Adilabad | పట్టాలున్నాయంటూ ఆదివాసీల వాగ్వాదం మామూళ్ల కోసమే అధికారుల వేధింపులు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఆదివాసీ గిరిజనుల పోడు వ్యవసాయాన్ని అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు తిరగబడ్డారు. వాగ్వాదానికి దిగారు. పోడు భూములకు పట్టాలిచ్చి, నార్లు పోసి నాటే సమయంలో అటవీ భూములంటూ దౌర్జన్యం చేస్తున్నారని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పట్టాలిచ్చాక.. లంచాలెందుకు? మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో […]

Adilabad |

  • పట్టాలున్నాయంటూ ఆదివాసీల వాగ్వాదం
  • మామూళ్ల కోసమే అధికారుల వేధింపులు

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఆదివాసీ గిరిజనుల పోడు వ్యవసాయాన్ని అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు తిరగబడ్డారు. వాగ్వాదానికి దిగారు. పోడు భూములకు పట్టాలిచ్చి, నార్లు పోసి నాటే సమయంలో అటవీ భూములంటూ దౌర్జన్యం చేస్తున్నారని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులు మళ్లీ చిక్కుల్లో పడ్డారు.

పట్టాలిచ్చాక.. లంచాలెందుకు?

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. మళ్లీ ఫారెస్ట్ అధికారులను పంపి అవే భూములను దున్నకుండా అడ్డుకుంటున్నారు. దుక్కి దున్ని నారు పోసి తీరా పొలాల్లో నాట్లు వేసే సమయానికి ఇవి ఫారెస్ట్ భూములని, ఇందులో పంటలు వేయరాదని చెబుతున్నారు. 25 ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. గతంలో ఫారెస్టు అధికారులు తమ వద్ద నుంచి మామూళ్ళు వసూలు చేసేవారని ఆదివాసీలు చెబుతున్నారు.

గ్రామ సర్పంచ్ జల్ల సతీష్ ఆధ్వర్యంలో 300 ఎకరాలకు గానూ, ఒక్కో ఎకరానికి రూ.650 చొప్పున డబ్బులు చెల్లించేవాళ్లని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఇవ్వాలని ఫారెస్టు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందనీ, మేం లంచాలు ఎందుకు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులను నిలదీసినట్లు ఆదివాసీలు పేర్కొన్నారు.

న్యాయం కోసం కలెక్టర్ వద్దకు..

పోడు భూములకు 2008 లోనే ఇందిరా క్రాంతి పథకం ద్వారా పట్టాలు వచ్చాయి. ఇంద్ర జలప్రభ పథకం కింద బోర్లు వేసుకున్నారు. అప్పటి నుంచే ఫారెస్టు అధికారుల ఆగడాలు ఆగడం లేదు. పక్కా పట్టాలు ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని పది రోజుల క్రితం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారని వారు తెలిపారు.

కలెక్టర్ ఆదేశాలతో ఫారెస్టు అధికారుల ఆగడాలు ఆగుతాయి అనుకుంటే, నేడు మళ్ళీ అదే తరహాలో అడ్డుకుంటున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా భూములను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకొని, న్యాయం చేయాలని ఆదివాసి గిరిజనులు కోరుతున్నారు.

Updated On 31 Aug 2023 3:13 PM GMT
somu

somu

Next Story