విధాత, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓల్డ్ అల్వాల్ రోడ్డులో ఈ నెల 3 నుంచి 31 వరకు ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్నారు. రెడ్డి ఎన్క్లేవ్ జ్యోతినగర్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.
రాజీవ్ రహదారి నుంచి సుచిత్ర వైపు వచ్చే వాహనాలను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ బేకరీ, అంబేద్కర్ విగ్రహం, అల్వాల్ ఐజీ స్టాచ్యూ వైపు మళ్లించనున్నారు.
సుచిత్ర, అల్వాల్ ఐటీ స్టాచ్యూ నుంచి రాజీవ్ రహదారి వైపు వెళ్లే వాహనాలను అల్వాల్ ఐటీ స్టాచ్యూ వద్ద మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం, శ్రీ బేకరి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని, మీ సేవా గోల్నాక మీదుగా రాజీవ్ రహదారి వైపునకు వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.