Murder | Kebab
ఓ ఇద్దరు వ్యక్తులు పీకల దాకా మద్యం సేవించారు. కబాబ్ తిందామని ఓ హోటల్‌కు వెళ్లారు. కబాబ్ తిన్నాక.. తమకు రుచి నచ్చలేదని వంట మనిషిపై కాల్పులు జరిపి చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీలోని ప్రేమ్‌నగర్‌లో ఉన్న ఓ కబాబ్ హోటల్‌కు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. తమకు వేడి వేడి కబాబ్ కావాలని సర్వర్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఇక వారు కోరినట్లే టేబుల్ మీద కబాబ్ వాలిపోయింది. ఆ ఇద్దరు హాయిగా ఆరగించారు. ఇక డబ్బులు చెల్లించే సమయానికి కబాబ్ రుచి తమకు నచ్చలేదని, డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని హోటల్ యజమాని అంకుర్ సబర్వాల్‌తో వాగ్వాదానికి దిగారు.
మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు డబ్బులు చెల్లించకుండానే కారు వద్దకు వెళ్లారు. దీంతో వారి దగ్గర నుంచి రూ. 120 వసూలు చేసుకురమ్మని వంట మనిషి నసీర్ అహ్మద్‌ను పంపాడు అంకుర్.
డబ్బులివ్వమని నసీర్ అడగ్గానే వారిలో ఒకరు కోపంతో అతని కణితిపై తుపాకీతో కాల్చాడు.
దీంతో నసీర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ ఇద్దరు అక్కడ్నుంచి జారుకున్నారు. అంకుర్ సబర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.