Uttam Kumar Reddy |
- ఒకే రోజు కోదాడ, హుజూర్ నగర్‌లలో
విధాత: పీసీసీ మాజీ చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 19న కోదాడ, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో అందరికంటే ముందుగానే ఎన్నికల భేరీ మోగించారు. ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ప్రచార పోస్టర్లను, కరపత్రాలను, సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు.
సెప్టెంబర్ నెలలో తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని, నవంబర్ నెల చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సరిగా 100 నుండి 150 రోజుల గడువు మాత్రమే ఉన్నందున పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఉత్తమ్ కాంగ్రెస్ కేడర్ కు సూచించారు.
శుక్రవారం ఉదయం కోదాడ గుడిగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కోదాడ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి 9 గంటల వరకు హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
ఆ రెండు నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పద్మావతి లతో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల, గ్రామ శాఖ, బూత్ కమిటీల నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరు కారన్నారు.
హుజూర్ నగర్, కోదాడ సెగ్మెంట్లలో తాను, పద్మావతి ఇద్దరం కూడా 50,000 మెజారిటీకి తగ్గకుండా గెలుస్తామని లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానంటు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ద్వారా రానున్న ఎన్నికలపై ఆసక్తి పెంచారు. తన ఎన్నికల లక్ష్యసాధన దిశగా ఉత్తమ్ ముందస్తు ఎన్నికల సన్నాహాలను ఆరంభించారు.
ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పార్టీ సంస్థాగత బలోపేతం కోసం బూత్, గ్రామస్థాయి కమిటీల నిర్మాణం, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాల రూపకల్పన, ప్రతి ఓటర్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేరేలా కార్యచరణ ప్రణాళికలపై చర్చించనున్నట్లుగా ఉత్తమ్ తెలిపారు.
అలాగే బ్లాక్, మండల, పట్టణ, బూత్ కమిటీల వివరాలపైన, సభ్యత్వ వివరాల నివేదికలు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సమర్పించాలని ఉత్తమ్ సూచించారు. ప్రతి వంద ఓటర్లకు ఒక సమన్వయకర్తను నియమించి బూత్ ల వారిగా పేర్లను సమావేశాల్లో సమర్పించాలని కోరారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి దందాలపైన, వారి వేదింపుల పైన, అమలు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల వివరాల పైన కూడా ఈ సమావేశాల్లో మండల, పట్టణ కమిటీల అధ్యక్షులు నివేదికలను సమర్పించాలని ఉత్తమ్ సూచించడం విశేషం.