విధాత: ఏపీలో మూడు పట్టభద్రులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం దేనికి సంకేతం? ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఈ ఫలితాలు వైసీపీకి మింగుడు పడనివే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మూడు స్థానాలు ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపుర- కర్నూలు) ప్రాంతాలు కావడం.
రాయలసీమలో తమకు తిరుగులేదని, అవి వైసీపీ కంచుకోటలు అనుకుంటున్న సమయంలో అక్కడి పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. మరీ ముఖ్యంగా త్వరలోనే విశాఖ నుంచే పాలన సాగిస్తామని, అదే ఏపీ రాజధానిని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న ఈ సమయంలో ఉత్తరాంధ్రలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలువడం గమనార్హం.
అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లు ఆ పార్టీ వైపు మళ్లాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించబోవని, వాటిని హెచ్చరికగా భావించడం లేదని సజ్జల సమర్థించుకోవచ్చు. కానీ గుంటూరు, కృష్ణ, ఉత్తరాంధ్ర, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ బలంగానే ఉన్నది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఉంటుంది అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు, వామపక్షాలు కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావొచ్చు అనే అభిప్రాయం ఉన్నది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలుపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ ఫలితాలు.. ప్రజావిజయం, మార్పునకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ శ్రేణులకు ఈ ఫలితాలు ఉత్సాహాన్ని అందించాయి.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. ఇది కాషాయ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. విజయం సాధించిన ఏవీఎన్‌రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. అవినీతితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అనడానికి ఈ గెలుపే నిదర్శనమని అమిత్ షా అన్నారు.
ఈ గెలుపు కోసం కృషి చేసిన సంజయ్ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను ఇద్దరూ నేతలు ట్విట్టర్‌లో అభినందించారు. ఈ ఎన్నికలో అధికార బీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. ఎవరినీ బలపరచలేదు. కానీ ఉపాధ్యాయులు బీజేపీ వైపు మొగ్గడం, తాజాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉండటం వంటివి పరిణామాలు రానున్న రోజుల్లో ఎటువైపు దారి తీస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయినా డేంజర్ బెల్స్‌గానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.