విధాత: నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK 1 మొదటి ఎపిసోడ్‌ను మోహన్ బాబుతో ప్రారంభించి మహేష్ బాబుతో ముగించాడు. తాజాగా ప్రస్తుతం ఆయన రెండో సీజన్ చేస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే2లో మొదటి ఎపిసోడ్‌కి ఏకంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తన అల్లుడు కాబోయే సీఎంగా పిలిపించుకుంటున్న నారా లోకేష్‌ను పిలిచి వావ్ అనిపించాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా ఓ ఎపిసోడ్ చేశాడు. మొదటి పార్ట్ ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్ అయింది. రెండో పార్ట్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది.
ఇదే సమయంలో బాలయ్య మరోసారి సంచలనం సృష్టిస్తూ ఇలాంటి టాక్ షోలకు ఎప్పుడు హాజరుగాని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఓ ఎపిసోడ్ చేశాడు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. సంక్రాంతికి స్ట్రీమింగ్ కావచ్చని అంటున్నారు. కాగా ఆహాలో వస్తున్న ఈ షోని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్‌కు బాలకృష్ణ చిరంజీవిని కూడా పిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
బాలయ్యతో సమకాలీనుడు సరిసమానమైన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎందుకు ఈ షోకి రావడం లేదని అభిమానులలో ఒక సందేహం ఉండేది. ఆ సందేహాలకు బాలయ్య త్వరలోనే చెక్ పెట్టబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి షోలో పాల్గొనడానికి గ్రీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఎపిసోడ్ మొత్తం ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలపైనే ఉండ బోతుందని సమాచారం.
ఈ రెండు చిత్రాలు పక్కపక్క రోజునే అంటే జనవరి 12,13వ తారీఖుల్లో విడుదల కాబోతున్నాయి. రెండు చిత్రాలకు నిర్మాతలు ఒకరే. ఈ సందర్భంగా ఇలా చేస్తే రెండు సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో బాగా కలిసి వస్తుందని మైత్రి వారి ఆలోచన కూడా. ఈ ఐడియా మెగాస్టార్ చిరంజీవికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా బయటకు రాబోతున్నట్టు సమాచారం.
ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను సంక్రాంతి ముందుగా గానీ.. లేదంటే ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ చేసి వీరయ్య, వీర సింహారెడ్డిల విడుదలకు అటు ఇటుగా చిరు ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి చిరు, బాలయ్యలు విడివిడిగా వెండి తెరపై కనిపించడమే కాదు ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే2 షోలో కనిపించ బోతుండడం ఇరువురి అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తోంది. మరి దీనిపై అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి..!