Wednesday, March 29, 2023
More
    HomelatestTSPSC | అక్టోబర్‌ నుంచే ప్రవీణ్‌, రాజశేఖర్‌ల దందా! సిట్‌ ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు

    TSPSC | అక్టోబర్‌ నుంచే ప్రవీణ్‌, రాజశేఖర్‌ల దందా! సిట్‌ ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు

    • రద్దైన నాలుగు ప్రశ్నపత్రాలు ఇంకా ఎవరైనా పొందారా?
    • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిని వారిని విచారిస్తున్నట్టు సమాచారం

    విధాత‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ (SIT) విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకేజీ వ్యవహారం మొన్న ఏఈ పరీక్షతోనే మొదలు కాలేదని సిస్టమ్‌ ఎనలిస్ట్‌ రాజశేఖర్‌రెడ్డి (Rajasekhar Reddy), సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రవీణ్ (Praveen)ల ద్వయం గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఈ దందా మొదలుపెట్టినట్టు సమాచారం.

    దీని కోసం మొత్తం కంప్యూటర్‌ వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకుని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్‌ సిస్టమ్‌లో యాక్సెస్‌ అయినట్టు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం.

    ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్‌ ఎలాంటి సమాచారమైనా దొంగిలించి ప్రవీణ్‌కు అందించేవాడు. టౌన్‌ప్లానింగ్‌ (TPBO) ప్రశ్నపత్రం లీక్‌ అయినట్టు ఫిర్యాదు రావడంతో రేణుక కోసమే తాను ప్రశ్నపత్రం చోరీ చేసినట్టు ప్రవీణ్‌ చెప్పినా.. అదంతా అబద్ధమని సిట్‌ విచారణలో తేలింది.

    ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తు ఆధారంగా సిద్ధం చేసిన నివేదికలో అనేక సంచలన విషయాలు బైటపడుతున్నాయి. రాజశేఖర్‌, ప్రవీణ్‌ కమిషన్‌ కార్యాలయంలో సాగించిన దందాను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారట.

    రాజశేఖర్‌పై అనేక అనుమానాలు

    ఈ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులు ప్రవీణ్‌తో పాటు మరో నిందితుడు రాజశేఖర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్‌ సమీప బంధువులిద్దరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.

    అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు గ్రూప్స్‌ రాసిన తీరుపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు వీరిద్దరు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినట్టు సమాచారం.దీంతో వారి పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.

    రాజశేఖర్‌ 2012లో ఉపాధి కోసం అఫ్గానిస్థాన్‌కు వెళ్లి 2016లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌పై పట్టున్న అతను కొన్నేండ్లుగా హైదరాబాద్‌లోని పలు కంప్యూటర్‌ విభాగాల్లో అడ్మిన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించినట్టు తెలుస్తోంది.

    కరీంనగర్‌కు చెందిన దగ్గరి బంధువుల ద్వారా సర్వీస్‌ కమిషన్‌లో చేరినట్టు సమాచారం. టీఎస్‌పీఎస్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాతే ఊళ్లో కొత్త ఇళ్లు కట్టుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఊరికి వచ్చినప్పుడు కొంతమంది సన్నిహితులతోనే ఉండేవాడని, జీతం రూ. లక్షల్లో వస్తుందని అనుకునేవారమని గ్రామస్థులు చెబుతున్నారు.

    ఇంకా ఎంతమంది ఉన్నారు?

    సర్వీస్‌ కమిషన్‌ అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు గ్రూప్‌-1, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, సీడీపీవో, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1, ఏఈఈ, డీఏవో, ఏఈ .. ఇలా మొత్తం ఏడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. అయితే అక్టోబర్‌ నుంచే ప్రవీణ్‌, రాజశేఖర్‌ దందా నడుస్తున్నదని ఆధారాల నేపథ్యంలో మిగతా ప్రశ్నపత్రాలూ బైటికి తెచ్చి ఉంటానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని నిర్ధారించడానికి సిట్‌ అధికారులు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారందరినీ పిలిచి విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

    దీంతోపాటు ప్రవీణ్, రాజశేఖర్‌ల ఫోన్‌ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. కమిషన్‌ ఇప్పటికే నాలుగు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ పేపర్లన్నీ లీకైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిదిమంది నిందితులుగా చేర్చిన సిట్‌ ఈ నాలుగు పరీక్షల ప్రశ్న పత్రాలు ఇంకా ఎవరైనా పొందినట్టు సిట్‌ దర్యాప్తులో తేలితే వారందరనీ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular