Tuesday, January 31, 2023
More
  Homelatest‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ: వీరయ్యా.. ఇది చాలదయ్యా!

  ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ: వీరయ్యా.. ఇది చాలదయ్యా!

  మూవీ పేరు: ‘వాల్తేరు వీరయ్య’
  విడుదల తేదీ: 13 జనవరి 2023
  నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, కేథరీన్ థ్రెసా, నాజర్, బాబీ సింహా తదితరులు
  సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్
  ఎడిటింగ్: నిరంజన్
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి
  నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్
  కథ, దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)

  విధాత‌: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే.. ఒకప్పుడు పండగ వాతావరణం ఉండేది. ఆయన రీఎంట్రీలో ఆ వాతావరణం లోపించిందనే చెప్పాలి. అందుకు కారణాలు అనేకం. ఇక ఈ మధ్య చిరంజీవి చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీగా ఊహించుకోవడం, అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోవడంతో.. కొంతకాలంగా మెగాభిమానులు మెగాస్టార్ నుంచి ఒక మంచి హిట్ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

  అలాంటి హిట్ ఇచ్చేస్తున్నానంటూ ఒక అభిమానిగా దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’తో హోప్ కలిగించాడు. తన అభిమాన హీరోని, అలాగే తనకు లైఫ్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజలని కలిపి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సెట్ చేశాడు. పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని.. ఆయన అభిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తే బ్లాక్‌బస్టర్ హిట్టయింది.

  ఇప్పుడు చిరు అభిమాని చిరుని డైరెక్ట్ చేస్తుండటంతో.. ఆకాశమే అవధి అన్నట్లుగా ‘వాల్తేరు వీరయ్య’పై మెగా ఫ్యాన్స్ అంచనాలను పెంచేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్.. వాటిలో చిరు కనిపించిన తీరు.. సినిమాపై భారీ క్రేజ్‌ని తీసుకొచ్చాయి.

  హిట్ కళ కనబడుతుందనేలా మాట్లాడుకునేలా చేశాయి. మరి అలాంటి టాక్ నడుమ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం.

  కథ:

  సముద్రంలో అణువణువు తెలిసిన ‘వాల్తేరు వీరయ్య’.. జాలరుపేటలోని అందరికీ తలలోని నాలుకలా ఉంటాడు. అవసరం అనుకునే వారికి తప్పక సహాయం చేస్తుంటాడు. పోర్ట్‌లో ఉండే నేవీ అధికారులు కూడా వీరయ్య సహాయం తీసుకుంటూ ఉంటారు.

  ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి సీతాపతి (రాజేంద్రప్రసాద్) అనుకోకుండా సస్పెండ్ అవుతాడు. అతను సస్పెండ్ అవడానికి కారణం.. సముద్రాన్ని అడ్డాగా చేసుకుని సాల్మన్ సీజర్ (బాబీ సింహా) చేస్తున్న డ్రగ్ మాఫియా అని తెలుసుకున్న సీతాపతి.. వీరయ్య సహాయం కోరతాడు. సీతాపతి, వీరయ్యల మధ్య డీల్ ఓకే అయిన తర్వాత కట్ చేస్తే మలేషియా.

  మలేషియాలో ఉండే సాల్మన్‌ని పట్టుకోవడానికి ఊర మాస్ అవతారంలో వీరయ్య మలేషియాలో దిగుతాడు. అయితే వీరయ్య మలేషియా వెళ్లింది ఒక్క సాల్మన్ కోసమే కాదు.. అతని అన్న మైఖేల్ సీజర్ కోసమని తర్వాత తెలుస్తుంది. అసలు ఈ మైఖేల్ సీజర్ ఎవరు? అతనికి, వీరయ్యకి ఉన్న సంబంధం ఏమిటి?

  ఓ నిజాయితీ ఆఫీసర్ అయిన ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ)కి.. వీరయ్య, మైఖేల్‌కి ఉన్న సంబంధం ఏమిటి? మైఖేల్ కోసం తిరిగే రా ఏజంట్ అతిథి(శృతిహాసన్) పాత్ర ఏంటి? అతిథి, వీరయ్యకు ఎలా హెల్ప్ చేసింది? అసలు వీరయ్య పోరాటం దేని కోసం? అనే విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం చూడాల్సిందే.

  నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

  ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మెగాస్టార్ చిరంజీవి షో అని చెప్పాలి. చిరు లుక్, కామెడీ టైమింగ్, డ్యాన్స్, డైలాగ్స్.. ఒక్కటేమిటి? ప్రతీది వింటేజ్ చిరుని గుర్తుకు తెస్తుంది. ఈ సినిమా కోసం చిరంజీవి పెట్టిన ఎఫర్ట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. తెరపై చిరంజీవి కనిపించే తీరు, యాక్షన్ ఎపిసోడ్స్.. నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. చాలా కాలంగా చిరుని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో.. అలా ఇందులో చిరు కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు.

  ఆశ్చర్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఆయన ఏజ్‌‌కి ఇచ్చే రెస్పెక్ట్ అది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా గత కొన్ని సినిమాలుగా పేలవమైన ఫేస్‌తో కనిపించి.. అభిమానులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. కానీ ఇందులో రవితేజ కూడా తన మునుపటి ఛార్మ్‌తో అలరించాడు. విక్రమ్ సాగర్ పాత్రకి రవితేజ యాఫ్ట్. ఇంకా చెప్పాలంటే విక్రమార్కుడు రవితేజ కనిపిస్తాడు.

  ఇక చిరు, రవితేజల మధ్య వచ్చే సీన్స్.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి పండగే. శృతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ.. ఉన్నంతలో ఆమెకి చాలా మంచి పాత్ర అని చెప్పుకోవాలి. ఆమెను డ్యాన్స్‌లకే పరిమితం చేయకుండా యాక్షన్ ఎపిసోడ్స్‌కి కూడా వినియోగించారు. కేథరీన్ కనిపించేది కొద్ది సేపే కానీ.. ఆమె పాత్రకు ఓ ప్రయారిటీ ఇచ్చారు. ఆమె కూడా చక్కగా నటించింది.

  ఇక బాబీ, ప్రకాశ్ రాజ్ పాత్రల చిత్రీకరణ బాగున్నా.. బలమైన సన్నివేశాలు మాత్రం వారికి కరువయ్యాయి. యాక్షన్‌కు మాత్రమే అన్నట్లుగా వారిని తీసుకున్నారు. ఇక కామెడీ కోసం అని తీసుకున్న బ్యాచ్ అంతా వారి పరిధిమేర నవ్వించే ప్రయత్నం చేశారు.

  రాజేంద్రప్రసాద్‌కి ఓ మంచి పాత్ర పడింది. సత్యరాజ్, వెన్నెల కిశోర్ వంటి వారు కామెడీతో అలరించారు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా.. వారికి దక్కిన పాత్రలకు న్యాయం చేశారు.

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రెండు పాటలు, నేపథ్య సంగీతం హైలెట్‌గా ఉన్నాయి. అలాగే కెమెరా పనితనం ఈ సినిమాకి ప్లస్. సముద్రపు సీన్లు, మలేషియా.. ఇలా వైవిధ్యంగా కెమెరా పనితనం కనిపించింది. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కూడా ప్రశంసలందుకుంటుంది. సెట్స్ చక్కగా కుదిరాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మరోసారి తమ చిరు అభిమానాన్ని చాటుకున్నారు.

  యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌లో కత్తెర పడాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటిపై కత్తెర పడి ఉంటే.. ఇంకాస్త క్రిస్ప్‌గా సినిమా ఉండేది. దాదాపు ముగ్గురు ఈ సినిమాకి రచనా విభాగంలో పనిచేశారు. కోన వెంకట్, బాబీ, చక్రవర్తి ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించారు.

  వారి ఎఫర్ట్ అంతగా ప్రభావం అయితే చూపలేదు. ఇంకా బాబీ విషయానికి వస్తే.. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని అయితే ఇచ్చాడు కానీ.. అసలు విషయం లేని కథని ఎన్నుకుని.. ఎంత వరకు ఇమేజ్‌తోనే నెట్టుకు రావాలని ప్రయత్నించినట్లుగా అనిపించింది. నిర్మాణ విలువల పరంగా మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

  ‘వీరసింహా రెడ్డి’ రివ్యూ: ఫ్యాన్స్‌కే జై బాలయ్య.. అంతా రొటీనేనయ్యా!

