సిగ్నల్ వ్యవస్థ సమర్థతపై మరోసారి దుమారం విధాత: ఒరిస్సా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద (Train Accident) ఘటనలో 292 మంది వరకు మరణించడం మరో 900 మందికి పైగా తీవ్ర గాయాలకు గురైన ఘటన రైలు ప్రమాదాల్లో పెను విషాద ఘటనల్లో ఒకటిగా నిలిచింది. దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒరిస్సా రైలు ప్రమాద ఘటన మొదటి మూడు స్థానాల్లో ఉంది. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో 2005 […]

  • సిగ్నల్ వ్యవస్థ సమర్థతపై మరోసారి దుమారం

విధాత: ఒరిస్సా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద (Train Accident) ఘటనలో 292 మంది వరకు మరణించడం మరో 900 మందికి పైగా తీవ్ర గాయాలకు గురైన ఘటన రైలు ప్రమాదాల్లో పెను విషాద ఘటనల్లో ఒకటిగా నిలిచింది. దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒరిస్సా రైలు ప్రమాద ఘటన మొదటి మూడు స్థానాల్లో ఉంది.

గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో 2005 ఆక్టోబర్ 28న గోల్నేపల్లి చెరువు కట్ట తెగి బీబీనగర్-నడికుడి రైల్వే ట్రాక్ కొట్టుకపోవడంతో ఆ మార్గంలో సికింద్రాబాద్ వెళుతున్న డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైలు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వచ్చి వరద నీటిలో పడిపోయింది. వరద ఉధృతికి ప్రయాణికుల బోగిలు కొట్టుకుపోయి ఒకదానిపై మరొకటి పడిపోయాయి.

ఈ ప్రమాదంలో 114 మంది మృతిచెందగా, మరో 100 మంది వరకు గాయపడ్డారు. ఒరిస్సా రైలు ప్రమాద ఘటన సందర్భంగా డెల్టా రైలు ప్రమాద ఘటనను మరోసారి జిల్లా వాసులు యాదిలోకి తెచ్చుకుంటూ ఒరిస్సా రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు, తమ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నారు.

అధిక శాతం రైలు ప్రమాదాల వెనుక సిగ్నల్ వ్యవస్థ వైఫల్యమే కనిపిస్తుండడంతో మరోసారి సిగ్నల్ వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానంపై సందేహాలు రేగుతున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు కవచ్ సిగ్నలింగ్ టెక్నాలజీ రైల్వే శాఖ ప్రవేశపెట్టినప్పటికీ అది ఒరిస్సా బాలాసోర్ రైలు ప్రమాద మార్గంలో అమలులో లేకపోవడం విచారకరం.

దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో 1981లో బీహార్ లోని సహస్ర వద్ద జరిగిన రైలు ప్రమాదంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోవడంతో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1995లో ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాద్ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తం ఎక్స్ ప్రెస్ కాలింద్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టడంతో 358మంది మరణించారు.

1999లో అస్సాంలోని నిగైసోల్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 290మంది చనిపోయారు. 1998లో కొలకత్తా వెళ్తున్న జమ్ముతావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గోల్డెన్ టెంపుల్ ఎక్సప్రెస్ రైలు బోగిలను ఢీకొట్టడంతో 212మంది చనిపోయారు. 2002లో హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 140 మంది చనిపోయారు.

2010లో హౌరా నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్ రైలు ను ఢీకొట్టిన ఘటనలో 170 మంది చనిపోయారు. 2016లో ఇండోర్ నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదంలో 150 మంది వరకు చనిపోయారు.

ఒరిస్సా బాలాసోర్ నేపథ్యంలో రైలు ప్రమాద నేపథ్యంలో సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రద్దు, మరిన్ని దారి మళ్లింపు చేసింది. రద్దయిన రైళ్లలో తిరుపతి - హౌర, బెంగుళూరు - కామాక్య, బెంగుళూరు - హౌర, బెంగుళూరు - బాగల్ పూర్ రైలులు, దారి మళ్లింపు చేసిన వాటిలో పాట్న - ఎర్నకులం, చెన్నై సెంట్రల్ - శాలిమర్, త్రివేంద్రం సెంట్రల్ - శాలిమర్, హైదరాబాద్ - శాలిమర్, సాయి ప్రశాంతి నిలయం - హౌరా, కన్యాకుమారి - దిబర్ ఘర్, బెంగుళూర్ - హౌరా, బెంగుళూరు - అగర్తల, చెన్నై సెంట్రల్ - హోరా, వాస్కోడిగామ - శాలిమర్, శాలిఘాట్ టౌన్ - టంబరం, అగర్తల - సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.

Updated On 3 Jun 2023 10:21 AM GMT
Somu

Somu

Next Story