాచి పెట్టినందున చెల్లిపై కూడా కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ పోలీసులు తెలిపారు.