Tuesday, January 31, 2023
More
    Homelatestవిరాట్‌ విజృంభణ.. భారత్‌ సూపర్‌ విక్టరీ (రికార్డుల జాతర)

    విరాట్‌ విజృంభణ.. భారత్‌ సూపర్‌ విక్టరీ (రికార్డుల జాతర)

    విధాత: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో బారత్‌ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్ లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.

    కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 42 పరుగులు చేసి శుభారంభాన్ని అందించారు. అనంతరం శుభ్‌మన్‌ (116), కోహ్లీ (166 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ. కోహ్లీకి 46వ సెంచరీ. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమారా, రజిత తలో రెండు వికెట్లు తీశారు. కరుణరత్నే ఒక వికెట్‌ పడగొట్టాడు.

    క్లీన్‌స్వీప్‌

    భారత్‌ నిర్దేశించిన 391 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక చతికిలపడిపోయింది. భారత బౌలర్ల ధాటికి 22 ఓవర్లకు 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. గాయపడిన బండారా, వాండర్‌సే బ్యాటింగ్‌కు రాలేదు. వాండర్‌సేకి కంకసన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వెల్లాలాగే బ్యాటింగ్‌కు వచ్చాడు. లంక బ్యాటర్లలో నవనిదు ఫెర్నాండో (19) టాప్‌ స్కోరర్‌. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

    కోహ్లీ మరో రెండు రికార్డులు

    ఈ సెంచరీతో కోహ్లీ రెండు రికార్డులు సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాటిగా సచిన్‌( 20) పేరుతో ఉన్న రికార్డును కోహ్లీ తాజాగా బద్దలు కొట్టాడు. ఆయనకు ఇది 21వ సెంచరీ. అలాగే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ ఐదవ స్థానంలోకి చేరాడు. ప్రస్తుతం 12,754 పరుగులు చేసి శ్రీలంక మాజీ కెప్టెన్‌ జయవర్దనే పేరుతో (12,650) వెనక్కీ నెట్టాడు. సచిన్‌ (18,426) పరుగులతో అందరికంటే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

    వన్డేల్లో భారత్‌ ప్రపంచ రికార్డు

    మూడో వన్డేలో శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్‌ విక్టరీ సాధించిన టీమిండియా వన్డే క్రికెట్‌లో చరిత్రలో మరో రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ పేరిట ఉన్న రికార్డును తాజా విజయంతో భారత్‌ అధిగమించింది. తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా (275), దక్షిణాఫ్రికా (272), దక్షిణాఫ్రికా (258), భారత్‌ ‘257) అత్యధిక పరుగులతో ఉన్నాయి. టాప్‌ 6 స్థానాల్లో దక్షిణాఫ్రికా, భారత్‌ రెండుసార్లు ఉండటం విశేషం.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular