Tuesday, January 31, 2023
More
  Homelatest'వందే భారత్' హంగామా.. రేట్లు వాచిపోయేనమ్మా

  ‘వందే భారత్’ హంగామా.. రేట్లు వాచిపోయేనమ్మా

  • రాష్ట్రంలో రైలు ప్రారంభ రాజకీయం
  • ఇది పెద్దొల్ల ట్రైన్. పేదోడి కాదు
  • కాషాయ, గులాబీల హంగామా
  • పుష్‌పుల్‌ను మరిచిపోయిన లీడర్లు

  విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రం వందేభారత్‌ రైలును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మార్గంలో ఆదివారం నుంచి ప్రవేశపెట్టింది. ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా సికింద్రాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే మంత్రితో కలిసి ఈ ట్రైన్‌ను ప్రారంభించారు.

  వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సందర్భంగా జెండా ఊపిన ప్రధాని మోడీ మాట్లాడుతూ నవ భారత శక్తి సామర్థ్యాలకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతీక అన్నారు. ఈ సంక్రాంతి పండుగ వాతావరణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు గొప్ప కానుక అందుతోంది. వందే భారత్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ల సంస్కృతి, వారసత్వాన్ని అనుసంధానం చేస్తుంది. వందే భారత్ రైలు ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యాలు, సామర్థ్యానికి చిహ్నం. దేశం వేగవంతమైన మార్పు చెందడంలో ఇదొక మార్గం. కలలు, ఆకాంక్షల కోసం పరితపిస్తున్న దేశం తన లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకుంటోంది.

  ప్రధాని పర్యటన మతలబేంటి?

  వాస్తవానికి ఈనెల 19న ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించాల్సిన వందే భారత్ రైలు ముందుగానే ప్రధాని వర్చువల్ లో ప్రారంభించడం గమనార్హం. ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు వెనుక కారణమేమో గాని, రాష్ట్రంలో రైలు రాజకీయం విపరీతంగా సాగుతుంది. దేశంలో గతంలో ఎప్పుడు రైలు ప్రారంభించనట్లూ ఇప్పుడే రైలు ప్రారంభిస్తున్నట్లూ హంగామా చేస్తున్నారు.

  వందే భారత్ సందడి

  ఆదివారం పండుగ రోజైనప్పటికీ వందే భారత్ రైలంటూ ఎక్కడలేని సందడి చేశారు. ఈ వందే భారత్ రైలు గురించి సాగుతున్న ప్రచారం చెప్పనలవి కాకుండా ఉంది. ఆ రైలు పట్టాల మీద కాకుండా గాలిలో తేలియడూ పయనించినట్లూ, స్వర్గసుఖాలు అందులో ఉన్నట్లు, ప్రయాణికులపై ఏ భారం లేకుండా ఇంటికి ఉచితంగా తీసుకపోతున్నట్లు, అంతకుముందు ఎన్నడూ రైలు చూడనట్టు ప్రచారం సాగుతోంది. పైగా ఈ వందే భారత్ రైలు ఎక్కడ ప్రారంభించిన ప్రధాని మోడీ ప్రారంభించడం దానికి ఎక్కడ లేని బ్రాండ్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఈ రైలుతో లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు కాషాయ రంగులు పొంగిపొర్లుతున్నాయి.

  కాషాయ, గులాబీల హంగామా

  రాష్ట్రంలో ఆదివారం రైలు ప్రారంభం సందర్భంగా స్టేషన్‌కు ఎగేసుకుని వచ్చి మరీ ఎదురేగి మరీ జెండాలూపుతున్నారు. అసలు అగే దగ్గర, ఆగని దగ్గర కాషాయ, గులాబీలు పోటీపడీ మరీ హంగామా చేస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్ లో వందే భారత్ రైలు కోసం స్టేషన్‌కు చేరుకున్న బిజెపి మరియు బిఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు మోడీ, కేసీఆర్ అంటూ నినాదాలతో రైల్వే స్టేషన్లో పోటీ పడడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.

