TS Vs AP | సాగర్, శ్రీశైలం నీటీ కేటాయింపులపై తెలంగాణ అభ్యంతరాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ఎస్‌ఆర్‌ఎంసీ పనులపై ఫిర్యాదు తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల జగడం మళ్లీ మొదలైంది. రెండు రాష్ట్రాలలో రాజకీయ ఉద్యమాలకు, ఎన్నికల ప్రయోజనాల నేపధ్యంలో తరుచు నీళ్ల పంచాయతీ రాజేయడం పార్టీలకు రాజకీయ వ్యూహంగా మారింది. ఇప్పటికే పరిష్కరించుకోవాల్సిన రాష్ట్రాల నీటి కేటాయింపులపై తాత్సర్యం వహించి ఎన్నికల వేళ […]

TS Vs AP |
- సాగర్, శ్రీశైలం నీటీ కేటాయింపులపై తెలంగాణ అభ్యంతరాలు
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ఎస్‌ఆర్‌ఎంసీ పనులపై ఫిర్యాదు
- తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు
విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల జగడం మళ్లీ మొదలైంది. రెండు రాష్ట్రాలలో రాజకీయ ఉద్యమాలకు, ఎన్నికల ప్రయోజనాల నేపధ్యంలో తరుచు నీళ్ల పంచాయతీ రాజేయడం పార్టీలకు రాజకీయ వ్యూహంగా మారింది. ఇప్పటికే పరిష్కరించుకోవాల్సిన రాష్ట్రాల నీటి కేటాయింపులపై తాత్సర్యం వహించి ఎన్నికల వేళ నీళ్ల పంచాయతీకి దిగి సెంటిమెంట్ ను రాజేయడం ఏపీ, తెలంగాణ పార్టీలకు రివాజుగా మారిందంటున్నారు. అసలే కృష్ణా పరివాహకంలో ఈ దఫా సెప్టెంబర్ నెల వచ్చినా వర్షాలు, వరదలు కరువైన నేపధ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుతం మిగిలివున్న నీటి నిల్వల కోసం రెండు రాష్ట్రాలు జగడానికి దిగుతున్నాయి.
మరోవైపు శ్రీశైలం జలాశయం పరిధిలో ఏపీ అక్రమ చేపట్టిన సంగమేశ్వర ఎత్తిపోతల, రోజుకు 7టీఎంసీలు తరలించేలా పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులైటరీ విస్తరణ, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులను సడిసప్పుడు లేకుండా చేస్తుండటంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. సదరు అక్రమ పనులపై ఇంతకాలం మౌనంగా ఉన్న తెలంగాణ ఇప్పుడే మేల్కోన్నట్లుగా అక్రమ పనులు ఆపాలంటూ శనివారం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ల పంచాయతీని రగిలించినట్లయ్యింది.
సాగర్, శ్రీశైలం నిల్వల కేటాయింపులపై రగడ
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి నిల్వల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల కోసం గత ఆగస్టు 21న జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ భేటీలో బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డిఎం.రాయిపూరే, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు మాత్రమే హారజయ్యారు. ఈ భేటీ వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఈఎన్‌సీ పి.మురళీధర్‌రావు సమావేశానికి గైర్హాజరయ్యారు.
త్రిసభ్య కమిటీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం ఏపీకి 25.29టీఎంసీలు, తెలంగాణకు 8.04టీఎంసీలను విడుదల చేయాలని ముసాయిదా మినిట్స్‌ను రూపొందించింది. తెలంగాణ ఈఎన్‌సీ గైర్హాజరైనప్పటికి గతంలో ఆయన రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరుతూ రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని నీటీ కేటాయింపులపై ముసాయిదా మినిట్స్ రూపొందించింది.
రెండు రాష్ట్రాలను ఈ మినిట్స్‌ను ఆమోదించాలని బోర్డు కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ఈఎన్‌సీ పి.మురళీధర్‌రావు త్రిసభ్య కమిటీ డీఎం రాయిపూరేను కలిసి తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ఏకపక్షంగా గత సమావేశంలో తీసుకున్న నీటి కేటాయింపుల మినిట్స్ తమకు ఆమోదం కాదంటూ తేల్చి చెప్పారు.
తాము గత నెలలో నిర్వహించిన సమావేశానికి హాజరుకానందునా మళ్లీ త్రిసభ్య కమిటీ నిర్వహించాలని కోరారు. గత సమావేశాన్ని వాయిదావేయాలని కోరినా పట్టించుకోలేదని, తాజాగా మళ్లీ త్రిసభ్య కమిటీ భేటి నిర్వహించి నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వివాదంలో తెలంగాణ అభిప్రాయలను పరిగణలోకి తీసుకోకుండా నీటి కేటాయింపులు చేయడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని, త్రిసభ్య కమిటీ నిర్ణయంలో మార్పు లేకపోతే ఆయన బహిరంగంగానే స్పందించనున్నారని తెలుస్తుంది.
1500క్యూసెక్కుల నుంచి 7టీఎంసీలకుపెరిగిన ఏపీ జలదోపిడి
శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ నీటి తరలింపు వ్యవహారం కూడా తరుచు వివాదస్పదమవుతునే వుంది. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పలుమార్లు వెడల్పు చేసుకుంటూ అక్రమంగా నీటి తరలింపు చేస్తుండటం రెండు రాష్ట్రాల మధ్ జల జగడాలకు కారణమవుతుంది.
1977 అంతరాష్ట్ర ఒప్పందం మేరకు చెన్నైకి తాగునీటిని కలుపుకుని రోజుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుండి 1500క్యూసెక్కులు తరలించాలి. ఆ ఒప్పందానికి గండి కొడుతు 11,500 క్యూసెక్కులను తరలించేలా ఏపీ అక్రమంగా హెడ్ రెగ్యులేటర్ నిర్మించింది. అనంతరం 40వేల క్యూసెక్కులకు పెంచింది. ఇప్పుడు 80వేల క్యూసెక్కులు తరలించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు గేట్లను ఏర్పాటు చేస్తుంది.
దీని నుంచి నీటి తరలింపు కోసం ఎస్‌ఆర్‌ఎంసీ కాలువకు అక్రమంగా లైనింగ్ చేపట్టి ప్రస్తుతం కొనసాగుతున్న 40వేల క్యూసెక్కుల స్థానంలో 80వేల క్యూసెక్కుల నీటిని తరలించే పనులను బోర్డు కళ్లు గప్పి చేస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రోజుకు గ్రావిటీ ద్వారా 7టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం ఏపీ చేస్తుంది. ఈ చర్య ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలోని కృష్ణా బేసీన్‌లోని కరవు ప్రాంతాల ప్రయోజనాలకు గండికొట్టడమేనంటూ తెలంగాణ వాదిస్తుంది.
ఈ మేరకు అక్రమ లైనింగ్ పనులు, గేట్ల బిగింపు పనులు ఆపాలంటూ తెలంగాణ ఈఏఎసీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. నిజానికి పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ వ్యవహారం ఇప్పటికిప్పుడు చేపట్టింది కాదు. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం మేల్కోన్నట్లుగా దీనిపై తాజాగా తెలంగాణ ఫిర్యాదు చేయడం ఎన్నికల వేళ నీళ్ల సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ సాగుతాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనుగడకు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు ఎంతో కీలకం. అంతటి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పై కృష్ణా బోర్డును తప్పుదోవ పట్టిస్తూ ఏపీ ప్రభుత్వం క్రమంగా తన నియంత్రణ పెంచుకుంటుపోతుంది. పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా అక్రమ నీళ్లను తరలించుకువెళ్లేలా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌కు అక్రమ లైనింగ్ చేస్తుంది.
గతంలో దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన స్టేను సైతం పట్టించుకోకుండా ఏపి ప్రభుత్వం లైనింగ్ చేసే పనులు కొనసాగిస్తుంది. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఇక ఏపీ కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులపై తన అభ్యంతరాలను వ్యక్తం చేయనుండగా ఎన్నికల వేళ మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలజగడం తప్పదంటున్నారు నిపుణులు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తు సాగర్‌కు నీటి తరలింపు చేస్తుందని, డిండి ఎత్తిపోతలను అక్రమంగా చేపట్టారని తద్వారా రాయలసీమ సాగుతాగునీటి ప్రాజెక్టులకు నీళ్లందని పరిస్థితి ఏర్పడుతుందంటూ ఎన్‌జీటీలో ఫిర్యాదు చేయడం గమనార్హం.
