The Terminal Story
- త్రిశంకు స్వర్గంలో ఐదుగురు: హాలీవుడ్ సినిమాను మించిన రష్యన్ల కథ
విధాత: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా దాడి కొన్ని రోజుల్లోనే ముగుస్తుందనుకొన్నారు. కానీ అది దీర్ఘకాల యుద్ధంగా పరిణమిస్తున్నది. యుద్ధం అనేక విధాల కష్ట నష్టాలను తెస్తున్నది. దీంతో కన్నీటి గాథలు అన్నీ ఇన్నీ కావు. రష్యా దాడితో రక్తపుటేరుల్లో ఉక్రెయిన్ ప్రజల ఆకలికేకలు, ఆర్తనాదాలు ఒకవైపు ఉంటే.. మరో వైపు రష్యన్ వాసుల కష్టాలు భిన్నమైనవి.
అమెరికాకు ధీటుగా సూపర్ పవర్‌గా ఉన్న రష్యా ఉక్రెయిన్‌ను గంటలు, రోజుల్లోనే పాదా క్రాంతం చేసుకొంటుందని అందరూ భావించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తవుతున్నది. నానాటికీ యుద్ధ తీవ్రత పెరుగుతున్నది. సాధారణ పట్టణాలపై రష్యా క్షిపణులతో విరుచుకు పడుతున్నది. దీంతో ప్రజలు సమిధలవుతున్నారు.
అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నిర్బంధ సైనిక సమీకరణ కోసం పిలుపునిచ్చాడు. ప్రతి ఒక్కరూ యుద్ధ క్షేత్రంలోకి పోవటానికి సంసిద్ధంగా ఉండాలని దేశ ప్రజలను కోరాడు. దీంతో రష్యా వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ భూమిలోకి పోవటానికి రష్యా సైనికుల్లో సైతం పెద్ద ఎత్తున విముఖత వ్యక్తమవుతున్నది.
యుద్ధక్షేత్రంలోకి పోవటానికి నిరాకరించిన వారిని బంకర్లలో నిర్బంధిస్తున్నారని సైనికులు ఆరోపించారు. దానికి సంబంధించిన దృష్యాలు కూడా గతంలో వెలుగు చూశాయి. అది అలా ఉంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తప్పించుకోవటానికి ఓ వ్యక్తి ఏకంగా అడవిలోకి పారిపోయిన ఉదంతం కూడా వెలుగుచూసింది. ఆయన యుద్ధానికి పిలుపు వస్తుందనే భయంతోనే అడవిలోకి పారిపోయి అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు.
తాజాగా యుద్ధం నుంచి, నిర్బంధ సైనిక సమీకరణ నుంచి తప్పించుకోవటం కోసం.. ఐదుగురు రష్యన్లు దక్షిణ కొరియా పారిపోయారు. వారు సియోల్‌లోని ఇంచియాన్ విమానాశ్రయంలో గత ఐదు నెలలుగా ఉంటున్నారు. సైనిక కారణాల చేత వలసగా దీన్ని పరిగణించలేమని దక్షిణ కొరియా ప్రభుత్వం అంటూ వారిని దేశంలోకి అనుమతించలేదు.
కానీ పరిమిత వసతులు కల్పించి విమానాశ్రయంలోనే ఉండేందుకు అనుమతిచ్చింది. ఒక పూట భోజనంతో.. విమానాశ్రయంలోని ప్రయాణికులు అందించే ద్రావణాలు, పదార్థాలు తింటూ కాలం వెళ్ల బుచ్చుతున్నారు. ఈ ఐదుగురి పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది. అటు వెనుకకు రష్యాకు వెళ్లలేని దుస్థితి, ఇటు దక్షిణ కొరియా తమ దేశంలోకి అనుమతించని స్థితి.
నిర్బంధ సైనిక సమీకరణకు భయపడి పారిపోయిన వారు ఈ ఐదుగురే కాదు, అడవిలోకి పారిపోయిన ఒక్కడే కాదు. ఇలా దాదాపు రెండు లక్షల మంది నిర్బంధ సైనిక సమీకరణకు భయపడి దొంగతనంగా వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో తలదాచుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఇంచియాన్ విమనాశ్రయంలోని రష్యన్ బాధితుల గాథ.. హాలీవుడ్ సినిమా ది టెర్మినల్ ను తలపిస్తున్నది.