మూవీ పేరు: ‘వీరసింహారెడ్డి’ విడుదల తేదీ: 12 జనవరి 2023 నటీనటులు: బాలకృష్ణ, శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, మురళీశర్మ, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ ఎడిటర్: నవీన్ నూలి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ సంగీతం: థమన్. ఎస్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని విధాత‌: నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు.. పూనకాలతో ఊగిపోయే అభిమానులున్నారు. […]

మూవీ పేరు: ‘వీరసింహారెడ్డి’
విడుదల తేదీ: 12 జనవరి 2023
నటీనటులు: బాలకృష్ణ, శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, మురళీశర్మ, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
సంగీతం: థమన్. ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని

విధాత‌: నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు.. పూనకాలతో ఊగిపోయే అభిమానులున్నారు. బాలయ్య మాస్‌కి పెట్టింది పేరు. ఆయనకి సరైన మాస్ పాత్ర పడిందంటే చాలు చెలరేగిపోతాడనేది.. ఇప్పటికే బోయపాటి, బి. గోపాల్ సినిమాలతో నిరూపితమైంది. ఇప్పుడా లిస్ట్‌లోకి గోపీచంద్ మలినేని చేరాడు.

ఒక వీరాభిమానిగా గోపీచంద్ మలినేని ఈ సినిమా తీసినట్లుగా ఇప్పటి వరకు జరిగిన మీడియా సమావేశాలలో ఆయన చెబుతూ వస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఫస్ట్ ఫస్ట్ విడుదలైన చిన్న టీజర్ గ్లింప్స్‌తోనే సినిమాపై బీభత్సమైన హైప్‌ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచడమే కాకుండా, ఈ పండగకి గట్టిగా కొట్టబోతున్నామనేలా బాలయ్య ఫ్యాన్స్‌తో మాట్లాడించాయి.

‘అఖండ’ సినిమాతో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య నుంచి.. తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుందో అనే దానికి.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్.. ఇదొక మాస్ బొనాంజా అనేలా క్లారిటీ ఇచ్చేసింది. బాలయ్యకు బాగా అచ్చొచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలో, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపి ఈ సినిమా ఉంటుందనే విషయం ట్రైలర్‌తో వెల్లడైంది.

దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చూశారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుందో.. మన సమీక్షలో తెలుసుకుందాం.

‘తెగింపు’ రివ్యూ: ఫ్యాన్సే తెగించాలి

కథ:

మొదటి నుంచి వినబడుతున్నట్లుగా ఇది అన్నాచెల్లెళ్ల కథ. ఒక తండ్రికి, వేరు వేరు భార్యలకు పుట్టిన వీరసింహారెడ్డి (బాలకృష్ణ), భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) ల కథ ఇది. వీరసింహారెడ్డిని అడుగడుగునా ధ్వేషించే భానుమతిని ఆత్మీయంగా చూసుకునే ఓ అన్న కథ. అన్నని అపార్థం చేసుకుని.. ఆ అన్ననే నరికేసే ఓ చెల్లి కథ ఇది. ఏం అర్థం కాలేదు కదా..

వీరసింహారెడ్డి అంటే భానుమతికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. చెల్లికి ఇష్టం లేకపోయినా.. అన్నగా తన బాధ్యతను నెరవేర్చుతుంటాడు వీరసింహారెడ్డి. అయితే వీరసింహారెడ్డి శత్రువును పెళ్లి చేసుకుని.. మరింతగా తనపై శత్రుత్వానికి భానుమతి కాలు దువ్వుతుంది. తన భర్తతో కలిసి వీరసింహారెడ్డిని వేసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

కానీ సీమలో ఉన్నంతకాలం వీరసింహారెడ్డి చిటికెన వేలుపై వెంట్రుకని కూడా కదిలించలేని భానుమతి అండ్ టీమ్.. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు వెన్నుపోటు పొడిచి చంపిస్తుంది. అసలు వీరసింహారెడ్డిపై భానుమతి అంతగా ఎందుకు పగ పెంచుకుంది? ఆ పగకి కారణం ఏమిటి? ఈ విషయం తెలిసిన వీరసింహారెడ్డి కొడుకు జైసింహా రెడ్డి (బాలకృష్ణ) ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే.. ఈ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో నిండిన ఫ్యాక్షన్‌ కథ.

