Veera Simhareddy: మొత్తానికి సంక్రాంతి హడావుడి ముగిసింది. సంక్రాంతికి కోడిపుంజుల్లా పోటీపడిన నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అద్భుత కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇక రెండో వారంలో వీరసింహారెడ్డి పై వీరయ్యదే పైచేయి అని తేలిపోయింది.
ఇప్పటివరకు వీరసింహారెడ్డి 120 కోట్లతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు వీరయ్య 170 కోట్లు కొల్లగొట్టి 200 కోట్లకు పరుగులు పెడుతున్నాడు. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం వాల్తేరు వీరయ్యకు వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్లు లభించడం, అంతేకాక వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ పాత్రను పోషించడం వంటివి బాగా కలిసి వచ్చాయని వాదిస్తున్నారు.
నిజానికి ‘వాల్తేరు వీరయ్య’ 13వ తేదీ, ‘వీరసింహారెడ్డి’ ఒకరోజు ముందుగానే అంటే 12వ తేదీ థియేటర్లలోకి వచ్చాయి. వీరసింహారెడ్డి విడుదలైన జనవరి 12న మరో చిత్రం పోటీ లేకపోవడంతో మొదటి రోజే ఏకంగా 52 కోట్లను వీరసింహారెడ్డి వసూలు చేసింది.
ఒకవేళ వీరసింహారెడ్డి బదులు ‘వాల్తేరు వీరయ్య’ ఒకరోజు ముందుగా వచ్చి ఉంటే.. ఆ 50 కోట్లు ‘వాల్తేరు వీరయ్య’ ఖాతాలో పడి ఆ చిత్రం ఇప్పటికే 200 కోట్లను దాటి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’ కనుక విడుదలై ఉంటే.. మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేదనేలా కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ విషయంలో నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ఇప్పుడీ రెండు చిత్రాలు మంచి కలెక్షన్స్ని రాబట్టి.. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టే దిశగా నడుస్తున్నాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. సంక్రాంతి పోటీలో పై చేయి మాత్రం వాల్తేరు వీరయ్యదే అని చెప్పాలి.