Uttam Kumar Reddy
- ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధం
విధాత: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు రానున్న ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ లో, తన సతీమణి కోదాడ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నామని, 50 వేల మెజార్టీతో గెలుస్తామని, 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుండి తప్పుకుంటామని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శుక్రవారం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతు ఎన్నికల సన్నాహాల దిశగా పార్టీ శ్రేణులకు మార్గ దర్శకం చేశారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, నవంబర్‌లో పోలింగ్ జరగనుందని, సరిగ్గా 100 నుండి 150 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్నందున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. రెండు నియోజకవర్గాల్లో ప్రతి బూత్ లో పదిమందితో కమిటీ వేయాలన్నారు. గ్రామ, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు అన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక కాంగ్రెస్ సమన్వయ కార్యకర్తను నియమించుకొని తన పరిధిలోని ఓటర్లతో కూడిన జాబితా వివరాలను అందించాలన్నారు.
సమన్వయకర్తలు 100 మంది ఓటర్లను వారానికి ఒకసారి అయినా వారి ఇళ్లకు వెళ్లి కలవాలని, వారికి కావాల్సిన పనులను పూర్తి చేయడంలో సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా 100 ఓటర్ల చొప్పున బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి బూత్ కు అధికారికంగా పార్టీ బిఎల్ఏ లను నియమించాలని, ఏజెంట్ల వివరాలను సమర్పించాలని సూచించారు.
సోషల్ మీడియా టీమ్స్ ను వెంటనే నియమించుకొని పార్టీ ప్రచారాన్ని జనంలోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావం పెరిగినందున ప్రతి బూత్ కు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 2018 నుండి అభివృద్ధి కుంటుపడిపోయిందని, పూర్తిగా అధికార బిఆర్ఎస్ పార్టీ వసూళ్ల దందా మాత్రమే సాగుతుందన్నారు.
అధికార పార్టీ నాయకులు సాండ్, ల్యాండ్, వైన్స్, మైన్స్ వ్యాపారాల్లో కమీషన్లు దండుకోవడంలో మునిగి తేలుతున్నారన్నారు. చివరకు మట్టి మీద కూడా టాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా పనిచేసిన పోలీస్ శాఖ ఇప్పుడు కోదాడ, హుజూర్ నగర్ లలో ఏకపక్షంగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసి వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులకు భవిష్యత్తులో వడ్డీతో సహా లెక్కలు అప్ప చెబుతామన్నారు. ఇన్నాళ్లుగా కోదాడ, హుజూర్ నగర్ లలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటే అది కాంగ్రెస్ కార్యకర్తల రక్తం, చెమటకు ప్రతిరూపమేనని అన్నారు.
కొందరు దుష్టశక్తులు తనపైన, పద్మావతి పైన సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విమానాశ్రయంలో పద్మావతి బెంగళూరు వెళుతున్నప్పుడు బిఆర్ఎస్ మహిళలు ఎదురుపడితే అక్కడ ఎవరో ఫోటో తీసుకుంటే దాని చుట్టూ రాజకీయ దుష్ప్రచారం చేశారన్నారు. ఇలాంటి మోసపూరిత దుష్ప్రచారాలను నమ్మకుండా కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు పట్టుదలగా పని చేయాలన్నారు.
పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తమ పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు జీవితాంతం మరవబోమన్నారు. రెండు నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలే తమ పిల్లలని భావిస్తూ జీవిస్తున్నామన్నారు. వారి సేవకే తమ జీవితాలు అంకితం చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటినుండే కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ కమిటీల నిర్మాణాలతో పాటు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ల నిర్మాణంతో ప్రచార ప్రక్రియను ముమ్మరం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న, మహిళా కాంగ్రెస్ నేత అనురాధతో పాటు రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.