  విశ్లేషణ:

  చిరంజీవి వయసును దృష్టిలో పెట్టుకున్నాడో.. లేదంటే తన చిన్నప్పుడు చూసిన చిరంజీవిని మళ్లీ తెరపై చూడాలని అనుకున్నాడో తెలియదు కానీ.. దర్శకుడు బాబీ మాత్రం వీరయ్య విషయంలో కొత్తదనం ఏదీ చూపించలేకపోయాడు. బహుశా చిరంజీవి నుంచి ప్రేక్షకులు ఇవే కోరుకుంటారని బలంగా మనసులో ముద్ర వేసుకున్నట్లు ఉన్నాడు.

  ఆయనని పాత రోజులకి తీసుకువెళ్లేందుకు చేసే ప్రయత్నం.. కథపై కూడా పెట్టి ఉంటే మాత్రం.. ఇటీవల కమల్‌కి పడిన ‘విక్రమ్’.. సినిమాలా చిరుకి ‘వీరయ్య’ మిగిలేది. కానీ అది జరగలేదు. 10 నిమిషాలకో ఎలివేషన్ సీన్ పెట్టి.. సినిమాని లాగించే ప్రయత్నం చేశాడు. అయితే చిరంజీవిని కానీ, రవితేజని కానీ ఆయన చూపించిన తీరు మాత్రం అదుర్స్ అని చెప్పాలి.

  ఫ్యాన్స్‌కి అయితే పండగే. కానీ సాధారణ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇంకాస్త మంచి అవుట్‌ఫుట్ వచ్చి ఉండేది.. అప్పుడందరికీ నచ్చి ఉండేది. చాలా కాలంగా మిస్ అవుతున్న చిరు మార్క్ కామెడీనీ, ఫైట్స్‌ని మళ్లీ తిరిగి గుర్తు చేశాడు. చిరుతో పాటు కమెడియన్స్ మధ్య వచ్చే సన్నివేశాలలో చిరు కామెడీ టైమింగ్ థియేటర్లలో కూర్చున్న వారందరితో క్లాప్స్ కొట్టిస్తుంది.. నవ్విస్తుంది. ఈ విషయంలో బాబీ సక్సెస్ అయినట్లే.

  సుమన్‌పై కేసు.. ఓ పోరంబోకు వల్లే: చిరంజీవి

  ఒక్కొక్క పాత్రని పరిచయం చేసుకుంటూ.. అసలు కథలోకి తీసుకెళ్లారు. ఇంటర్వెల్‌కి మాంచి ఊపు ఇచ్చి.. సెకండాఫ్‌పై ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. సెకండాఫ్ రవితేజ ఎంటరైన తర్వాత వచ్చే సీన్లు.. కేకలు వేయిస్తాయి. లాస్ట్‌లో ఎమోషనల్ కంటెంట్ మిక్స్ చేసి.. అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయనేలా.. చూస్తున్న ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు కానీ.. ఇంకా ఏదో కావాలనేలా మాత్రం చేశాడు.

  ఆ ఇంకా ఏదో అనేదే ఈ సినిమా రిజల్ట్‌ని నిర్దేశిస్తుంది. చిరుతో కొత్త కథ చేసి చేతులు కాల్చుకునే కంటే.. ఆయనని అభిమానించే వారిని మెప్పిస్తే చాలని బాబీ ఆలోచించాడు కాబట్టే.. ఎక్కడో ఉండాల్సిన సినిమా.. కాస్త డౌన్ అయింది. అయితేనేం సంక్రాంతికి కావాల్సిన, రావాల్సిన సినిమాగా మాత్రం ఇది మంచి మార్కులు వేయించుకుంటుంది.

  యాక్షన్, చిరు-రవితేజ ఎపిసోడ్స్, చిరు కామెడీ టైమింగ్.. బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ సాంగ్స్ ఈ సినిమాకి ప్రధాన హైలెట్స్. కథ, కథనంతో పాటు కొన్ని ఎమోషన్స్ మరీ కృత్రిమంగా అనిపించడం ఈ సినిమాకి ఉన్న నెగిటివ్స్. మొత్తంగా అయితే.. పూనకాలు లోడ్ అవ్వాల్సిన విధంగా అయితే అవలేదు.. కానీ ఈ వీరయ్య డిజప్పాయింట్ అయితే చేయడు. పండగకి నిలబడే చిత్రమనే చెప్పుకోవచ్చు.

  ట్యాగ్‌లైన్: వీరయ్యా.. ఇది చాలదయ్యా!
  రేటింగ్: 2.75/5

  ‘తెగింపు’ రివ్యూ: ఫ్యాన్సే తెగించాలి

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular