- రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం
- నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లుతున్న కమిషన్ కార్యాలయ పరిసరాలు
- ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్
విధాత: ప్రశ్నపత్రాల లీకేజీ (Lekage) వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం, నిన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నిరుద్యోగ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం వంటి ఘటనలు అనేక ఉద్రిక్తతలకు దారి తీస్తున్నది. నాంపల్లిలోని సర్వీస్ కమిషన్ (Service Commission Office)కార్యాలయం పరిసర ప్రాంతాలన్నీరోజూ నిరసనలు, ధర్నా (Protests, dharna) లతో హోరెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కీలక భేటీలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో పాటు టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్ (Chairman) జనార్దన్‌రెడ్డి (Janardan reddy) , మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి (Chakrapani) కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి భేటీ అనంతరం మరో నాలుగు పరీక్షలను కమిషన్ ఇప్పటికే రద్దు చేసింది.
సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రభుత్వానికి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. సర్వీస్ కమిషన్ ఏటా తన నివేదికను గవర్నర్‌కే సమర్పిస్తుంది. కాబట్టి అంతటి స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో ఇద్దరు వ్యక్తుల వల్ల మొత్తం ఇప్పుడు ఆ నియామక సంస్థ విశ్వసనీయతపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. అంతేకాదు నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
అందుకే సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని విపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కానీ ఇప్పుడు ఏళ్ల తరబడి ప్రిపేర్ అయి పరీక్ష రాసిన ఉద్యోగం వస్తుందని ఆశించిన నిరుద్యోగుల ఆశలపై పేపర్ లీకేజీ ఘటన నీళ్లు చల్లింది. అందుకే నిరుద్యోగులకు మనోధైర్యాన్ని కలిగించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావించింది. మంత్రి కేటీఆర్ (KTR) కూడా బీఆర్‌కే భవన్ మీడియాలో ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారని, దీని వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని కేటీఆర్ చెప్పారు.
కమిషన్‌లో మార్పులు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో తీసుకుంటారని సమాచారం. అలాగే ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న సర్వీస్ కమిషన్‌కు దగ్గరలో రాష్ట్ర బీజేపీ ఆఫీస్, అటు గాంధీభవన్, పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్ వంటివి ఉన్నాయి. దీంతో కమిషన్ కార్యాలయాన్ని కూడా అక్కడి నుంచి మార్చే అవకాశం లేకపోలేదు. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. తాజాగా ఈ లీకేజీ ఘటన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు.