Friday, December 9, 2022
More
  Homelatestఇవే చివ‌రి ఎన్నిక‌లు.. చంద్రబాబు!.. భ‌య‌మా.. బెదిరింపా?

  ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. చంద్రబాబు!.. భ‌య‌మా.. బెదిరింపా?

  • ఒంట‌రిగా పోటీ చేయ‌లేని ప‌రిస్థ‌తి
  • ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ని బీజేపీ
  • ప‌వ‌న్‌తో పొత్తు కుదిరేనా
  • క‌నిపించ‌ని దారి.. తెన్ను
  • 2024 ఎన్నిక‌ల పైనే ఆశ‌..

  విధాత: దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్న చంద్రబాబు కెరీర్ ముగింపుకు వచ్చేసిందా.. దీన్ని ఆయనే అన్యాపదేశంగా అంగీకరిస్తున్నారా… లేదా ఓటర్లు, ప్రజలను బెదిరిస్తున్నారా.. లేక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఉన్న విజయావకాశాలు చూసి ఆయనే భయపడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ నాకు రానున్న 2024 ఎన్నికలే చివరివి.. ఈసారి నన్ను గెలిపించకుంటే కెరీర్ ముగిసినట్లే అన్నారు. నిజమే ఆయనకు ఇప్పటికే 74 ఏళ్ళు .. అంటే ఈసారి కాకుంటే మళ్లీ 2029 నాటికి ఆయనకు 80 దగ్గర పడతాయి. అప్పటికిక‌ ఎన్నికల్లో శ్రేణులను నడిపించడం అంత ఈజీ కాదు.. ఆ వాస్తవం గ్రహించిన చంద్రబాబు తనకు చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

  మరోవైపు జగన్ కూడా ఈసారి మనం గెలిస్తే మరో ముప్పయ్యేళ్లు అధికారంలో ఉంటాం కాబట్టి అందరూ విభేదాలు వదిలేసి కలిసికట్టుగా పని చేయండి అని క్యాడర్ ను కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా చంద్రబాబులో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి. పార్టీ గమనం ఏమిటో తెలియడం లేదు.

  పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందో చంద్రబాబుకు 2019లోనే మరోసారి తెలిసొచ్చింది. గతంలో 2014లో పవన్.. బీజేపీల సాయంతోఅధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో ఆ ఇద్దర్నీ వదిలేసి సింగిల్ గా ఎన్నికలకు వెళ్లి దెబ్బ తిన్నారు.

  దీంతో 2024లో ఎలాగైనా మళ్లీ పాత కాంబినేషన్ రిపీట్ చేద్దాం అని చూస్తున్నా కుదిరేలా లేదు. బీజేపీ సుతార‌మూ దగ్గరకు రానివ్వడం లేదు. పోనీ పవన్ అయినా వస్తాడేమో అనుకుంటే ఆయన్ను కూడా బీజేపీ హైజాక్ చేసేలా ఉంది. ఇప్పుడు ఎటు చూసినా పాజిటివ్ పరిస్థితులు లేవు. అంతా చిమ్మచీకటి.. దారి.. గమ్యం కానరావడం లేదు.

  ఇక ఒంటరిగా ఎన్నికలకు వెళ్ల‌ తప్పేలా లేదు. అలా వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ అనుభవము ఉంది. అందుకే ప్రజలను ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకునేందుకు, నచ్చజెప్పేందుకు లేదా హెచ్చరించేందుకు అన్నట్లుగా చూసుకోండి… ఇవే నాకు చివరి ఎన్నికలు అంటున్నారు.

  అంటే ఈసారి తనను గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తూనే మనకు ఇవే చివరి ఎన్నికలు.. ఈసారి గెలవకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త అంటూ క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుకు భవిష్యద్దర్శనం అయిందనుకోవాలా ? ఇప్పట్నుంచే రానున్న ఎన్నికలకు రెడీ అవుతున్నారని అనుకోవాలా తెలీడం లేదు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page