  ఇది పేదోడి రైలుకాదు పెద్దొల్ల ట్రైన్

  ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ ధరలే నిజమైతే రేట్లు అదరగొడుతున్నట్లే లెక్క. వందే భారత్ రైలు టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ టు వరంగల్ రూ.520, సికింద్రాబాద్ టు ఖమ్మం రూ.750, సికింద్రాబాద్ టు విజయవాడ రూ. 905, సికింద్రాబాద్ టు రాజమండ్రి రూ.1365, సికింద్రాబాద్ టు విశాఖపట్నం రూ.1665. వాచిపోతున్న వందే ‘భారత్’ రైలు టికెట్ ధరలు. వరంగల్ కే రూ.520 దేశం పేరు పెట్టి మరీ ధర దంచేస్తున్నారు. టైంలో పేద్ద తేడా లేదు కానీ ధర నాలుగు రెట్లు ఎక్కువగా పెట్టేశారు. ఇందులో సౌకర్యాలు సానుకూలంగా ఉంటే ఉండొచ్చు గానీ, రెండు గంటల 10 నిమిషాల ప్రయాణానికి వసతి సంగతేమో గానీ, రేటు వాచిపోతుందనీ సగటు వరంగల్ వాసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్దొల్ల ట్రైన్ తప్ప పేదోడి రైలు కాదని విమర్శిస్తున్నారు.

  పుష్‌పుల్‌ను మరిచిన లీడర్లు

  రోజు పొద్దుగాలనే వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సామాన్యలకు సౌకర్యవంతంగా ఉన్న పుష్‌పుల్ రైలును కరోనా కాలం నుంచి రద్దు చేసిన రైల్వే శాఖ పై ఒత్తిడితెచ్చి పుష్‌పుల్ రైలును వరంగల్ నుంచి తిరిగి షురువు చేయించలేని లీడర్లంతా యమ హడావుడి చేశారు.

  వరంగల్‌లో ఒకే ఒక్క నిమిషం

  దేశంలోనే హైస్పీడ్‌ రైలుగా పేరు గడించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ ప్రజలకు ఆదివారం నుంచి అందుబాటులోకి రాగ వరంగల్‌లో ఒకే నిమిషం హాల్టింగ్‌ ఉండనుంది. కాజీపేట జంక్షన్ లో హాల్టింగ్ లేదు.

   రైలు ప్రత్యేకతలు

  విశాఖపట్నంలో బయలుదేరి రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌లో మాత్రమే ఆగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు, పూర్తిగా ఏసీ సౌకర్యంతో మొత్తం 18 కోచ్‌లతో ఉంటుంది. చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌లుంటాయి. రైలు రాకపోకల వేళలను గురువారం రాత్రి రైల్వేశాఖ ప్రకటించింది. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్య ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

   సికిందరాబాద్‌ వైపు

  విశాఖపట్నంలో వందేభారత్‌ ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 7.55 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది. తిరిగి రాజమండ్రిలో 7.57 గంటలకు బయలుదేరి 10 గంటలకు విజయవాడకు, అక్కడి నుంచి 10.05 బయలుదేరి 11గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. తిరిగి ఖమ్మం నుంచి 11.01 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. కేవలం ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది. వరంగల్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో 45 నిమిషాలు ఆగి తిరిగి విశాఖపట్నం బయలు దేరుతుంది.

  విశాఖపట్నం వైపు..

  వందే భారత్‌ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. వరంగల్‌లో ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది. తిరిగి వరంగల్‌ నుంచి ఖమ్మంకు 5.45గంటలకు చేరుకుంటుంది. అక్కడకూడా ఒక నిమిషమే ఆగుతుంది. ఖమ్మం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటకు విజయవాడకు చేరుకుంటుంది. అక్కడ 5 నిమిషాలు ఆగుతుంది. రాత్రి 8.58 గంటలకు రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుటుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి సికిందరాబాద్‌కు బయలుదేరుతుంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular