- కేఎంసీ వద్ద పోలీసు బందోబస్తు
- ఎంజీఎం వద్ద నిరసనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కేఎంసీ, ఎంజీఎం సెంటర్లో వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నిరసనలతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. మెడికో డాక్టర్ ప్రీతి మృతి నేపథ్యంలో వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు వరుసగా ఆందోళన చేస్తున్నాయి. కేఎంసీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసి ప్రీతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎంజీఎం సెంటర్లోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఆకస్మికంగా చేస్తున్న ఆందోళనతో పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రీతి మృతి నేపథ్యంలో కేఎంసీ మెయిన్ గేటు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెంటర్లో పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిరసనలు ఆందోళన చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు.
ఏబీవీపీ ఆందోళన
కేఎంసీని ముట్టడించేందుకు వచ్చిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వివాదం తోపులాట జరగగా, వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీజేపీ ధర్నా
మెడికో విద్యార్థిని ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వరంగల్ ఎంజీఎం కూడలిలో బీజేపీ నాయకుడు కుసుమ సతీష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి హసన్పర్తికి తరలించారు.
మహిళా సంఘం నిరసన
వరంగల్ ఎంజీఎం జంక్షన్ వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం నాయకురాలు నలుగంటి రత్నమాల ఆధ్వర్యంలో మహిళలతో ధర్నా చేశారు. అందరిని చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.