Victims of the Gulf |
- 32 శాసనసభ స్థానాల్లో గల్ఫ్ కార్మికుల ప్రాబల్యం
- పోటీకి సిద్ధం అంటున్న గల్ఫ్ వలస కార్మికులు, గల్ఫ్ మృతుల భార్యలు
విధాత బ్యూరో, కరీంనగర్: పసుపు బోర్డు సాధన కోసం గత లోక్‌సభ ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి రాజకీయ పార్టీల్లో అలజడి రేపిన పసుపు రైతుల బాటను.. గల్ఫ్ వలస కార్మిక కుటుంబాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
రానున్న శాసనసభ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల వలసలు ఎక్కువగా ఉన్న 32 శాసనసభ నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులు (Victims of the Gulf), గల్ఫ్ మృతుల భార్యలు పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ పరిణామం ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు దారి తీయనుంది. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ లో భాగంగా గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానానికి 170 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి తమ సంఘటితశక్తిని నిరూపించారు.
వీరి నామినేషన్ ఫీజులను సైతం రైతు సంఘాలే స్వయంగా భరించడం విశేషం. అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రస్తుతం గల్ఫ్ వలస కార్మికులు సిద్ధం అవుతుండడం రాజకీయ పార్టీలకు శరాఘాతం లాంటిదే.
తెలంగాణ ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్న మాటను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు విస్మరించారు. కరోనా సమయంలో క్వారంటైన్ పేరిట 8000 చొప్పున వసూలు చేయడం వలస కార్మికుల ఆగ్రహానికి కారణం అయ్యాయి.
తెలంగాణ ఏర్పడిన ఈ 8 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి చెందిన సుమారు 1800 మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. ఈ కుటుంబాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయి, ధన్యమైన స్థితిలో జీవితాలు వెల్లదీస్తున్నాయి. ఉపాధి హామీ పనులు, బీడీలు చుట్టడం ద్వారానే వారు పొట్ట పోసుకోవాల్సి వస్తుంది.
రాజకీయ పోరాటమే మార్గం
బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నది గల్ఫ్ కార్మికుల ప్రధాన ఆరోపణ. తమ సమస్యల సాధన కోసం రాజకీయ వేదికకు మించింది లేదన్నది వారి ఆలోచన.
తెలంగాణలోని గల్ఫ్ ప్రభావిత శాసనసభ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి డిమాండ్లు సాధించుకోవాలన్నది వారి కోరిక. శాసనసభ ఎన్నికల్లో పోటీ అంశమై గల్ఫ్ వలస కార్మిక కుటుంబాలు ఇప్పటికే గల్ఫ్ జేఏసి, గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరంతో పాటు వివిధ కార్మిక, ప్రజాసంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు.
15 లక్షల మంది
ఎడారి దేశాల్లో తెలంగాణ నుండి బతుకుతెరువు కోసం వలస వెళ్లిన కూలీలు 15 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. గడచిన దశాబ్ద కాలంలో మరో 15 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చి గ్రామాల్లో ఉపాధి లేక, ప్రభుత్వం నుండి సహాయం అందక దుర్భర జీవితాలు వెల్లదీస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే గల్ఫ్ కార్మికుల ఓటు బ్యాంకు సుమారు కోటి వరకు ఉంటుంది. 32 శాసనసభ నియోజకవర్గాల్లో వీరు ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి.
అమలుకునోచని 500 కోట్ల బడ్జెట్
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం వార్షిక బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వ హామీ ఎదురుచూపులకే పరిమితం అవుతోంది. దీంతో అధికార బీఆర్ఎస్‌పై ఉన్న భ్రమలు గల్ఫ్ కార్మికులలో తొలగిపోతున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ఆరంభించాయి.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని ఈ పార్టీల నేతలు పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పన చేసే దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. ఇందుకోసం ఓ కమిటీని నియమించింది.
ఈ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికులే కీలకం
తెలంగాణలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్(ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి(ఎస్సీ), బాల్కొండ,ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి(ఎస్సీ), ఎల్లారెడ్డి,కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల ప్రాబల్యం అధికం.
అదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూర్(ఎస్సీ),
నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి నియోజకవర్గాల్లో వీరి సంఖ్య చెప్పుకో తగిన స్థాయిలో ఉంది.
ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి
తెలంగాణ ఉద్యమ సమయంలో ముంబాయి..దుబాయి..బొగ్గుబాయి నినాదం తెలంగాణ రాష్ట్ర సమితికి ఓ అస్రంలా పనిచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ సమస్యలపై అధికార పార్టీ దృష్టి సారించకపోవడం, వలస కార్మికుల డిమాండ్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో దుబాయి.. బొగ్గుబాయి నినాదం తిరగబడే పరిస్థితి సృష్టిస్తోంది.