విధాత: ట్విట్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎలాన్ మస్క్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ ఉచితం కాదని లీక్ చేసిన మస్క్.. ఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ టిక్ ఛార్జీల అమలుకు సంబంధించి.. ఐవోఎస్ యూజర్లకు మేసేజ్‌లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
మరి భారత్‌లో ఈ సబ్‌స్క్రిప్షన్‌కు నెలకు ఎంతంటే.. రూ. 719 అట. ఆ మేసేజ్‌లను ఐవోఎస్ యూజర్లు షేర్ చేస్తున్నారు. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే నెలవారీగా రూ. 719 చెల్లించాల్సిందే. ఒక వేళ ఆ ఫీచర్‌ను వద్దనుకుంటే.. ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. భవిష్యత్‌లో మిగతా ఫోన్ల యూజర్లకూ కూడా బ్లూ టిక్ ఛార్జీలను వర్తింప చేయనున్నారు.
ఈ బ్లూ టిక్ ఖాతాదారులకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఎలాన్ మస్క్ ఇంతకుముందే ప్రకటించారు. ఇటువంటి వెరిఫికేషన్ లేకపోతే నకిలీ ఖాతాలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని ఎలన్‌మస్క్ భావిస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రముఖ వ్యక్తులను గుర్తించడానికి `అధికారిక` ట్యాగ్ తీసుకొచ్చింది.
కానీ దీనిపై గందరగోళం తలెత్తడంతో ట్విట్టర్ వెనక్కు తగ్గింది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే సంస్థ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ్ గద్దె తదితరులను ఇంటికి సాగనంపారు. భారత్‌లోనూ 200 మందికి పైగా ట్విట్టర్ ఉద్యోగులు ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే.