విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor Policy Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సుప్రీంకోర్టు (Supreme Court)లో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వకుండా కేవిట్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పిటిషన్ ప్రకారం.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇదిలా ఉండగా.. మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ సందర్భంగా కవిత ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, కవిత పిటిషన్‌పై కోర్టు ఈ నెల 24వ తేదీన విచారణ చేపట్టనుంది. మరో వైపు ఈ నెల 20న ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆరోగ్య సమస్యలు, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.