Warangal
- రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
- మీడియాతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది
- చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే ప్రతిపాదన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణంగా ఏ నియోజకవర్గమైన అధికార విపక్షాల మధ్య రాజకీయ విమర్శలుంటాయి. అభివృద్ధి, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ స్థానిక ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. విపక్షాల తీరుపై ఎమ్మెల్యే కూడా అప్పుడప్పుడు ఇబ్బందికి లోనవుతారు. కానీ దీనికి భిన్నంగా మూడేళ్ల క్రితమే నియోజకవర్గ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని విపక్షాలకు విన్నవించగా ఇప్పటివరకు వారి నుంచి తగిన స్పందన లేదని ఎమ్మెల్యే మీడియా ముఖంగా గుర్తు చేయడంతో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికైనా నియోజకవర్గస్థాయి వ్యక్తులు అభివృద్ధి, నిధులు, ఏ విషయమైనా సలహాలు, సూచనలు ఇవ్వచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే స్పందనకు విపక్షాల ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుందో అనే చర్చ స్థానికంగా సాగుతోంది.
సలహాలు ఆహ్వానించినా స్పందన లేదు..
అభివృద్ధి పై సలహాలు కోరినా మూడు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే రాజకీయ కోణంలో చూడకుండా మా దృష్టికి తీసుకువస్తే ఆ పనిని చేస్తామని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి పై బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కామెంట్స్ ఇలా ఉన్నాయి. నర్సంపేట నెంబర్ వన్ స్థాయికి వచ్చింది. రాజకీయ పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా అభివృద్ధికి నిధులను తీసుకువచ్చాను. పనుల పైన అక్కడక్కడ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి పనుల మీద అవగాహన పెంచుకొని మాట్లాడాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే చెప్పారు.
దళితులకు వెయ్యి యూనిట్ల బర్రెలు
దళితులకు రూ.20 కోట్లతో మరో 1000 యూనిట్ల పాడి బర్రెల (రెండు బర్రెలు) యూనిట్లు మంజూరయ్యాయి. త్వరలో బర్రెల కొనుగోలు ప్రారంభం. ఎడ్యుకేషన్ , మార్కెటింగ్, ఇరిగేషన్ డిపార్ట్మెంటులో ఒకేసారి ఎప్పుడూ రానటువంటి నిధులను ఎప్పుడు చేయనటువంటి పనులను ఏకకాలంలో చేపట్టాం. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, సంబంధిత అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు.
రూ.350 కోట్లతో సీసీ రోడ్డు పనులు
118 గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి. 294 గ్రామాలు, పల్లెలు తండాలలో రూ.350 కోట్లతో సీసీ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం సిసి రోడ్లు, బీటీ రోడ్లు అన్నీ కలుపుకొని 394 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ వర్షాకాలంలోపు పెండింగ్లో ఉన్న రోడ్డు పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
గృహలక్ష్మీ పథకం ద్వారా లబ్ధి
గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లో అర్హులను గుర్తించి మూడు వారాల్లో ఎంపిక పూర్తి చేస్తాం. ఇప్పటివరకు 4500 ఇల్లు అందుబాటులో ఉన్నాయి. మరో 3000 ఇండ్లు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరితే సానుకూలంగా స్పందించి లేఖ పంపారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు.