After Life | మరణం అంచుల వద్దకు వెళ్లిన 5000 మందిని ఇంటర్వ్యూ చేసి పరిశోధన చావు అనేది ఎప్పటికీ మనిషి ఆలోచనకు అందని అంశమే. చావు తర్వాత జీవితం (Life After Death) ఉంటుందా లేదా అనేదీ ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అందుకే ఈ అంశంపై గతంలోనూ ఇప్పుడూ పలు పరిశోధనలు జరుగుతున్నాయి. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన 5000 మంది దగ్గర నుంచి అనుభవాలను క్రోడీకరించి, పరిశోధించిన ఒక అమెరికా వైద్యుడు […]

After Life |
- మరణం అంచుల వద్దకు వెళ్లిన 5000 మందిని ఇంటర్వ్యూ చేసి పరిశోధన
చావు అనేది ఎప్పటికీ మనిషి ఆలోచనకు అందని అంశమే. చావు తర్వాత జీవితం (Life After Death) ఉంటుందా లేదా అనేదీ ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అందుకే ఈ అంశంపై గతంలోనూ ఇప్పుడూ పలు పరిశోధనలు జరుగుతున్నాయి. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన 5000 మంది దగ్గర నుంచి అనుభవాలను క్రోడీకరించి, పరిశోధించిన ఒక అమెరికా వైద్యుడు తన పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. మరణం తర్వాత జీవితం తప్పకుండా ఉంటుందని.. అందులో ఎటువంటి అనుమానమూ అవసరం లేదని ఈ పరిశోధన చేసిన డా.జెఫ్రీ లాంగ్ వెల్లడించారు.
మరణాంతర జీవితం పట్ల ఎప్పటి నుంచో ఆసక్తి పెంచుకున్న ఆయన నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించారు. అనంతరం సుమారు 5000 మంది కేస్ స్టడీలను తీసుకుని..ఆ అధ్యయన (Study) ఫలితాలను తాజాగా ఇన్‌సైడర్ జర్నల్‌లో ప్రచురించారు. అసలు మరణం అంచుల వరకు వెళ్లడం అంటే ఏమిటి? కోమా లోకి వెళ్లిన లేదా వైద్య పరంగా హృదయ స్పందన ఆగిపోయినా వినడం, కన్నీరు కార్చడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం వంటి స్థితిలో ఉన్న వారిని మరణం అంచుల వరకు వెళ్లిన వారిలా పరిగణించాలి అని జెఫ్రీ పేర్కొన్నారు.
ఆయన 5000 మంది అనుభవాలను తీసకుంటున్నపుడు వారందరివీ వేర్వేరు గతాలు, కథలు అయినప్పటికీ అన్నింటి మధ్యా ఒక ఉమ్మడి అంశాన్ని గమనించారు. 'వారంతా కూడా తమ ఆత్మ లేదా చైతన్య స్థితి శరీరాన్ని వదిలేస్తున్న స్థితిని అనుభవించారు. ఒక పెద్ద సొరంగం గుండా వెళుతున్నట్లు పెద్ద కాంతి తమను అనుసరిస్తున్నట్లు అనుభూతి చెందారు.
ఆ తర్వాత వారి కన్నా ముందే మరణించిన ప్రియమైన వారు ఆహ్వానం పలికారు. అందులో జంతువులూ, మొక్కలూ ఉన్నాయి. ఆ కొత్త ప్రపంచాన్ని క్షణ కాలం పాటు అదే తమ లోకం అని.. తాము అక్కడి వారమేనని భావించడం మొదలుపెట్టారు' అని జెఫ్రీ తన పరిశోధనలో పేర్కొన్నారు. తాను ప్రతి ఒక్కరి అనుభవాలను సేకరించి వారితో సంతకం కూడా తీసుకున్నానని, కాబట్టి తన పరిశోధనను శంకించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
తనకు బాగా ఇష్టమైన ఒక కేస్ స్టడీని ఆయన వివరించారు. 'ఒక మహిళ గుర్రపు స్వారీ చేస్తుండగా పడి పోయి.. కోమాలోకి వెళ్లిపోయారు. వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లిపోయినప్పటికీ.. తన ఆత్మ లేదా చైతన్య స్థితి మాత్రం ఆ గుర్రంపై పరిగెట్టిందని ఆమె తన ఇంటర్వ్యూలో భాగంగా నాకు చెప్పారు. అంతే కాకుండా తను పడిపోయిన తర్వాత జరిగిన ఆ ట్రాక్‌పై జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కళ్లతో చూసినట్లు వెల్లడించారు.
కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఆమెను ఆసుపత్రిని వెంటనే తీసుకుపోయారని నేను ధ్రువీకరించుకున్నా' అని జెఫ్రీ పేర్కొన్నారు. అయితే ఈ అనుభవాలన్నీ నిజమే అయినప్పటికీ.. తాను వీటిని శాస్త్రీయంగా రుజువు చేయలేనని ఆయన అన్నారు. మెదడు చేసే వింతలను సమర్థించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ అవేమీ మరణాంతర జీవితాన్ని వివరించలేకపోతున్నాయన్నారు. ఇదే అంశంపై పరిశోధనలు చేస్తున్న మరి కొందరు వైద్యులు కూడా.. మరణం అంచుల వరకు వెళ్లిన వారు
ఇవే అనుభూతులను తమతో పంచుకున్నారని అంగీకరించారు.
