Warangal
- కొందరికి ఎన్నికలోస్తేనే ప్రజా సమస్యలు, దేవుళ్ళు గుర్తుకు వస్తారు
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బిజెపికి చట్టాల పై నమ్మకం ఉంటే విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ బిజెపి నాయకులను డిమాండ్ చేశారు.
కొన్ని పనికి మాలిన రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు, దేవుళ్ళు గుర్తుకు వస్తాయని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
తమ ఉనికి చాటుకోవడానికి కనీసం కార్పొరేటర్ గా గెలవని నాయకులు సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిలో ఉత్తేజాన్ని నింపుతామన్నారు. 9 ఏండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలొనే అగ్రభాగాన నిలిపారన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారు? 40 ఏండ్ల నుండి గుడిసెలు వేసుకొని, అధికారులు ఎప్పుడు వస్తారో అని బిక్కు బిక్కుబిక్కుమంటూ ఉంటున్న వారిని ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.
జి ఓ, 58, 59 ద్వారా గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలను ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రంలల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? అని అడిగారు. 2009 లో కాళోజీ కళాక్షేత్రం కోసం 300 గజాల భూమి అడిగితే ఇవ్వని పరిస్థితి. సీఎం కేసీఆర్ 3000 గజాల భూమిలో భవనాన్ని నిర్మిస్తున్నామని వివరించారు.
ఇంత అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు కండ్లు ఉన్న కాబోదులు లాగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ కు పర్యటకునిగా వచ్చి వెళ్లాడు తప్ప ఒక్కరూపాయి కేటాయించలేదని విమర్శించారు. వరంగల్ కు ఐటి కంపనీలు తరలి వస్తున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. శుక్రవారం జరిగిన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.