విధాత: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ అనే రెండు భాగాలకు వచ్చిన క్రేజ్లాగే అన్‌స్టాపబుల్ విత్ NBK 2లోని ప్రభాస్ ఎపిసోడ్ రెండు పార్ట్‌లకు ఆ స్థాయి క్రేజ్ వస్తుందని ఆహా టీం భావించింది.
ప్రభాస్ కొత్త సినిమాకు మించిన హైపు దీనికి రావడానికి కారణం అరుదుగా బయట కనిపించే ప్రభాస్ ఇలాంటి బోల్డ్ షో కి రావడమే. దానికి తోడు హోస్ట్‌గా బాలకృష్ణ ఉన్నాడు. ఇక ప్రొమోలతో బాగానే మెప్పించారు. దానిని బాగా క్యాష్ చేసుకోవాలని భావించారు.
మొత్తానికి ప్రభాస్ ఎపిసోడ్ ద్వారా పెద్ద మొత్తంలో సబ్‌స్క్రైబర్స్‌ని రాబట్టాలని ప్లాన్ చేసింది. అందుకే ఒక ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా విభజించి టెలికాస్ట్ చేసింది. కానీ డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ని, ఆయన ఇచ్చిన అరుదైన అవకాశాన్ని ఆహా సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పాలి.
ప్రోమోలలో చూపించిన మజా ఎపిసోడ్స్‌లో మిస్సయింది. కేవలం పుకార్ల మీద కాంట్రవర్సీల మీద దృష్టి కేంద్రీకరించారే గాని ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ కంటెంట్‌ను రాబట్టడంలో ఈ షో విఫలమైంది.
ఇక మొదటి ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుందని తెలిసినా ఆహా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. లక్షల్లో సబ్స్క్రైబర్స్ లాగిన్ అవడంతో సర్వర్ సపోర్ట్ చేయలేకపోవడంతో ఓవర్ లోడ్ కారణంగా సర్వర్ పనిచేయడం ఆపేసింది. దాంతో యాప్ కూడా పనిచేయలేదు.
పెద్ద మొత్తంలో ఎపిసోడ్‌ని జనాలు చూసే అరుదైన అవకాశం ఆహా కోల్పోయింది. దీన్ని బాహుబలి ఎపిసోడ్ ఫస్ట్ ఫెయిల్యూర్‌గా చెప్పవచ్చు. ఎంతసేపటికి ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆయన జీవితంలో ఎవరైనా ఉన్నారా? అనుష్క శెట్టి, కృతిసనన్లతో ఆయన ఎఫైర్లకు సంబంధించిన ప్రశ్నలే వేశారు.
వాటికి ఏ తెలుగు హీరో అయినా ఏం చెబుతాడు? ఎదురుగా ఉన్నది బాలయ్య అయినా ఆయన పెదనాన్న అయినా అలాంటివి ఏమీ లేవు. నేను రాముడిని మించిన మంచి బాలుడిని అంటాడు. కానీ జనాలు మాత్రం ప్రభాస్ ఏం సమాధానం చెబుతాడా అని ఎదురుచూశారు. ప్రశ్నలు ఓకే అనిపించేలా బాలయ్య అడిగారు. కానీ వాటికి ప్రభాస్ ఇచ్చిన సమాధానాలు ఎవరికీ కిక్ ఇవ్వలేదు.
ఇదేమీ బాలీవుడ్ షో హాలీవుడ్ షో కాదు కదా! ఇక పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు అయితే ప్రభాస్ రాత బాగాలేదు… సల్మాన్ పెళ్లి తరువాత నాది అని తేల్చి పారేశాడు. ఇవి కొంత ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు గానీ ఈ విషయంలో కూడా స్పష్టమైన క్లారిటీని ఈ షో ద్వారా ఇవ్వలేకపోయారు. అంశాల వారీగా ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా ప్లాన్ చేసుకోకుండా ఉండడమే దీనికి కారణం.
రెండు ఎపిసోడ్స్‌గా దీనిని విభజించినప్పుడు ప్లానింగ్ సరిగా ఉండాలి. కాంట్రవర్సీకి మించి ఎమోషనల్ కంటెంట్ రాబట్టాలి. ఆలీతో సరదాగా షోలో ఇది మనకు బాగా అర్థమవుతుంది. అలీ అలాంటి ఎమోషన్స్‌ను అతిథుల నుంచి బాగా రాబట్టుతున్నాడు. కానీ ఆ విషయంలో బాలయ్య ఫెయిల్ అయ్యాడు.
ఇక్కడ బాలయ్య ఫెయిల్ అయ్యాడు అని చెప్పడం కంటే ఈ సీజన్‌కు డైరెక్షన్ చేస్తున్న బి.వి.ఎస్. రవి వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. దీనిలో బాలయ్యను నిందించడానికి ఏమీ లేదు. ఒక్క పెదనాన్న మరణం గురించి అడిగినప్పుడు మాత్రం ఆ ఎమోషన్ యాంగిల్ కాస్త వర్కవుట్ అయింది.
ఎవరు ఏమి ఫీలైనా సరే ఈ ఎపిసోడ్‌ని రన్ చేసిన విధానం చూస్తే దీని కంటే అలీ, సుమాలు చేసే టాక్స్ షోలే బాగుంటాయని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యారిలో రానా దగ్గుబాటి నిర్వహించిన టాక్ షో దీనికంటే 100 రెట్లు బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.