- TNGOs డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి
- శోభకృత్ నామ పంచాంగ ఆవిష్కరణ
The role of employees implementation of schemes Minister Jagdeesh Reddy
విధాత: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టి యన్ జి ఓ ఎస్(TNGOS) రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. వాటితో పాటుగా అంగన్ వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdeesh Reddy) ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
భారతదేశంలోనే రోల్ మోడల్‌గా తెలంగాణ..
అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ ఆచరణలో అమలు పరిచేది ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున యావత్ భారతదేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచింది అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రధానంగా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రజల మదిలో తెలంగాణా పదాన్ని ఒక శ్వాసగా మార్చింది టి యన్ జి వోఎస్ అని ఆయన కొనియాడారు. 75 సంవత్సరాలుగా తెలంగాణ అస్తిత్వాన్నీ నిలబెట్టిన ఘనత కుడా టి యన్ జి ఓ ఎస్ కే దక్కిందన్నారు.
ప్రభుత్వ విజయాల వెనుక ఉద్యోగుల పాత్ర…
ప్రభుత్వ విజయాల వెనుక ఉద్యోగుల పాత్ర ఉందీ అనడానికి సంచలనాల విజయాలు నమోదు చేసుకుంటూ యావత్ భారతదేశానికి అభివృద్ధి నమూనా అందించిన తెలంగాణ రాష్ట్రం ఒక తార్కణంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లావాత్మక మార్పులు తెచ్చిందన్నారు. పట్టణాలకే ఆ మార్పులు పరిమితం చెయ్యకుండా చివరి అంచు వరకు తీసుకపోవడంలో ఉద్యోగులు అందించిన సహకారం విస్మరించలేనిదన్నారు. కేంద్రంలోని మోదీ మాయాజాలం ఆదాని వ్యవహారంతో బట్టబయలు అయిందన్నారు. అనుచరులకు ప్రభుత్వ సొమ్ము 19 లక్షల కోట్లు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పేదోడిని కొట్టి పెద్దోడికి పెట్టె విధంగా మోడీ చర్యలు ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. అటువంటి మోడీ సర్కార్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టించే యత్నాలకు ఒడి గట్టిందని ఆయన విరుచుకుపడ్డారు.
మోదీపై విరుచుకుపడిన మంత్రి
రుణమాఫీ పధకం కింద 26,000 వేల కోట్లు, రైతుబంధు పథకం కింద 60,000 వేల కోట్లు, ఆసరా ఫించన్ల కింద 15,000 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్చు కోలేక పోతుందన్నారు. అది కేంద్రానికి కంటగింపుగా మారి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చెయ్యకుండా మోకాలొడ్డుతుందంటూ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే బ్యాంక్ లను ఒక్కటి చెయ్యాలి ఎల్ ఐ సి నీ పెట్టుబడి దారులకు ధారాదత్తం చెయ్యాలి అన్నది ప్రధాని మోడీ సంకల్పం అని ఆయన విమర్శించారు.
ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఉద్బోధ..
అటువంటి మోడీ పాలనలో మొట్టమొదలు నష్ట పోయిందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అని అటువంటి కేంద్ర ప్రభుత్వ చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్బోధించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టి యన్ జి ఓ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శోభకృత్ నామ పంచాంగాన్ని ఆవిష్కరించిన జగదీష్ రెడ్డి
నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగాన్ని శనివారం మంత్రి జి.జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సనాతన విలువలు విజ్ఞానము నేడు ప్రపంచంలో గొప్పదిగా గుర్తించబడుతున్నాయని అన్నారు. మానవ సమాజ పరిణామ క్రమంలో సాగించిన పరిశోధనలు అధ్యయనాలు అందించిన విజ్ఞానంతో భారతీయ సమాజం ప్రపంచ దేశాల్లో సామాజిక ఆధ్యాత్మిక ధార్మిక విలువల్లో ముందుంది అన్నారు. శోభకృత్ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు శుభకరమైన ఫలితాలు అందించాలన్నారు. అర్చక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పానగల్ వేద పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
ఇరిగేషన్ డేవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలచార్యులు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఆర్డీవో జయ చంద్రరెడ్డి, అర్చక సంఘాల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు