- ఈ నెల 9 నుండి 15 వరకు నర్సంపేట నియోజకవర్గంలో ఉత్తరాల నిరసన
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
War of letters of employment workers
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తుంది. అందులో భాగంగా ఇటీవల బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి 33 వేల కోట్ల రూపాయలని తగ్గించిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 9 నుండి 15 వరకు వారం రోజుల పాటు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి ఉత్తరాలు రాసి నిరసన తెలియచేయాలని రైతులకు ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఉపాధి హామీ నిధులు తగ్గించిందన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గం.లు పని చేసిన కూలికి 480/- ఇవ్వాలని ఉన్నప్పటికి ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ అందటం లేదన్నారు.
లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన రోజు వారి కూలీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. గ్రామానికి అవసరమైన పనులను చేయించకుండా కేంద్రం చూపించిన పనులు మాత్రమే చేయాలని ససర్క్యులర్ జారీ చేసిందన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం వల్ల చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
వ్యవసాయ కూలికి రోజుకు 257/- ఇవ్వాలని చట్టం ఉన్నప్పుటికీ ఏ ఒక్క కూలికి 100/- కు మించడం లేదన్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌళిక సదుపాయాలు (టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు) అందించాలన్నారు. వ్యవసాయంతో అనుసంధానం చేయటం వల్ల రైతులకు, కూలీలకు గిట్టుబాటు అవుతుందన్నారు. పంట స్థాయిని బట్టి ఎకరానికి కూలీ టోకెన్లు, మస్టర్‌లో 100 పని దినాలు వుండే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు.