- టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ధర్నా
విధాత: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో విస్తుపోయే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రవీణ్ 2017 TSPSCలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగు సంవత్సరాల పాటు వెరిఫికేషన్ విభాగంలో పనిచేశాడు.
ఈక్రమంలో వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునే వాడు. దరఖాస్తులో టెక్నికల్ సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఎక్కువగా మహిళల నంబర్లే
ప్రవీణ్ మొబైల్‌లో ఎక్కువగా మహిళల నంబర్లే ఉన్నాయని, వాట్సప్ చాటింగ్‌లలోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆయనను స్త్రీ లోలుడిగా గుర్తించారు. వెరిఫికేషన్ సెక్షన్‌లో ఏమైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే దానికి సంబంధించిన సమస్య తీర్చి వారితో క్రమంగా మాట్లాడి ఈ విధంగా శారీరక సంబంధం పెట్టుకుని వారికి పనులు చేసిపెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఏడాది కిందటే పదోన్నతి లభించిన తర్వాత ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే రేణుక తన సోదరుడు చిట్‌ఫండ్ నిర్వహించి ఆర్థికంగా నష్ట పోయాడని, తనకు ఆసరాగా ఉంటాడని పేపర్ లీక్ చేయాలని ప్రవీణ్‌ను కోరింది.
రేణుక కారణంగానే ఈ నెల ఐదున జరిగి ఏఈ పరీక్ష పత్రం లీకైందని పోలీసులు తేల్చారు. ప్రవీణ్ ఆ పేపర్‌ను తెచ్చి రాజేశ్వర్‌నాయక్ ఇవ్వగా ఆయన ఇతరులకు విక్రయించాడు. ఈ పేపర్ లీకేజీ ద్వారా వచ్చే డబ్బుతో ఆర్థికంగా ఎదగవచ్చని రేణుక, ఆమె భర్త, సోదరుడు కూడా భావించాడు. ఏఈకి సంబంధించిన ప్రశ్నాపత్రం మాత్రమే లీకైనట్టు పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు.
పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి (Town Planning Building Overseer) పరీక్ష పత్రాలు కూడా ప్రవీణ్ చేతిలోకి వచ్చినప్పటికీ ఇతరులకు విక్రయించినట్టు ఆధారాలు లేవని పోలీసులు గుర్తించారు. పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈ నెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీ అయ్యిందని అయితే ఈ పేపర్లు ఎవరికీ విక్రయించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మరోవైపు ఈ పేపర్ల లీకేజీల వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్నది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్‌ఎస్‌యూఐ నిన్నసర్వీస్ కమిషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే. నిందితులు ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారం ఉన్న మరో నలుగురు అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు.
ప్రవీణ్‌కు.. 103 మార్కులు
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన నిందితులు ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రాశాడు. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ లీక్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను సర్వీస్ కమిషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. 150 మార్కులకు 103 మార్కులు వచ్చే ప్రతిభ ప్రవీణ్‌కు ఉన్నదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ వచ్చిన సర్వర్‌ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందా లేదా అని నిపుణులు పరిశీలిస్తున్నారు.
సర్వీస్ కమిషన్‌ను ముట్టించిన బీజేపీ యువమోర్చా కార్యకర్తలు
పేపర్ల లీకేజీల వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్నది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్‌ఎస్‌యూఐ నిన్నసర్వీస్ కమిషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రశ్నా పత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. సర్వస్ కమిషన్ బోర్డును యువ మోర్చా కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ప్రశ్నాపత్రం లీక్‌తో సంబంధం ఉన్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీఎస్‌పీఎస్ ఛైర్మన్ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. యువమోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసులు వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. వరుస అందోళనల నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ వద్ద అదనపు బలగాలను మోహరించారు. దీంతో టీఎస్‌ఎస్‌పీఎసీ పరిసర ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు సర్వీస్ కమిషన్ భేటీ
మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ సమావేశం కానున్నది. ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రశ్నపత్రాల లీకేజీ ఇతర అంశాలపై కమిసన్ చర్చించనున్నది.
గ్రూప్-1 పేపర్ లీకేజీ ఎలాంటి ఫిర్యాదు రాలేదు : విక్రమ్‌సింగ్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై అదనపు సీపీ విక్రమ్‌సింగ్ వివరణ ఇచ్చారు. ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతున్నది. ఈ కేసులో ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్టు చేశాం. గ్రూప్-1 పేపర్ లీకేజీ విషయం మా దృష్టి రాలేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ముట్టించింది. కమిషన్ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.