విధాత: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. నిందితులు ప్రవీణ్, రేణుకల ఫోన్‌లను ఎఫ్‌ఎస్‌ఎల్(FSL)కు పంపారు. నిందితులు ప్రస్తుతం బేగంబజార్ పీఎస్(PS)లో ఉన్నారు. నిందుతులైన 9 మందికి ఉస్మానియా(OSMANIA) హాస్పిటల్(HOSPITAL)లో వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం వారిని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరు పరిచారు.
విచారణ అనంతరం వీరందరికి రిమాండ్(Remand) విధించే అవకాశం ఉన్నది. రిమాండ్ సమయంలో పోలీసులు కస్టడీ(Custody)కి కోరే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నదని పోలీసులు ఇప్పటికే చెప్పారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని వారు భావిస్తున్నారు.
అలాగే ఈ కేసులో వీళ్లే ఉన్నారా? ఇంకా ఎవరి ప్రమేయం ఉన్నదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడానికి వీరిని కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ కిరణ్ వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్రవీణ్‌కుమార్, అతనికి సహకరించిన రాజశేఖర్, ఈ కేసులో ఎవరి కోసమైతే పేపర్ లీక్ చేశారో గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రేణుక, ఆమె భర్త ధాక్య, వాళ్ల బంధువైన రాజేశ్వర్ నాయక్‌లతో పాటు పరీక్ష రాసిన ఇద్దరిని, వీళ్ల నంబర్‌లు ఇచ్చిన వ్యక్తితో కలిపి మొత్తం 9 మందిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
ఒక రిమాండ్ రిపోర్టును తయారు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం వీరిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరింత సమాచారాన్నిరాబట్టనున్నారు.
లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. ఏఈ పేపర్ తప్పా ఈ నెల 15న జరగాల్సిన పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి (Town Planning Building Overseer) పరీక్ష పత్రాలు కూడా ప్రవీణ్ చేతిలోకి వచ్చినప్పటికీ ఇతరులకు విక్రయించినట్టు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకై ఉండొచ్చని నిరుద్యోగులలతో పాటు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అనుకుంటున్నారు.