Warangal ఏక పక్షం మొగ్గు చూపకుండా ప్రజల తీర్పు మధ్యలో టీడీపీ మెరుపులు వామపక్షాలు, బీజేపీ చణుకులు ఓరుగల్లు రాజకీయ చిత్రపటం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ రాజకీయ ముఖచిత్రంపై కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ జిల్లా ఓటర్లు తొలి నుంచీ సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. ఏకపక్షం వైపు వహించకుండా విపక్షాలను కూడా గౌరవిస్తూ వారికి కొన్ని సీట్లను కల్పిస్తూ అధికార, ప్రతిపక్షాల మధ్య అభివృద్ధి ఘర్షణ కొనసాగేలా జిల్లా […]

Warangal

  • ఏక పక్షం మొగ్గు చూపకుండా ప్రజల తీర్పు
  • మధ్యలో టీడీపీ మెరుపులు
  • వామపక్షాలు, బీజేపీ చణుకులు
  • ఓరుగల్లు రాజకీయ చిత్రపటం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ రాజకీయ ముఖచిత్రంపై కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ జిల్లా ఓటర్లు తొలి నుంచీ సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. ఏకపక్షం వైపు వహించకుండా విపక్షాలను కూడా గౌరవిస్తూ వారికి కొన్ని సీట్లను కల్పిస్తూ అధికార, ప్రతిపక్షాల మధ్య అభివృద్ధి ఘర్షణ కొనసాగేలా జిల్లా ప్రజలు తీర్పునిస్తూ వచ్చారు.

నిజాం గద్దె దిగిన అనంతరం

నిజాం సర్కార్ నుంచి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో భాగస్వామ్యమైన అనంతరం వరంగల్ జిల్లాలో 1952లో తొలిసారి శాసనసభ ఎన్నికలు జరిగాయి. నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వరకు దాదాపు 16 దఫాలుగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. అడపాదడపా కొన్ని సెగ్మెంట్లలో ఉప ఎన్నికలూ జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో రెండు పర్యాయాలు ఉప ఎన్నికలు వచ్చాయి. దాదాపు 7 దశాబ్దాల ఎన్నికల అనుభవాన్ని పరిశీలిస్తే వరంగల్ రాజకీయ ముఖచిత్రం సుస్పష్టమవుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 నుంచి 12 అసెంబ్లీ సెగ్మెంట్లు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పరకాల, భూపాల్పల్లి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ కలుపుకొని ప్రస్తుతం 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009 ఎన్నికల వరకు ఉనికిలో ఉన్న చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. గతంలో ఉన్న శాయంపేట, చెన్నూరు నియోజకవర్గం పేరు, పరిధి మారాయి.

2018 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలుపొందగా 2 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఇందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. దీంతో 11 స్థానాలకు టీఆర్ఎస్ బలం చేరింది.

ఐదు దశలుగా ఎన్నికల ఫలితాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడు దశాబ్దాలుగా 16 పర్యాయాలు శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలను.. స్థూలంగా 5 దశలుగా విభజించవచ్చు.

  • 1952 నుంచి 67 వరకు
  • 1967 నుంచి 1994 వరకు
  • 1994 నుంచి 2004 వరకు
  • 2004 నుంచి 2014 వరకు
  • 2014 నుంచి 2023 వరకు

తొలి దశ

- 1952 మొదటి శాసనసభ ఎన్నికల నుంచి 1967 వరకు ఒక దశగా లెక్కిస్తే, ఈమధ్య 4 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. వరంగల్ జిల్లా రాజకీయ చిత్రపటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోటీ కొనసాగగా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సాధించింది. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు పీడీఎఫ్ పేరుతో పోటీ చేసి స్వాతంత్ర్య సమరానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి దీటైన ప్రతిపక్షంగా నిలిచింది.

రెండో దశ

1967 నుంచి 1994 వరకు మరొక దశగా పేర్కొనవచ్చు. ఈ మధ్యకాలంలో ఆరు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయినప్పటికీ కాంగ్రెస్కు ఏకపక్ష ఫలితాలు ఇవ్వకుండా, ఈ మధ్యకాలంలో 1983లో ఆవిర్భవించిన టీడీపీ కూడా బలమైన రాజకీయ పార్టీగా తన పట్టు చాటుతూ వచ్చింది. టీడీపీ, వామపక్షాలు అప్పుడప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రతిపక్షాలుగా కొనసాగుతూ తమదైన రాజకీయ విపక్షపాత్రను నిర్వహించాయి.

మూడో దశ

1994 నుంచి 2004 వరకు మరొక దశగా పేర్కొంటే ఈ మధ్యకాలంలో మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతూ టీడీపీ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. అయితే వామపక్షాలతో కలిసి టీడీపీ ప్రయాణం సాగింది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటాపోటీ ఫలితాలు వచ్చాయి.

నాలుగో దశ

2004 నుంచి ప్రస్తుత 2014వరకు మరొక దశగా అభివర్ణించవచ్చు. ఈ మధ్యకాలంలో రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చింది. అయినప్పటికీ విపక్ష స్థానాల్లో టీడీపీ బలమైన ప్రతిపక్షంగా కొనసాగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన టీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో మాత్రం బలంగానే తన ఉనికిని చాటుతూ ప్రస్థానాన్ని కొనసాగించింది.

ఐదో దశ

2014 నుంచి 2023 వరకు మరొక దశగా చెప్పుకుంటే ఈ మధ్యకాలంలో రెండు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జరిగిన ఎన్నికలు గా వీటిని గుర్తించాలి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకోగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ తన ప్రాతినిధ్యాన్ని చాటుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో జరిగిన బేరసారాలు, ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరడంతో దాని పట్టు బాగా పెరిగింది. టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బాగా బలహీన పడింది. ఆ విధంగా తొలిసారి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఏకపక్ష రాజకీయ పార్టీ అధిపత్యం ఉనికిలోకి వచ్చిందని చెప్పవచ్చు.

ఎన్నికల బరిలో ఎందరో ప్రముఖులు

1952 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికలలో ఎందరో ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరు విజయం సాధించగా మరి కొందరు అపజయాన్ని చవిచూశారు. ఇందులో అనేకమంది వరుసగా గెలుపొంది మంత్రి పదవులు నిర్వహించారు. పార్టీలో వివిధ బాధ్యతలు కొనసాగించినవారున్నారు.

గెలిచిన వారిలో ఎమ్మెస్ రాజలింగం, ఉమా రెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, పెండ్యాల రాఘవరావు, హయగ్రీవ చారి, రామసహాయం సురేందర్ రెడ్డి, కమాలుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, ఏసి రెడ్డి నరసింహారెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎన్ యతిరాజరావు, ఎస్వీ ప్రసాద్, డీఎస్ రెడ్యానాయక్, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, మద్ది కాయల ఓంకార్, మాదాటి నరసింహారెడ్డి, బసవరాజ్ సారయ్య, చందుపట్ల జంగారెడ్డి, అజ్మీర చందూలాల్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిమ్మ రాజిరెడ్డితో పాటు కొండా సురేఖ, ధనసరి సీతక్క, కనక రత్నమ్మ, ఎన్ విమలాదేవి, సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత తదితర మహిళలు కూడా ఉన్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా, పీసీసీ ప్రెసిడెంట్ గా, ప్రతిపక్ష నాయకులుగా పేరుందిన నాయకులు ఉన్నారు.

విజయం వరించని నేతలు

ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించని వారిలో కాళోజీ నారాయణరావు, భూపతి కృష్ణమూర్తి, నూకల నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో హనుమకొండ నుంచి పోటీ చేసిన పీవీ నరసింహారావు జంగారెడ్డి చేతిలో ఓటమిపాలైన చరిత్ర కూడా వరంగల్ కు ఉంది.

Updated On 2 Jun 2023 11:57 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story