విధాత: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితులయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి గల ఆయనకున్న ప్రత్యేక అర్హతలు ఏమీ లేవని, ఆయన కేవలం జగన్ కోసం రెండు సినిమాలు నిర్మిస్తుండడమే అర్హత అని అంటున్నారు.
త్వరలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం, శపథం సినిమాలను దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నట్టు టాక్. వైఎస్ జగన్ బయోపిక్‌ను వ్యూహం సినిమాగా తీస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై రెండు సినిమాలను నిర్మిస్తున్న దాసరి కిరణ్‌కు జగన్ టీటీడీ సభ్యత్వం ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి తెనాలి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా దాసరి కిరణ్ కుమార్ అప్పట్లో హవా చేలాయించేవారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఆయన పెద్ద ఎత్తున యూత్ ను చిరు అభిమాన సంఘంలో చేర్చి, బలోపేతం చేశారు. ఆ క్రమంలోనే 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ దాసరి కిరణ్ ను గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు.
తరువాత కొద్దిరోజులకే వైఎస్సార్ గతించడంతో కిరణ్ పదవి అంతలోనే ముగిసింది. మళ్లీ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైన దాసరి కిరణ్ కుమార్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు మళ్లీ రెండు కొత్త చిత్రాలు నిర్మిస్తున్నారు. తాను పదవీ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారీగా ప్రచారం, పత్రికల్లో యాడ్స్ కూడా ఇచ్చారు