Southwest Monsoon
- జూన్ 4న కేరళ తీరాన్ని తాకొచ్చన్న ఐఎండీ
విధాత : భారతదేశానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి కొంతం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. ప్రతి ఏటా జూన్ 1వ తేదీకి అటూఇటూగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. గరిష్ఠంగా ఏడో తేదీకల్లా ప్రవేశిస్తుంటాయి. అప్పటి నుంచి వర్షాకాల ఆరంభంగా పేర్కొంటుంటారు.
ప్రధానంగా వ్యవసాయిక దేశమైన భారత్‌లో నైరుతి తెచ్చే వర్షాలే కీలకం. అయితే.. ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని గత నెలలో వాతావరణ విభాగం అంచనా వేసిన సంగతి తెలిసిందే.
‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో స్వల్ప జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉన్నది. రుతువనం కేరళ తీరాన్ని జూన్ 4న తాకే అవకాశం ఉన్నది’ అని వాతావరణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది మే 29 నాటికే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. 2021లో జూన్ 3న రాగా, 2020లో జూన్ ఒకటినే తాకాయి.
తెలంగాణకు..
మరోవైపు ‘తెలంగాణ వెదర్‌మాన్’ మాత్రం కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు జూన్ 8న.. మూడు రోజులు అటూ ఇటూగా తాకే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రకారం తెలంగాణ, ఉత్తర ఏపీకి జూన్ 15 నాటికి (మూడు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నదని తెలిపింది. ఎన్ నినో పరిస్థితుల ప్రభావంతోనే రుతుపవనాలు జాప్యం అవుతున్నట్టు పేర్కొన్నది.