విధాత: సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు నేడు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. 16వ తేదీ నుంచి ఈ రైలు ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే వందే భారత్ రైలు ప్రత్యేకతలను తెలుసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. మరి వందే భారత్ రైలు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం..
కోచ్‌లో ఏం జరుగుతుంది? ప్రయాణికులు ఉన్నారా? అనే విషయాలను తెలుసుకునేందుకు లోకో పైలట్ క్యాబిన్లో ప్రత్యేకంగా మానిటర్ ఏర్పాటు చేశారు. అంటే కోచ్‌ల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మానిటర్‌కు అనుసంధానం చేశారు.
ప్రత్యేకమైన స్పీడో మీటర్‌ను ఏర్పాటు చేశారు. తాము వెళ్లే మార్గంలో ప్రమాదకర మార్గాలు ఉన్నట్లు అయితే అలాంటి ప్రాంతాల్లో స్పీడ్‌ను కంట్రోల్ చేసేందుకు వీలుగా స్పీడో మీటర్ పని చేయనుంది.
మొత్తం 16 బోగీలు ఉంటాయి. చైర్ కారు కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ఇందులో సీటు ముందు భాగంలో ల్యాప్‌టాప్ ఉపయోగించేందుకు వీలుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయొచ్చు.
ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్.. వందే భారత్ రైలులో ఇలాంటి కోచ్‌లు రెండు ఉన్నాయి. 180 డిగ్రీల కోణంలో కుర్చీలు తిరిగే విధంగా సౌకర్యం కల్పించారు. దీని వల్ల కుటుంబ సభ్యులు అధికంగా ప్రయాణించే వారికి మంచి వెసులుబాటు అని చెప్పొచ్చు. టీవీ, వైఫై సౌకర్యం కూడా కల్పించారు. అంధుల కోసం బ్రెయిలి లిపిలో రాసి ఉంచారు.
రాబోయే స్టేషన్ వివరాలను, ఎంత వేగంతో రైలు వెళ్తుందనే విషయాలను ప్రతి కోచ్‌లో స్క్రోల్ అయ్యే విధంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ స్క్రోలింగ్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ప్రసారం కానున్నాయి.
ఇక ఈ వందేభారత్ రైలులో మూడు హాట్ కేసులు, ఒక ఫ్రిజ్ కూడా ఏర్పాటు చేశారు. హాట్ కేస్ల్లో మటన్, చికెన్ బిర్యానీలు, ఎగ్, కర్రీ పఫ్స్ పెట్టుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు టాక్ అనే బటన్‌ను నొక్కితే.. క్షణాల్లోనే లోకోపైలట్ స్పందిస్తారు. వెంటనే లోకోపైలట్ సహాయ సహకారాలు అందించే వీలుగా ఏర్పాట్లు చేశారు.