Love Story | ప్రేమకు ఎల్లలు ఉండవని నిరూపించారు ఈ ప్రేమికులు. ఎల్లలు లేని ప్రేమ కోసం.. ఓ ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏకంగా ఏడు దేశాలు దాటాడు. అది కూడా ఏదో విమానంలో, రైల్లో అనుకుంటే పొరపాటే.. కేవలం సైకిల్ పైనే. ఈ నిజమైన ప్రేమకథా తెలుసుకోవాలంటే భారత్ నుంచి స్వీడన్‌కు ప్రయాణించాల్సిందే.
భారత్‌లోని ఓ గిరిజన తెగకు చెందిన డాక్టర్ ప్రద్యూమ్న కుమార్ మహానందియాకు చిన్నప్పట్నుంచే చిత్రాలు వేసే అలవాటుంది. తన చిన్న వయసులోనే మహానందియా చిత్రకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతని ఆర్ట్‌కు ఫిదా అయిపోయిన ఓ స్వీడన్ యువతి చార్లోట్టే వోన్ షెడ్విన్ భారత్‌కు వచ్చి మహా నందియాను కలుసుకుంది.
తన ముందే ఆమె చిత్రాలను ఓ మూడు గీసేశాడు. అప్పుడే అతన్ని ఆమె ప్రేమించడం మొదలుపెట్టింది. అతను కూడా ఆమె ప్రేమ కౌగిట్లో వాలిపోయాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహాం కూడా చేసుకున్నారు. ఇదంతా 1975లో జరిగింది.
ఇక షెడ్విన్ తన స్వీడన్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన మరుక్షణం నుంచి మహానందియా మె గురించే ఆలోచించడం మొదలు పెట్టాడు. అప్పటికీ మహానందియా స్టడీస్ పూర్తి కాలేదు. ఇక ఇద్దరూ ఉత్తరాల ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ, ఒక సంవత్సర కాలం పాటు గడిపారు. ఏడాది తర్వాత తన విద్యాభ్యాసం పూర్తి కావడంతో.. స్వీడన్ వెళ్లాలని మహానందియా నిర్ణయించుకున్నాడు. కానీ స్వీడన్ ప్రయాణించేంత డబ్బు తన వద్ద లేదు. విమాన ప్రయాణాన్ని వద్దనుకున్నాడు.
స్వీడన్ వెళ్లేందుకు మహానందియా ఓ సైకిల్‌ను కొనుగోలు చేశాడు. ఇండియా నుంచి స్వీడన్ బయల్దేరిన మహానందియా నాలుగు నెలల పాటు సైకిల్‌పై ప్రయాణించాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ.. అలా ఏడు దేశాల మీదుగా తన సైకిల్ ప్రయాణం కొనసాగింది.
1977 జనవరి 22న ప్రారంభమైన తన ప్రయాణంలో ప్రతి రోజు 70 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా 9 వేల కిలోమీటర్లు సైకిల్ సవారీ చేసి చివరకు తన ప్రేయసి షెడ్విన్‌ను కలుసుకున్నాడు. మే 28న తన ప్రయాణం ముగిసింది.
మహానందియా, షెడ్విన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ జంట స్వీడన్‌లోనే ఉంటుంది. ఇప్పటికీ కూడా మహానందియా చిత్రకారుడిగా కొనసాగుతూ.. ఆనందమయమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
View this post on Instagram