Adilabad ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మొదలు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులూ తేలలేదు ఒకరు కుక్కర్లు, మరొకరు గొడుగులు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లతో ఒప్పందాలు? కొన్నిగ్రామాల్లో కులసంఘాల తీర్మానాలు పోటాపోటీగా జనాల్లో ప్రచారాలు ఉమ్మడి ఆదిలాబాద్‌లో తెరచాటు రాజకీయాలు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సాధారణ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రానేలేదు. అధికార పార్టీ మినహా, ఏపార్టీ అభ్యర్థి ఎవరనేది తేలనే లేదు. అప్పడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ […]

Adilabad

  • ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మొదలు
  • ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులూ తేలలేదు
  • ఒకరు కుక్కర్లు, మరొకరు గొడుగులు
  • గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లతో ఒప్పందాలు?
  • కొన్నిగ్రామాల్లో కులసంఘాల తీర్మానాలు
  • పోటాపోటీగా జనాల్లో ప్రచారాలు
  • ఉమ్మడి ఆదిలాబాద్‌లో తెరచాటు రాజకీయాలు

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సాధారణ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రానేలేదు. అధికార పార్టీ మినహా, ఏపార్టీ అభ్యర్థి ఎవరనేది తేలనే లేదు. అప్పడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నఅభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీల అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొని, టిక్కెట్ దక్కుంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరికొంతమంది దరఖాస్తులతో అధిష్టానం ముందు బారులు దీరారు. ఇంక ఆలస్యం ఎందుకని అనుకున్నారో.. ఏమో! ఇంతలోనే కొందరు నాయకులు ఎన్నికల తాయిలాలకు తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఒకరు గొడుగులు పంచితే .. మరొకరు చీరలు పంచుతున్నారు. ఇంకొకరేమో కుక్కర్లు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బహిరంగంగానే కొనసాగుతున్న కానుకల పంపిణీ అందర్నీ విస్తుగొల్పుతోంది.

కుక్కర్ విజిల్ కు అడ్డుతగిలిందెవరు?

అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ లో ఉండగా, బీజేపీ దరఖాస్తులు స్వీకరించే పనిలోనే ఉంది. కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అదిలాబాద్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తుండగా, మరో నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.

ఈ క్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి టికెట్ కన్నా ముందు ప్రజల వద్దకు వెళ్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ఫౌండేషన్ ద్వారా నిరుపేద ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారు. పంపిణీకి గాను ప్రెషర్ కుక్కర్స్ తెచ్చి గోదాంలో భద్రపరస్తుండగా, అధికార పార్టీ వాళ్లు అడ్డు తగిలారు. ఎలాంటి అనుమతులు లేవని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు తనిఖీలు చేయించడంతో పోలీసులు సీజ్ చేశారని కంది వర్గీయులు ఆరోపించారు.

కంది శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు చేసిన వస్తువులన్నిటికీ బిల్లులు చూయించారు. ఈ నేపథ్యంలో బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సీజ్ చేసిన ప్రెషర్ కుక్కర్లను తిరిగి వెనక్కు ఇచ్చినట్టు సమాచారం. కేఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మహిళలకు ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నాం… నిరుపేదలకు అండగా నిలిస్తే, అధికార పార్టీ అసూయ పడటం దేనికని ప్రశ్నించారు. కమీషన్ల డబ్బుతో కొనుగోలు చేయలేదని జోగు రామన్న పేరు చెప్పకనే చెబుతూ విమర్శించారు.

మంత్రి గారి గొడుగులు..

నోటిఫికేషన్ రాకముందే టికెట్ పొందిన అభ్యర్థులు, టికెట్ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు పోటాపోటీగా జనాల్లోకి వెళుతున్నారు. పార్టీ ప్రచారాలూ చేస్తున్నారు. రోజూ సాయంత్రం ధూమ్ ధామ్ గా దావతులకూ వెనుకాడడం లేదు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూనే ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

నిర్మల్ నియోజకవర్గంలో సీజనల్ గూడ్స్ పంపిణీ చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఏకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్షాకాలంలో పార్టీ అగ్ర నాయకుల ఫొటోలతో కూడిన గొడుగులు పంపిణీ చేశారు. వర్షంలో సైతం మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారస్తులందరికీ వందలాది గొడుగులు పంపిణీ చేశారు. ఏదో రకంగా జనంలో ప్రతిరోజూ ఉండాలనే లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు .

మంచిర్యాలలో చీరల గోల

మంచిర్యాల జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగేళ్లుగా ట్రస్టు ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈఏడాది నెల ముందుగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభ్యర్థులెవరనేది తేలకపోయినా… పోటాపోటీగా జనాల్లోకి వెళ్లి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. నాలుగేళ్లుగా అవసర నిమిత్తం ఏ నాయకునికి ఫోన్ చేసినా స్పందించిన దాఖలాలు లేవు. అయితే గత నెల నుంచి రోజూ రాజకీయ నాయకులను తప్పించుకొని తిరగాల్సి వస్తున్నదని ప్రజలు అంటున్నారు.

కష్టాల్లో ఉన్న నాడు కనపడని నాయకుడు, పిలువకున్నా వస్తూనే బాగోగులు అడిగి తెలుసుకోవడం, సాయంత్రం దావతులకు పిలవడం లాంటి కార్యక్రమాలపై కొంతమంది సంతోషం వ్యక్తం చేసినా, మరి కొంతమంది మాత్రం డిన్నర్ కు పిలిస్తే ఓట్లు అమ్ముకుంటామని లోలోన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు తాయిలాలు, నజరానాలకు మొగ్గు చూపుతారో? నిజాయితీపరులైన నాయకులకు ఊతమిస్తారో రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు కోసం వేచి చూడాల్సిందే.

Updated On 10 Sep 2023 6:43 AM GMT
somu

somu

Next Story