ఆర్టిస్ట్‌ల, సాంకేతిక నిపుణుల పనితీరు:

వీరసింహారెడ్డి, జైసింహా రెడ్డిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. రెండు పాత్రలలోని వేరియేషన్స్‌ని బాలయ్య అద్భుతంగా ప్రదర్శించారు. అయితే ఏ జానర్‌ అయినా అతికిపోయే బాలయ్య కొన్నాళ్లుగా మాస్‌నే నమ్ముకుంటున్నారు. దీంతో ఒకే తరహా పాత్రలు ఆయనకు పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఆయనది రొటీన్ పాత్రే. అయితే ఆయన ఎనర్జీకి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

ఆయన పలికే డైలాగ్స్, మేనరిజమ్స్, స్క్రీన్‌ప్రజెన్స్ అన్నీ బాగున్నాయి కానీ.. ఆల్రెడీ చూసేసినట్లే ఉంటాయి. కొత్తదనం ఏదీ కనిపించదు. శృతిహాసన్ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు కానీ.. పాటలలో గ్లామర్‌తో ఆకర్షించింది. కొన్ని కామెడీ సీన్లలో ఆమె తేలిపోయింది. కాస్త గ్యాప్ వచ్చింది కదా.. ఆ గ్యాప్ ఆమె నటనలో కనబడింది. బాలయ్య తరహా పవర్ ఫుల్ పాత్రలో భానుమతిగా చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఆకట్టుకుంది.

నటన పరంగా మరో మెట్టు ఎక్కేసింది. ఈ సినిమా పరంగా ఆమెకు ఎక్కువ క్రెడిట్, పేరు దక్కుతుంది. ఆమె స్క్రీన్‌ప్రెజన్స్ కూడా.. అందరినీ అలరిస్తుంది. బరువైన పాత్రను ఆమె ఎంతో బాధ్యతగా చేసినట్లు అనిపించింది. ఆమెకి ఈపాత్రతో మంచి పేరు వస్తుంది. వీరసింహారెడ్డి భార్యగా చేసిన హనీ రోజ్‌కు.. చాలా మంచి పాత్ర పడింది. ఆమె కూడా తన పాత్రకి 100 శాతం న్యాయం చేసి.. టాలీవుడ్‌లోనూ బిజీ నటి అయ్యే ఛాన్స్‌ను కొట్టేసిందని చెప్పుకోవాలి.

ముందుముందు ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని పాత్రలు వచ్చే అవకాశం ఉంది. క్రూరమైన విలన్‌గా దునియా విజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.. కానీ బాలయ్య ముందు తేలిపోయాడు. ‘అరవింద సమేత’ తర్వాత నవీన్ చంద్రకు మరోసారి అలాంటి తరహా పాత్ర ఇదని చెప్పుకోవచ్చు. ఇంకా శృతిహాసన్ తండ్రి పాత్రలో చేసిన మురళీ శర్మ.. ఇతర పాత్రలలో కనిపించిన బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, రవిశంకర్.. వంటి వాళ్లందరూ వారి పాత్రల పరిధిమేర నటించి, మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు థమన్, సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ, నిర్మాణ విలువలు.. ఈ మూడింటికి అగ్రతాంబూలం అందుతుంది. సంగీతం పరంగా థమన్ అందించిన పాటలు, వాటిని చిత్రీకరించిన తీరు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది.. ఇచ్చి పడేశాడంతే. కాకపోతే చాలా చోట్ల డైలాగ్స్ కూడా వినబడనంతగా డప్పుల శబ్ధంతో ముంచేశాడు.

సౌండ్ బాక్స్‌లు బద్దలు కొట్టాలని కాకుండా.. ఈ విషయంలో థమన్ కాస్త శ్రద్ధ పెట్టాలి. ఇక కెమెరామెన్ రిషి పంజాబీ.. అటు రాయలసీమ అందాలను సహజంగా చూపించడమే కాకుండా.. టర్కీ లొకేషన్స్‌ని కూడా అత్యద్భుతంగా చూపించాడు. నవీన్ నూలి రొటీన్‌గా వచ్చే సీన్స్‌పై కత్తెర వేసే ఛాన్సుంది. అలా వేసి ఉంటే.. సినిమాలో వేగం ఇంకా బాగా పెరిగేది.

సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ బాలయ్య కోణంలో బాగానే ఉన్నా.. మిగతా పాత్రల విషయంలో మాత్రం అంతగా అతకలేదు. కొన్ని పొలిటికల్ పంచెస్ మాత్రం వావ్ అనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ సినిమాకు సెట్స్ వేశారనే విషయం తెలియనంతగా చాలా న్యాచురల్ సెట్స్‌తో.. తన పనితనాన్ని ప్రదర్శించారు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు వారి ఎఫెర్ట్ ఈ సినిమా కోసం పెట్టారు.

సాంకేతికంగా ఈ సినిమాకు వంక పెట్టడానికి ఏమీ లేదు. కాకపోతే.. దర్శకుడు గోపీచంద్ మలినేని మాత్రం కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించలేకపోయాడు. రొటీన్ కథతో.. బాలయ్యలోని మాస్‌ని వాడుకోవాలని మాత్రమే చూశాడు. అంతకుమించి బయటకు రాలేదు.

క్రిష్టియన్‌ అయిన సమంత.. జపమాల వాడుతుందా?

విశ్లేషణ:

ఈ సినిమా దాదాపు ‘లెజెండ్’ సినిమానే తలపిస్తుంది. అందులో అన్నాదమ్ములైతే.. ఇందులో తండ్రీకొడుకులు. అందులో పెళ్లి కోణంలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లినట్టే.. ఈ కథని కూడా అలాగే తీసుకెళ్లారు. కాకపోతే సిస్టర్ సెంటిమెంట్ అనేది కాస్త వెరైటీగా అనిపించే అంశం. అయితే దీనిని చివరికి రొటీన్‌గానే ముగించారు.

వీరసింహారెడ్డిపై అటాక్ సీన్ ఫ్యాన్స్‌కి కూడా రుచింపదు. ఇక దర్శకుడు బాలయ్యకు వీరాభిమాని. అందుకే.. మాస్ ఎలివేషన్స్‌‌పై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టలేదని అనిపిస్తుంది. కీ పాయింట్‌ బాగున్నా.. దాని చుట్టూ అల్లిన కథ మరీ రొటీన్‌గా, బాలయ్యవే పాత చిత్రాలు గుర్తొచ్చేలా చేస్తుంది. సీమ మంచి కోసం కత్తి పట్టిన అన్నపై 30 సంవత్సరాల నుంచి పెంచుకున్న పగని, చిన్న విషయంతో పోగొట్టే సీన్స్ లాజిక్‌గా అనిపించవు.

కొన్ని డైలాగ్స్ కూడా లాజిక్ లేకుండా ఉంటాయి. ఇక విలన్ ముసలి మడుగు ప్రతాపరెడ్డి (దునియా విజయ్), వీర సింహారెడ్డి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి పండగే కానీ.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం వామ్మో ఏంటీ రక్తపాతం, ఏంటీ ఊచకోత అని తలపిస్తుంది. పెళ్లిలో వచ్చే ఫైట్‌ని ఫైట్ మాస్టర్స్ వెరైటీగా చిత్రీకరించారు. అది బాగా ఆకట్టుకుంటుంది.

అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చిన ప్రతిసారి సౌండ్స్ దద్దరిల్లిపోతాయి. థమన్ అక్కరలేని మ్యూజిక్‌తో చెవులు దిబ్బలయ్యేలా చేశాడు. రొటీన్ కథే అయినా.. మాస్ మసాలా ట్రీట్ మాత్రం ఈ సినిమాలో మాములుగా ఉండదు. పాటలకి పాటలు, ఫైట్స్‌కి ఫైట్స్, డైలాగ్స్ కి డైలాగ్స్.. మాస్ ఆడియన్స్‌కి.. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు ఏమేం కావాలో.. వాటన్నింటినీ గోపీచంద్ ఈ సినిమాలో పొందుపరిచాడు.

కాకపోతే కథని లాజిక్‌కి అందనంత దూరంలో పెట్టేశాడు. ఏదయితేనేం బి,సీ సెంటర్స్ ఆడియన్స్‌కి మాత్రం పండగే. ఈ పండుగకి వచ్చే ఇంకా ఇతర సినిమాల రిజల్ట్ కనుక తేడా కొడితే మాత్రం.. మరోసారి బాలయ్య‌కు ‘అఖండ’మైన విజయం లభించినట్లే. ఏదైనా మంచి సినిమా పడితే మాత్రం.. ఆ స్థాయి విజయం మాత్రం కష్టమే.

పండగ సీజన్ కాబట్టి.. ఎలా ఉన్నా, సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూసే ఛాన్స్ ఉంది కాబట్టి.. కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశమైతే లేకపోలేదు. మొత్తంగా అయితే.. రొటీన్ కథతో పండగకి వచ్చిన ఫ్యాక్షన్ మాస్ సినిమా ఇది.

ట్యాగ్‌లైన్: ఫ్యాన్స్‌కే జై బాలయ్య.. కొత్తదనం ఏం లేనేలేదయ్యా
రేటింగ్: 2.75/5

Updated On 14 Jan 2023 4:25 AM GMT
krs

krs

Next Story