Alt News | ఫేస్‌బుక్‌లో 25వ తేదీనే వీడియో పోస్ట్ ఆ తర్వాతే పోస్ట్ చేసిన ఆల్ట్‌న్యూస్ జుబేర్ వేల మంది షేర్ చేసినా.. అతని పైనే కేసు అన్యాయం అంటున్న ప్రగతిశీల శక్తులు లక్నో: ఎక్కాలు రానందుకు ఒక ఏడేళ్ల ముస్లిం విద్యార్థిని తోటి పిల్లల చేత చితక బాదించిన దిగ్భ్రాంతికర టీచర్ వీడియోను దేశంలో అనేక మంది సోషల్‌మీడియాలో షేర్ చేశారు. టీచర్ చర్యను అనేక మంది తీవ్రంగా విమర్శించారు. కానీ.. ఆ వీడియో […]

Alt News |
- ఫేస్‌బుక్‌లో 25వ తేదీనే వీడియో పోస్ట్
- ఆ తర్వాతే పోస్ట్ చేసిన ఆల్ట్‌న్యూస్ జుబేర్
- వేల మంది షేర్ చేసినా.. అతని పైనే కేసు
- అన్యాయం అంటున్న ప్రగతిశీల శక్తులు
లక్నో: ఎక్కాలు రానందుకు ఒక ఏడేళ్ల ముస్లిం విద్యార్థిని తోటి పిల్లల చేత చితక బాదించిన దిగ్భ్రాంతికర టీచర్ వీడియోను దేశంలో అనేక మంది సోషల్‌మీడియాలో షేర్ చేశారు. టీచర్ చర్యను అనేక మంది తీవ్రంగా విమర్శించారు. కానీ.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన మూడు రోజుల తర్వాత.. పోలీసులు నిజనిర్ధారణ వెబ్‌సైట్ ‘ఆల్ట్‌న్యూస్’కు చెందిన మొహమ్మద్ జుబేర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం సంచలనం సృష్టించింది. ఆ బాలుడి గుర్తింపును బయట పెట్టారని అందులో ఆరోపించారు.
వాస్తవానికి ఈ వీడియోను జుబేర్ ‘ఎక్స్’లో ఆగస్ట్ 25వ తేదీ సాయంత్రం పోస్ట్ చేశారు. అయితే.. బాలుడి గుర్తింపును బయటపెట్టరాదని జాతీయ బాలల హక్కుల సంస్థ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో చెప్పిన తర్వాత కొద్ది గంటలకు ఆ వీడియోను జుబేర్ తన ‘ఎక్స్’ ఖాతా నుంచి తొలగించారు. నిజానికి ఆ వీడియోను మొట్ట మొదట షేర్ చేసింది కానీ, షేర్ చేసిన ఒకే ఒక్కడు కానీ జుబేర్ కాదు. జుబేర్ ఒక్కడే కాదు.. అనేక మంది జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలు, వార్తా సంస్థలు, టెలివిజన్ న్యూస్ యాంకర్లు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
గతంలోనూ టార్గెట్
తప్పుడు వీడియోలు, మతపరమైన భావాలు రెచ్చగొట్టే వీడియోను నిజమో కాదో నిర్ధారించినందుకు జుబేర్ గతంలోనూ అనేక అంశాల్లో టార్గెట్ అయ్యారు. 1983లో ఒక బాలీవుడ్ సినిమాలోని స్టిల్‌ను 2018లో జుబేర్ పోస్ట్ చేశారు. అయితే.. అది మతపరమైన భావనలను దెబ్బతీసిందని ఒక అజ్ఞత ట్విట్టర్ యూజర్ చేసిన ఫిర్యాదుతో గత సంవత్సరం అరెస్టయి మూడు వారాలు జైల్లో ఉన్నారు.
వెంటనే డిలీట్ చేసినా..
తాజాగా బయటకు వచ్చిన వీడియోను బాధిత బాలుడి బంధువు మహమ్మద్ నదీమ్ ఆగస్ట్ 24న చిత్రీకరించాడు. ఆ వీడియోలో ముజఫర్‌నగర్ జిల్లా ఖుబాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూలు యజమాని, టీచర్ అయిన త్రిప్త త్యాగి.. ముస్లిం విద్యార్థుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతూ, ఏడేళ్ల బాలుడిని కొట్టండంటూ తోటిపిల్లలకు చెబుతుండటం కనిపిస్తుంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు తాను స్కూల్‌లో నిర్మాణపని పర్యవేక్షణలో ఉన్నానని నదీమ్ చెబుతున్నాడు.
అదే రోజు సాయంత్రం 7.05 గంటలకు ‘ఎక్స్’లో స్పందించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కనూంగో స్పందిస్తూ.. ఈ ఘటనపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని తెలిపారు. బాధిత బాలుడి వ్యక్తగత గోప్యత, భద్రత రీత్యా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఎవరూ పోస్ట్ చేయవద్దని, యూజర్లు దానిని డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రాత్రి 8.48 గంటలలకు జుబేర్ ఆ వీడియోను డిలీట్ చేశారు. ఇతర సోషల్ మీడియా యూజర్లు సైతం తమ ఖాతాల నుంచి ఆ వీడియోను తొలగించారు. అప్పటికే అది సంచలనంగా మారడంతో త్రిప్తి త్యాగిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తదుపరి మూడు రోజులకు జబేర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
అనేకమంది షేర్ చేస్తే.. నాపైనే కేసు
యూపీ బాలుడి వీడియోను అనేక మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా.. తనపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని జుబేర్ స్రోల్ న్యూస్‌కు చెప్పారు. నిజానికి ఈ వీడియో మొదటగా ఫేస్‌బుక్‌లో ఆగస్ట్ 24వ తేదీన ఘటన జరిగిన కొద్దిసేపటికి ప్రత్యక్షమైందని జుబేర్ తెలిపారు. ట్విట్టర్‌లోనూ జుబేర్ షేర్ చేయడానికంటే ముందే అంటే.. ఆగస్ట్ 25వ తేదీ సాయంత్రం 6.39 గంటలకు పోస్ట్ అయింది.
