విధాత: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో గురువారం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి టి హరీష్ రావు వెల్లడించారు. రెండో విడత దళిత బంధు పథకం ద్వారా 1లక్షా 30 వేల కుటుంబాలకు సహాయం అందించాలని నిర్ణయించారు.
119 నియోజకవర్గాలలో ప్రతి ఏటా ఆగస్టు నెలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో దళిత బంధు వేడుకలు నిర్వహించాలని నిర్వహించారు. అలాగే సొంత జాగా ఉన్నవారికి గృహ లక్ష్మీ పథకం కింద రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లను ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతి ఇంటి లబ్ధిదారుడికి 3 లక్షల రూపాయలను గ్రాంట్ గా, మూడు దఫాలుగా ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు.
ఈ పథకం కోసం ఇప్పటికే బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయింపు చేశారు. ఇండ్ల మంజూరు ను మహిళల పేరు మీద ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఉన్న 4000 కోట్ల అప్పులను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. గొర్రెల పంపిణీ పథకం కింద 7 లక్షల లబ్ధిదారుల్లో మిగిలిన 50% లబ్ధిదారులకు ఆగస్టు నెలలో పథకం యూనిట్లను అందించాలని నిర్ణయించారు. ఇందు కోసం 4,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
అలాగే నాలుగు లక్షల ఎకరాలలల్ పోడు భూములకు సంబంధించిన లక్షా 55వేల 393 మందికి పట్టాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా ప్రారంభించాలని, అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
జీవో 58, 59 ద్వారా ఒక రూపాయి లేకుండా పేదలకు ఇంటిపై హక్కు కల్పించాలని నిర్ణయించారు. జీవో 58 కింద 1,45,000 మందికి పట్టాలు ఇవ్వగా, కటాఫ్ తేదీని నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. జీవో 59 కింద 42,000 మంది లబ్ధి పొందినట్లు తెలిపింది.
కాశీలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన వసతి గృహ నిర్మాణానికి 25 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శబరిమలలో 25 కోట్లతో వసతి గృహం నిర్మించాలని తీర్మానించింది. త్వరలోనే శబరిమలలో మంత్రుల బృందం పర్యటించనుంది. నెల రోజుల వ్యవధిలోని రాష్ట్ర సెక్రటేరియట్జ్ అమరుల ఖ్యాతిద్వీపం, అంబేద్కర్ విగ్రహం ప్రారంభం ఉంటుందని క్యాబినెట్ పేర్కొంది.