HomelatestUgram Review | అల్లరోడు ఓకే కానీ.. అసలోడే గాడి తప్పాడు

Ugram Review | అల్లరోడు ఓకే కానీ.. అసలోడే గాడి తప్పాడు

Ugram Review

చిత్రం పేరు: ‘ఉగ్రం’
విడుదల తేదీ: 05 మే, 2023
నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితాస్వ, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ J
మాటలు: అబ్బూరి రవి
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల

అల్లరి నరేష్ అనగానే అందరూ కామెడీ హీరో అనే అనుకుంటారు. కానీ అతడిలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడిదే కాంబినేషన్‌లో మరో వైవిధ్యభరిత చిత్రం వస్తుందనే సంకేతాలను ‘ఉగ్రం’ సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ కలిగిస్తూ వస్తున్నారు.

కామెడీ పాత్రలే కాదు.. సీరియస్ పాత్రలను కూడా చేయగలనని ‘నాంది’, ‘మహర్షి’ చిత్రాలతో నిరూపించిన అల్లరి నరేష్.. మరోసారి అటువంటి ప్రయత్నంతోనే వస్తున్నట్లుగా చిత్ర టీజర్, ట్రైలర్, పోస్టర్స్ కూడా చెప్పేశాయి. ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్‌గా కామెడీ చేసిన నరేష్.. ఈ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. అలాగే ట్రైలర్ విడుదలైన తర్వాత ఇందులో ఏదో థ్రిల్లింగ్ అండ్ బర్నింగ్ పాయింట్‌ని టచ్ చేసినట్లుగా కూడా అనిపించింది.

బర్నింగ్ ఇష్యూస్‌పై సినిమాలు తీయడంలో కనకమేడల దిట్ట కాబట్టి.. ఈ సినిమాతో ఏదో విషయాన్ని ఆయన చెప్పబోతున్నాడనే విషయంతో సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాడు. ఇప్పుడా అంచనాలను ఈ సినిమా అందుకుందా? మళ్లీ నరేష్‌కు విజయ్ కనకమేడల హిట్ ఇచ్చాడా? అసలీ సినిమాలో ఉన్న విషయం ఏమిటనేది? మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

తను ప్రేమించిన అమ్మాయి అపర్ణ (మిర్నా మీనన్)ని.. ఆ అమ్మాయి తండ్రిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు సీఐ శివకుమార్ (అల్లరి నరేష్). పెళ్లి అనంతరం ఇద్దరూ హాయిగా జీవిస్తుంటారు. వారి జీవితంలోకి ఐదేళ్ల తర్వాత ఒక పాప కూడా ఎంటరవుతుంది. దీంతో ఇంకా హాయిగా వారి జీవితం సాగి పోతున్న సమయంలో.. ఈ ముగ్గురికి ఓ కారు యాక్సిడెంట్ అవుతుంది.

ఈ ప్రమాదంలో శివ తలకి దెబ్బ తగలడం కారణంగా డిమెన్షియా అనే వ్యాధి అటాక్ అయినట్లుగా డాక్టర్ (ఇంద్రజ) చెబుతుంది. ఎందుకంటే.. తనతో పాటు తన భార్య, పాప కూడా హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లుగా శివ వాదిస్తుంటాడు. కానీ డాక్టర్ కేవలం మీరొక్కరే ఈ హాస్పిటల్‌కి వచ్చారని చెబుతుంది.

పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినా కూడా శివ ఒక్కడే ఆ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లుగా ఉంటుంది. అయితే శివ భార్య, పాప ఏమయ్యారు? అదే సమయంలో నగరంలో వరసగా జరుగుతున్న కిడ్నాప్‌లకు.. శివ భార్య, పాపల మిస్సింగ్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఉంటే ఈ మిస్టరీ కేసును మైండ్ సరిలేని శివ ఎలా ఛేదించాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ ‘ఉగ్రం’ సినిమా చూడాల్సిందే.

Rama Banam Review | సినిమా రివ్యూ ‘రామబాణం’ కాదిది.. రొటీన్ బాణం

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

కామెడీ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. ఈ సినిమాతో పూర్తి స్థాయిలో తనలోని నటనను బయటికి తీశాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో నరేష్ చాలా కొత్తగా కనిపించాడు. అలాగే పోలీస్ పాత్ర కూడా అతనికి కొత్తేం కాదు. కానీ ఒక మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో.. మైండ్ సరిలేని వ్యక్తిగా నరేష్ కనబరిచిన అభినయం అందరినీ అలరిస్తుంది.

ఇక క్లైమాక్స్‌లో అయితే.. ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తంగా అల్లరి నరేష్‌కు ‘నాంది’ తర్వాత మరో మంచి పాత్ర అని చెప్పుకోవాలి. ఇకపై అల్లరి నరేష్ కామెడీ పాత్రలలో కనిపించక పోవచ్చు. ఇందులో అలా ఫిజిక్ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ విషయానికి వస్తే.. మిర్నా మీనన్ పాత్ర ఉందంటే ఉంది అంతే. ఆమె పాత్రకు అంత పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో మిర్నా పాత్రని అందంగా తీర్చిదిద్దగా.. తన పాత్రకి ఆమె కూడా అంతే న్యాయం చేసింది.

డాక్టర్‌గా ఇంద్రజకు రెండు మూడు సీన్లు లభించాయి. ఇక శత్రుకి ఇందులో మంచి పాత్ర లభించింది. శత్రు కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇంకా మీర్నా తండ్రిగా చేసిన శరత్ లోహితస్వా, అల్లరి నరేష్ కుమార్తెగా నటించిన పాప, ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ హైలెట్. చూస్తున్న ప్రేక్షకులకు రియలిస్టిక్ ఫీల్ కలిగించడంలో కెమెరా వర్క్ 100 శాతం సక్సెస్ అయింది. ఈ సినిమాకు వాడిన లైటింగ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునేలా కొన్ని సీన్లు ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో బలం. పాటలు అంత గొప్పగా ఏం లేవు. ఎడిటింగ్ పరంగా మాత్రం ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా ఫ్లోకి పాటలు పంటికింద రాయిలా తగులుతాయి. అలాగే నరేష్, మిర్నాల ప్రేమకథ కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలపై దృష్టి పెట్టినట్లయితే.. సినిమా మరింత స్పీడ్‌గా నడిచేది. యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుకునేలా పిక్చరైజ్ చేశారు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు విజయ్ కనుక ఈ సినిమాని ఇంకాస్త థ్రిల్లింగ్‌గా నడిపించినట్లయితే.. సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. ఈ సినిమాకు ఇన్విస్టిగేషనే బలం. అందులోనే దర్శకుడు తడబడ్డాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం చూస్తున్న ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి. మొత్తంగా దర్శకుడు 50 శాతమే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

విశ్లేషణ:

కథగా అయితే యాక్షన్‌తో నిండిన మంచి థ్రిల్లింగ్ పాయింట్‌నే దర్శకుడు ఎంచుకున్నాడు. మరీ ముఖ్యంగా మొదటి నుంచి సహజసిద్ధంగా కథని నడిపిన తీరు బాగుంటుంది. మిస్సింగ్ అనే ఎలిమెంట్ ప్రతి నిత్యం ఏదో ఒక పేపర్‌లో వచ్చే పాయింటే కాబట్టి.. ప్రేక్షకులు కూడా తొందరగానే కథలోకి లీనమవుతారు. స్టార్టింగే కారు యాక్సిడెంట్‌తో ప్రారంభించి దర్శకుడు సినిమాపై ఇంట్రస్ట్‌ని కలగజేశాడు. ఆ ఇంట్రస్ట్‌ని ఆసాంతం ఉంచటంలో దర్శకుడు ఫెయిలయ్యాడు.

మరి, నరేష్ నాకు కూడా పాటలు, ప్రేమకథ కావాలని అడిగాడో.. లేదంటే ముందు నుంచి ఈ కథలో వాటిని భాగం చేశాడో తెలియదు కానీ.. ఈ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌కి అవి అడుగడుగునా అడ్డుపడ్డాయని చెప్పుకోవాలి. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌ల వంటివి సెకండాఫ్‌లో కూడా ఓ రెండు మూడు రాసుకోగలిగినట్లయితే.. బాక్సాఫీస్ షేకయ్యేది.

బాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీలు కూడా రీమేక్ కోసం క్యూలు కట్టేవి. అలాగే టీవీలలో సీఐడీ అనే సీరియల్ వస్తుంటుంది.. అందులో కూడా సస్పెన్స్‌ని చివరి వరకు రివీల్ కాకుండా చాలా ఆసక్తికరంగా మలుస్తుంటారు. కానీ ఇందులో అదే మిస్సయింది. ఒకానొక దశలో చూస్తున్న ప్రేక్షకులకి సినిమా పూర్తిగా అర్థమైపోతుంది. ప్రేక్షకులు ఊహించినట్లే సినిమా నడుస్తుంటుంది.

అయితే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్.. ముఖ్యంగా హిజ్రాలతో వచ్చే ఫైట్, క్లైమాక్స్ ఫైట్ చూస్తున్న ప్రేక్షకులకు మంచి కిక్కిస్తాయి. ఇంకా చెప్పాలంటే సినిమాలో కొన్ని సన్నివేశాలు కొత్తదనంగా అనిపించినా.. ‘నాంది’ సినిమాతో పోల్చితే మాత్రం విజయ్ కనకమేడల ఈ సినిమాతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. అలాగే కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, కమర్షియల్ కోసం కావాలని పెట్టినట్లుగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా అయితే.. అల్లరి నరేష్ నటనతో పాటు ఇందులో ఉన్న కొన్ని కొత్తదనం నిండిన సన్నివేశాల కోసం మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

ట్యాగ్‌లైన్: అల్లరోడు ఓకే కానీ.. అసలోడే గాడితప్పాడు
రేటింగ్: 2.5/5

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular