HomelatestDK Shiva Kumar | ఈ విజ‌యం అంద‌రిది: డీకే శివకుమార్‌

DK Shiva Kumar | ఈ విజ‌యం అంద‌రిది: డీకే శివకుమార్‌

DK Shiva Kumar |

  • కాంగ్రెస్ గెలుపులో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు,
  • కార్య‌ద‌ర్శులు అందరి భాగస్వామ్యం
  • ప్ర‌జ‌లు మాపై విశ్వాసం ఉంచారు
  • క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు శివ‌కుమార్‌

విధాత‌: క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ గెలుపు ఏ ఒక్క‌రి సొంతం కాద‌ని, పార్టీ శ్రేణుల‌ స‌మిష్టి విజ‌యమ‌ని క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు శివ‌కుమార్ (DK Shiva Kumar) చెప్పారు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, పార్టీ కార్య‌ద‌ర్శులు, కీల‌క నేత‌లు అంద‌రూ పార్టీ విజ‌యానికి కీల‌కంగా ప‌నిచేశార‌ని అన్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం బెంగ‌ళూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింద‌ని అన్నారు.

కాంగ్రెస్ నేత‌ల‌ను జైళ్ల‌లో పెట్టేందుకు కూడా బీజేపీ కుట్ర‌లు చేసింద‌ని విమర్శించారు. కర్ణాట‌క ప్ర‌జ‌లు బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకించార‌ని చెప్పారు. రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కూడా ఫ‌లితాల‌పై ప్రభావం చూపింద‌ని అన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు చాలా కీల‌క‌మైన‌వి తెలిపారు.

మ‌ద్ద‌తుదారులు అంద‌రూ మీరే ముఖ్యమంత్రి కావాల‌ని కోరుతున్నార‌ని మీడియా ప్ర‌శ్నించగా.. నాకు మ‌ద్ద‌తుదారులు ఎవ‌రూ లేర‌ని, మొత్తం కాంగ్రెస్ పార్టీ నాకు మ‌ద్ద‌తుగా ఉన్న‌ద‌ని చెప్పారు. ఈ విజ‌యం త‌ల్లి సోనియాగాంధీకి అంకిత‌మ‌ని తెలిపారు.

ఈ విజ‌యంలో ముఖ్య భాగస్వాములైన ప్రియాంకాగాంధీ, రాహుగాంధీకి క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు హార్థిక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నార‌ని చెప్పారు. విజ‌యంలో పాలుపంచుకున్న‌ సిద్ద‌రామ‌య్య‌కు డీకే శివ‌కుమార్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

ఇది ప్రజావిజయం: మల్లికార్జున ఖర్గే

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజావిజయం అని ఆయన అన్నారు.

విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు: సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు చాలా ఖర్చు చేశారని, 2018 ఎన్నికల్లోనూ ‘ఆపరేషన్‌ కమల’ జరిగిందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లోనూ డబ్బులు ఇచ్చి నేతలను కొనుగోలు చేశారు. ఏ పార్టీ దేశాన్ని రక్షిస్తుందో ప్రజలకు తెలుసు. విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదు. కాంగ్రెస్‌ పార్టీకి చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. రాహుల్‌ పాదయాత్ర కాంగ్రెస్‌కు ఉపకరించింది అన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular